మీడియాపై సర్కారు కుట్ర

State Govt conspiracy on the media - Sakshi

ఏపీ ఫైబర్‌ పేరుతో రూ.330 కోట్లు వృథా..  

కేబుల్‌ వినియోగదారులను ప్రభుత్వం మోసం చేస్తోంది 

13 వేల మంది కేబుల్‌ ఆపరేటర్ల పొట్టగొడుతోంది.. 

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ వద్ద ఏపీ కేబుల్‌ ఆపరేటర్ల సంఘం నాయకుల ఆవేదన 

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు 

అందరికీ ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/పిఠాపురం: మీడియాను ఒక సామాజిక వర్గం చెప్పుచేతల్లో పెట్టుకోవడం ద్వారా నియంత్రించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, కోట్ల మంది వినియోగదారులకు వినోదాన్ని పంచుతూ కేబుల్‌ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కేబుల్‌ ఆపరేటర్ల పొట్టగొట్టే చర్యలతో కక్ష సాధిస్తోందని సీమాంధ్ర కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం నాయకులు వైఎస్‌ జగన్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 218వ రోజు ఆదివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చం పేట సమీపంలో పాదయాత్ర సాగిస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పక్కి దివాకర్, రాజవరపు కృష్ణ, పులిశెట్టి బాబి, పి.సత్యచంద్ర, కె.సూర్యప్రకాశరావు తదితరులు కలిసి కేబుల్‌ టీవీ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

రాష్ట్రంలో సుమారు 13 వేల మంది లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లు, 16 మంది మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్లున్నారని, వీరంతా 1.20 కోట్ల మంది వినియోగదారులకు నిత్యం కేబుల్‌ ప్రసారాలు అందిస్తున్నారన్నారు. 29 ఏళ్లుగా సుమారు 50 వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్న కేబుల్‌ ఆపరేటర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్రపన్నిందన్నారు. ‘ఫైబర్‌ టూ హోం అంటూ తక్కువ ధరతో కేబుల్‌ ప్రసారాలతో పాటు ఇంటర్‌నెట్‌ సౌకర్యాలంటూ ప్రచారం చేశారు.. దానికి రూ.330 కోట్లు ఖర్చు చేసినట్లు చూపిస్తున్నారు.. రాష్ట్రంలో 33 వేల కిలోమీటర్ల మేర ఫైబర్‌ కేబుల్‌ వేసినట్లు చెబుతున్నప్పటికీ అదెక్కడా కనిపించడం లేదు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంగా కేబుల్‌ ప్రసారాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు.

కానీ ఎక్కడా పూర్తిగా ప్రసారాలు చేసిన దాఖలాలు లేవు. రూ.149కే ట్రిపుల్‌ ప్లే కేబుల్‌ ప్రసారాలు అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లు చెబుతున్నారు. కానీ వినియోగదారుడి నుంచి రూ.234 వసూలు చేస్తున్నారు. భారత ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా ప్రాజెక్టులో భాగం గా  గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంటర్‌ నెట్‌ సౌకర్యం కల్పించడానికి నిర్దేశించిన ఫైబర్‌ కేబుల్‌ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం మీడియాను అణిచివేయడానికి వాడుకుంటోంది. ఇప్పటి వరకు ఎంఎస్‌ఓలు తమ వాటాగా కేవలం రూ.15 మాత్రం ఆయా మున్సిపాలిటీలకు చెల్లించేవారు. దానిని గ్రామాల్లో రూ.35, పట్టణాల్లో రూ.50కు పెంచడం దారుణం. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ఫైబర్‌ కేబుల్‌ వ్యవస్థను, పన్నులను రద్దు చేయాలి. వ్యక్తిగత బీమా సౌకర్యం ఏర్పాటు చేయాలి’ అని వారు జగన్‌కు వినతి పత్రం అందజేశారు.   

పల్లెలకు పండగొచ్చింది.. 
ఆదివారం ఉదయం కాకినాడ (రూరల్‌) నియోజకవర్గంలోని అచ్చంపేట క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించిన జగన్‌ అచ్చంపేట వద్ద పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించారు. అచ్చంపేట, గొంచాల, బ్రహ్మానందపురం, ఉండూరులో వర్షం కారణంగా చిత్తడిగా మారిన రోడ్లపై వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగింది. దారిపొడవునా ప్రజలు ఆయనకు నీరాజనాలు పట్టారు. ‘మా అన్న వచ్చాడు’ అంటూ యువతులు ఆప్యాయంగా రాఖీలు కట్టి మురిసిపోగా, అక్కచల్లెమ్మలు హారతిపట్టారు. వైఎస్‌ వేషధారణలో పలువురు బాలురు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉండూరులో జనం వెల్లువలా తరలివచ్చారు. పంట కాలువలపై ఉన్న చిన్నపాటి వంతెనలు దాటుకుంటూ తమ గ్రామాలకు వచ్చిన జననేతపై పల్లె ప్రజలు అభిమాన వర్షం కురిపించారు.

ఒక్కసారి జగన్‌ను చూడాలంటూ అవ్వలు, అక్కచెల్లెమ్మలు బారులు తీరారు. సెల్ఫీలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌ తీసుకుంటూ విదార్థినిలు మురిసిపోయారు. మరోవైపు నాలుగేళ్లుగా పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల కోసం ఇక్కట్లు పడుతున్నామని పలువురు జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. మరికొందరు.. దివంగత వైఎస్‌ హయాంలో తమకు ఎంతో మేలు జరిగిందని చెప్పుకొచ్చారు. వైఎస్‌ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల తన గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానని  ఉండూరుకు చెందిన పెంకె సూర్యకాంతం జగన్‌తో చెప్పింది. అందరి సమస్యలు ఓపికగా వింటూ.. ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు. 

ఆరోగ్యశ్రీ మా పాలిట వరమయ్యా.. 
ఆరోగ్యశ్రీ నిజంగా మాలాంటి పేదల పాలిట వరమయ్యా.. మీ నాన్న గారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంటే మా ఇంటిల్లి పాదికీ ప్రాణం. నేనివాళ జీవించి ఉన్నానంటే ఆ మహానుభావుడు అమలు చేసిన ఆరోగ్య శ్రీ చలవే. నాకు రెండు సార్లు నోటి క్యాన్సర్‌ సోకింది. రెండు సార్లు కూడా ఆరోగ్యశ్రీ కిందనే ఉచితంగా ఖరీదైన ఆపరేషన్లు చేయించుకోగలిగాను. నిజంగా ఆ పథకం లేకపోయి ఉంటే నా జీవితం ఏమయ్యేదో అని తలుచుకుంటేనే భయమేస్తోంది. మీరు అధికారంలోకి రాగానే వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తామని చెప్పడం లక్షలాది మంది పేదలకు మేలు చేస్తుంది.          
– జగన్‌తో గరగ చంద్రకళ 

జగనే సీఎం కావాలి..  
జగన్‌ వస్తేనే మా ముసలోళ్లకి మంచి జరుగుతుంది. పెద్దోళ్లెవరూ పల్లెటూళ్లకు రారు.. కానీ జగన్‌ కాలినడకన వచ్చారు. అందుకే ఓపిక లేకపోయినా ఆయన్ను చూడాలని వచ్చాం. మమ్మల్ని చూడగానే ఆయన నవ్వుతూ పలకరించాడు. మా బాధలు చెప్పుకున్నాక అంతా మంచే జరుగుతుందవ్వా అంటూ ధైర్యం చెప్పారు. పిల్లలు ఏం చదువు చదువుకుంటామన్నా చదివిస్తానంటున్నాడు. పింఛను డబ్బులు పెంచుతానంటున్నాడు, ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయిస్తానంటున్నాడు. బతకడానికి ఇంతకంటే ఇంకేం కావాలి.. అందుకే జగనేæ సీఎం కావాలి.     
– అచ్చంపేట వద్ద నాగరత్నం, మంగాయమ్మ, రాఘవ  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top