కాంగ్రెస్‌కు ‘సైలెంట్‌ వేవ్‌’ దడ!

Strategic changes in the Congress election campaign - Sakshi

ప్రచార సరళిలో వ్యూహాత్మక మార్పులు 

ఓటర్ల దృష్టి ‘ఢిల్లీ’కి మళ్లేలా యత్నాలు 

టీఆర్‌ఎస్‌ నుంచి రాజకీయానుభవం లేని అభ్యర్థులున్న ఐదు స్థానాలపై గురి 

బాగా కష్టపడితే అక్కడ గెలుపు సాధ్యమన్న ధీమాతో ఎత్తుగడలు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ను గత అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలు చేసిన టీఆర్‌ఎస్‌ ‘సైలెంట్‌ వేవ్‌’వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరహాలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కనిపిస్తుందా అన్న ఆందోళన కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ పనితీరుపై జనం అసంతృప్తితో ఉన్నందున గెలుపు తథ్యమన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాకిచ్చింది ‘సైలెంట్‌ వేవ్‌’. ప్రచారం మొదలు ఫలితాలు వెలువడే రోజు వరకు కాంగ్రెస్‌లో ధీమా కన్పించింది. అందుకే గెలుపుపై టీఆర్‌ఎస్‌తో సవాల్‌ చేసే స్థాయికి వెళ్లింది. కానీ ఫలితాల సరళి మొదలైన తర్వాత జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. గెలుస్తామనుకున్న తరుణం లో ఇంత ఘోర ఓటమి ఏంటని నేతలు నమ్మకం కుదరక.. ‘ఏదో జరిగి ఉంటుంది’అని స్టేట్‌మెంట్లు ఇచ్చుకోవాల్సి వచ్చింది. టీఆర్‌ఎస్‌ అంత ఘన విజయం సొం తం చేసుకుంటుందని ఊహించని కాంగ్రెస్‌.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో కూడా ‘సైలెంట్‌ వేవ్‌’మళ్లీ ఎగిసి పడు తుందేమోనన్న ఆందోళనలో ఉంది.  

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు 
ఈ ఎన్నికలు ఢిల్లీకి సంబంధించినవి మాత్రమేనని, ఇందులో రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి సంబంధం లేదనే విషయం జనాల్లోకి తీసుకెళ్లేలా కాంగ్రెస్‌ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక్కడి ప్రభుత్వ పాలన కాకుండా, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేలా ఓటేయాలంటూ ప్రచారంలో పేర్కొంటున్నారు.  రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలంటూ చెప్పేందుకే ఇష్టపడుతున్నారు. ఓటర్ల దృష్టిని ‘ఢిల్లీ పీఠం’వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. 

ఆ ఐదు స్థానాలపై దృష్టి 
ఈసారి ఐదు సీట్లు కాంగ్రెస్‌ను ఊరిస్తున్నాయి. ఇందులో రెండు చోట్ల బీజేపీ కూడా దృష్టి పెట్టింది. మహబూబ్‌నగర్, నల్లగొండ, మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల స్థానాల్లో టీఆర్‌ఎస్‌ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. వీరెవరికీ రాజకీయ అనుభవం లేదు. ఈ అభ్యర్థులకు నేరుగా ప్రజలతో పెద్దగా పరిచయం లేదు. దీన్ని అవకాశంగా చేసుకుని విజయం సాధించాలని వైరి పక్షా లు ఆశతో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఫార్మా పరిశ్రమలు నిర్వహిస్తున్న మన్నె శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి డీకే అరుణ బరిలో ఉన్నారు. దశాబ్దాలుగా జనంతో మమేకమైన కుటుంబం నుంచి రావటం, పటిష్టమైన అనుచరగణం ఉండటంతో గట్టిగా కష్టపడితే గెలుపు తథ్యమని ఆమె భావిస్తున్నారు. నల్ల గొండ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రి దేవిరెడ్డి నరసింహారెడ్డి బరిలో ఉన్నారు. ఆయన కూడా ఓటర్లకు కొత్తే్త. దీంతో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి  ఉత్తమ్‌కుమార్‌ గెలుపుపై నమ్మకంతో ఉన్నారు.

మల్కాజిగిరి నుంచి కళాశాలల యజమాని మర్రి రాజేందర్‌రెడ్డి బరి లో ఉన్నారు. ఈయన కూడా రాజకీయాలకు కొత్త. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి బలమైన నేతగా ముద్ర ఉన్న రేవంత్‌రెడ్డి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు బరిలో ఉన్నారు. చేవెళ్ల నుంచి పౌల్ట్రీ వ్యాపారి రంజిత్‌రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఈసారి కాంగ్రెస్‌ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయానుభవం లేని అభ్యర్థిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. సికింద్రాబాద్‌ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తనయుడు సాయికిరణ్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన రాజకీయాలకు కొత్త కావటంతో పూర్తి ప్రచార బాధ్యతను తండ్రి శ్రీనివాస్‌యాదవ్‌ భుజానికెత్తుకున్నారు. ఇక్కడి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని వీరిద్దరు కృషి చేస్తున్నారు.

బీజేపీదీ అదే పంథా
బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్‌ పంథానే అనుసరిస్తున్నారు. కేసీఆర్‌ పాలనపై విమర్శలు చేయటానికి ప్రాధాన్యమివ్వకుండా మరోసారి మోదీ ప్రధాని కావాలనే విషయాన్నే ఎక్కువగా జనంలోకి తీసుకెళ్తున్నారు. కేంద్రంలో మోదీ సర్కారు పనితీరును చూసి జనం బీజేపీని బాగానే ఆదరిస్తారని, 8 స్థానాలకు తక్కువ కాకుండా గెలుస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించింది. కానీ ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే దక్షిణాది నుంచి పార్టీకి కచ్చితంగా స్థానాల సంఖ్య పెరగాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం గట్టిగా ఆదేశించటంతో తెలంగాణ నుంచి కనీసం 2 సీట్లన్నా రావాలనే ప్రయత్నంలో ఉన్నారు. సిట్టింగ్‌ స్థానమైన సికింద్రాబాద్‌తో పాటు మరో స్థానం అయినా దక్కించుకుని మోదీకి బహుమతిగా ఇవ్వాలని భావిస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top