కటీఫ్‌ వెనుక కథ!

The story behind the TDP and BJP clash - Sakshi

     కేంద్ర మంత్రులను ఉపసంహరించుకున్నా బీజేపీతోనే టీడీపీ

     ఇంకా ఎన్డీఏలో కొనసాగటంలో మతలబేంటి?

     వ్యక్తిగత ఇబ్బందుల భయంతో కూటమిలో.. ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం

     విధిలేకే కేంద్ర మంత్రుల రాజీనామా డ్రామా

     ప్రతిపక్ష నేత జగన్‌ ప్రతిపాదించినట్లుగా ఏపీ ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలి

     అప్పుడే కేంద్రం దిగి వస్తుందంటున్న విశ్లేషకులు  

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడం వల్లే కేంద్రంతో కటీఫ్‌ చెప్పి తమ మంత్రులతో రాజీనామాలు చేయించామని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఎన్డీఏలో మాత్రం కొనసాగుతామంటూ తమ బంధాన్ని కాపాడుకునేందుకు ఆపసోపాలు పడుతుండటంపై ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన నిజంగానే రాష్ట్ర ప్రయోజనాలు కాంక్షిస్తే మంత్రి పదవులకు రాజీనామాలు చేసినప్పుడు ఎన్డీఏ నుంచి ఎందుకు తప్పుకోరని ప్రశ్నిస్తున్నారు. ఓవైపు మైత్రిబంధం కొనసాగిస్తూనే మరోవైపు బీజేపీపై దుష్ప్రచారానికి సిద్ధం కావటం వెనక చంద్రబాబు పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం తానే పోరాడుతున్నట్లు రాష్ట్ర ప్రజల దృష్టిలో ఛాంపియన్‌గా నిలిచిపోవడం... ఆది నుంచి పోరాడి ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ క్రెడిట్‌ దక్కకుండా చేయడం ఆ వ్యూహంలో భాగమే. ప్రజల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని తట్టుకోలేక, విధిలేని పరిస్థితుల్లోనే కేంద్ర మంత్రి మండలికి తన మంత్రులతో చంద్రబాబు రాజీనామా చేయించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. 

ఎన్డీఏలో కొనసాగితే కేంద్రం స్పందిస్తుందా?
వ్యక్తిగత ప్రయోజనాలను పరిరక్షించుకోవడం, బీజేపీని ప్రసన్నం చేసుకోవడంలో భాగంగానే ఎన్డీఏ నుంచి ఇప్పటికిప్పుడు వైదొలగరాదని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ‘ప్రధాని మోదీ నాకు ఫోన్‌ చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందాం అని సూచించినా నేను పట్టించుకోలేదు. రాజీనామాలకు కట్టుబడ్డామని చెప్పా’ అని అనుకూల మీడియాలో లీకులు ఇచ్చి సీఎం ప్రచారం చేయించుకుంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామాలు చేసి ఉంటే ఎన్డీఏ నుంచి ఇప్పటికప్పుడు ఎందుకు వైదొలగటం లేదనే ప్రశ్నకు టీడీపీ వర్గాల నుంచి సమాధానం లేదు. టీడీపీ మంత్రులు రాజీనామా చేయడంతోపాటు ఎన్డీఏ నుంచి వైదొలిగి ఉంటే కేంద్రంపై ఒత్తిడి ఉండేదని.. ఇందుకు భిన్నంగా ఎన్డీఏలోనే కొనసాగాలని టీడీపీ నిర్ణయించుకోవటంతో ఎలాంటి స్పందన లేకుండా పోయిందని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.

‘మైత్రి’బంధం బద్దలవడంపై అనుమానాలు
‘టీడీపీ మంత్రులు రాజీనామా చేసినంత మాత్రాన జనం మనల్ని నమ్మరు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తేనే విశ్వసిస్తారు’ అని సూచించిన తనపై సీఎం చంద్రబాబు రుసరుసలాడినట్లు ఓ సీనియర్‌ ఎంపీ లోక్‌సభ సెంట్రల్‌ హాల్‌లో శుక్రవారం బాహాటంగా వ్యాఖ్యానించటం కలకలం రేపింది. ఎన్డీఏ నుంచి ఇప్పటికిప్పుడు బయటకు వస్తే వ్యక్తిగతంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని సీఎం అన్నట్లు ఆయన చెబుతున్నారు. ఇచ్చిన నిధులకు లెక్కలు అడగడం వల్లే కేంద్ర మంత్రి మండలి నుంచి టీడీపీ వైదొలగిందని, కానీ ఎన్డీఏలో కొనసాగుతామని చంద్రబాబే చెబుతున్నారని బీజేపీ సీనియర్‌ నేత పురందేశ్వరి సైతం చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ మంత్రి పదవికి రాజీనామా చేశాక గురువారం శాసనసభలో చంద్రబాబు అంతటి సమర్థవంతమైన నాయకుడు మరొకరు లేరంటూ ప్రశంసించడం.... అజాతశత్రువు అంటూ కామినేని శ్రీనివాస్‌ను సీఎం పొగడటం గమనార్హం. మంత్రి పదవులకు మాత్రమే రాజీనామా చేశామని, ఎన్డీఏలో కొనసాగుతామని అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి కూడా చెప్పారు. ఇవన్నీ పరిశీలిస్తే బీజేపీ–టీడీపీల మధ్య మైత్రి బంధం కొనసాగుతోందని స్పష్టమవుతోంది.

కొంప ముంచిన గొప్పలు!
లేనిది ఉన్నట్లు చూపి రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రచారం చేయడం.. రూ.16 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎంవోయూలు కుదుర్చుకున్నారంటూ హడావుడి చేయటం.. వృద్ధి రేటును అధికంగా చూపడం వల్ల కేంద్రం నుంచి తగినన్ని నిధులు రావని ప్రతిపక్షంతోపాటు ఆర్థిక నిపుణులు, ఉన్నతాధికారులు ఆది నుంచి హెచ్చరిస్తూ వస్తున్నారు. దీన్ని పెడచెవిన పెట్టి తాజా బడ్జెట్‌లోనూ బడాయి అంకెలతో లేని వృద్ధిని ఉన్నట్లు చూపారు. రెవెన్యూ లోటు ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలతో రూ.5,235 కోట్ల రెవెన్యూ మిగులు ఉన్నట్లు బడ్జెట్‌లో చూపడం గమనార్హం. అలాగే గత మూడేళ్లలో జాతీయ వృద్ధి రేటు 7.31 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు 10.96 శాతంగా ఉందంటూ గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో 2014–15కి సంబంధించి రూ.16,078 కోట్లు రెవెన్యూ లోటు కింద మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. ఓవైపు దేశం కన్నా రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందంటూ ప్రచారం చేస్తూ నిధులు ఇవ్వమంటే కేంద్రం ఎలా ఇస్తుందని సీనియర్‌ ఐఏఎస్‌లు, ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చూపిన తప్పుడు గణాంకాలే కారణమని విశ్లేషిస్తున్నారు. 

సీఎంకు ఇబ్బందనే ఆత్మగౌరవ నినాదం
సీఎం చంద్రబాబుకు ప్రజల మనోభావాలను గౌరవించే సాంప్రదాయం నిజంగానే ఉంటే, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే ఎన్డీఏ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకునేవారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే ప్రజల ఆత్మగౌరవం నినాదాన్ని చంద్రబాబు అందుకున్నారని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ ఎంపీలు అందరూ పార్టీలకు అతీతంగా ఏకతాటిపై పోరాడటం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అదే తరహాలో వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో కలిసి టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడే ప్రత్యేక హోదా వస్తుంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేసిన సూచనకు సీఎం చంద్రబాబు స్పందించకపోవడం ఆశ్చర్యకరం’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

చిత్తశుద్ధి అంటే ఇదేనా?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయనందుకు నిరసనగా.. ‘కేంద్రంపై మీరు అవిశాస్వం పెట్టండి. మేం మద్దతు ఇస్తాం.. లేదంటే మేం పెడతాం.. మీరు మద్దతు ఇవ్వండి’ అంటూ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా చేసిన ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడం గమనార్హం. రాష్ట్రం నుంచి ఎంపికైన 25 మంది ఎంపీలంతా మూకుమ్మడిగా రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దామంటూ ప్రతిపక్ష నేత చేసిన సూచనకు టీడీపీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

ఇన్నాళ్లూ ప్రశంసించి.. ఇప్పుడు విమర్శలా?
అధికారం చేపట్టినప్పటి నుంచి నిన్నమొన్నటి వరకూ కేంద్రం సహకరించడం వల్లే ఇబ్బందులను అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు శాసనసభలోనూ బయటా సీఎం చంద్రబాబు పదేపదే పొగడటం తెలిసిందే. ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ ఉండదని.. అది ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బావుకున్నాయ్‌? అని హేళన చేస్తూ వచ్చారు. హోదా కంటే ప్రత్యేక సహాయం ద్వారానే రాష్ట్రానికి అధిక ప్రయోజనం చేకూరుతుందని, అనుభవం ఉన్న నేతగా చెబుతున్నానని నమ్మకంగా చెబుతూ వచ్చారు. కానీ ప్రతిపక్ష నేత జగన్‌ నాలుగేళ్లుగా ముందుండి పోరాడి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సజీవంగా ఉంచటం, ఎన్డీఏ సర్కారు చివరి బడ్జెట్‌లోనూ ఏపీకి మొండిచేయి చూపటంపై ప్రజల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలను పసిగట్టిన సీఎం చంద్రబాబు ఇప్పుడు హోదా కావాలంటూ కొత్త పాట అందుకున్నారని, రాజీనామాల పేరుతో ఎన్డీఏ నుంచి తప్పుకోకుండా డ్రామాలాడుతున్నారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

‘బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆ పార్టీతో పొత్తు వల్ల టీడీపీకి అదనంగా వచ్చిన లాభమేమీ లేదు. కేంద్ర మంత్రివర్గం నుంచి మన పార్టీ మంత్రులను ఉపసంహరించుకున్నాం. ఈ రెండు రోజులు మీ నియోజకవర్గాల్లోనే పర్యటించి బీజేపీపై దుమ్మెత్తిపోయండి. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్‌సభ సభ్యుల మూకుమ్మడి రాజీనామాల కోసం వైఎస్సార్‌ సీపీ డిమాండ్లను తిప్పికొట్టండి’. 
– శుక్రవారం టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top