అమరావతిలో ‘హ్యాపీ సిటీస్‌’ సమ్మిట్‌

State Government issued the GO 81 - Sakshi

     ఏప్రిల్‌ 10 –12 తేదీల్లో నిర్వహణకు సర్కారు నిర్ణయం 

     ‘దావోస్‌’ తరహాలో ప్రతి ఏడాదీ సదస్సు 

     నిర్వహణ ఏజెన్సీలకు నామినేషన్‌పై పనులు 

     జీవో 81 జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు తరహాలో అమరావతిలో ప్రతీ ఏడాది ఓ భారీ సమ్మిట్‌ను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 10 నుంచి 12 వరకు నిర్వహించే ఈ సదస్సుకు ‘హ్యాపీ సిటీస్‌ సమ్మిట్‌ అమరావతి–2018’ పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్‌లో సిటిజన్‌ –సెంట్రిక్‌ గవర్నెన్స్, లివబుల్‌ కమ్యూనిటీస్, క్లీన్‌ అండ్‌ హెల్త్, పర్యావరణం, బలమైన ఆర్థిక వ్యవస్థలపై ప్రధానంగా చర్చించనున్నారు. భారతీయ పారిశ్రామిక సమాఖ్య, రాక్‌ఫీలర్‌ ఫౌండేషన్‌ సహకారంతో ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమ్మిట్‌ నిర్వహణకు రూ.52 కోట్లు వ్యయం అవుతుందని సీఆర్‌డీఏ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తొలుత ఈవెంట్‌ను భవానీద్వీపం వద్ద నిర్వహించాలని భావించినా ఆ తరువాత ఎ–కన్వెన్షన్‌ సెంటర్‌లో చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మున్సిపల్‌ పట్టణాభివృద్ది శాఖ జీవో 81 జారీ చేసింది. ఈ ఈవెంట్‌ నిర్వహణకు అవసరమైన సేవలందించే ఏజెన్సీలను నామినేషన్‌పై ఎంపిక చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.  

25 నుంచి 30 దేశాల ప్రతినిధులు.. 
హ్యాపీ సిటీస్‌ ఇండెక్స్‌లో మొదటి స్థానాల్లో ఉన్న 25 నుంచి 30 దేశాల ప్రతినిధులను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. వీరందరికీ విమాన చార్జీలతో పాటు రెమ్యునరేషన్, రవాణా, అకామడేషన్‌ ఛార్జీలను సీఆర్‌డీఏ భరించనుంది. పట్టణీకరణలో టెక్నాలజీ వినియోగంపైన ఈ సదస్సులో చర్చించనున్నారు. పట్టణీకరణలో అనుభవజ్ఞులను, విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న నాయకులను, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సిటీ అడ్మినిస్ట్రేటర్స్‌ను, సిటీ ప్లానర్స్, ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్‌ను ఆహ్వానించనున్నారు. సదస్సు నిర్వహణ కోసం పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమ్మిట్‌ నిర్వహణలో మార్గదర్శనం చేసేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో పలువురు మంత్రులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణ నేతృత్వంలో పలువురు అధికారులతో వర్కింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ)కార్యదర్శి నేతృత్వంలో పలువురు అధికారులతో ప్రొటోకాల్‌ కమిటీని, శాంతి భద్రతల అదనపు డీజీతో నేతృత్వంలో సెక్యూరిటీ కమిటీ, సిటీ బ్యూటిఫికేషన్‌ కమిటీ, సాంస్కృతిక కమిటీ, మీడియా కమిటీ, ఎగ్జిబిషన్‌ కమిటీ, కృష్ణా రివర్‌ వాటర్‌ లాజిస్టిక్స్‌ కమిటీ ఏర్పాటు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top