మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్‌ 

Special corporation for fishermen says YS Jagan - Sakshi

     ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ

     వేటకు వెళ్లి మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు సాయం 

     బోట్ల డీజిల్‌పై సబ్సిడీ పెంపు.. వెంటనే అందేలా చర్యలు 

     వేట నిషేధ సమయంలో రూ.10 వేల సాయం

     మత్స్యసంపద నిల్వ కోసం మోడల్‌ మార్కెట్లు, కోల్డ్‌ స్టోరేజీలు   

     కాకినాడలో మెరైన్‌ వర్సిటీ.. చంద్రబాబును ఇకపై నమ్మొద్దు

     మన ప్రభుత్వం రాగానే అన్ని విధాలా ఆదుకుంటాం

నాయకర్‌ అనే మత్స్యకారుడు ఎంఎస్‌ఎన్‌ ట్రస్టు (మల్లాడి సత్యలింగం నాయకర్‌ ట్రస్టు) పెట్టి మత్స్యకారులందరికీ మేలు జరుగుతుందని భావించారు. ఆ ట్రస్టుకు సంబంధించి ఈ జిల్లాలో దాదాపు 1,500 ఎకరాలు కేటాయించారు. ఈ భూములను టీడీపీ నేత గద్దన్న దోచేస్తున్నారని ఈనాడు పత్రికలోనే వచ్చింది. ఎకరా రూ.16 చొప్పున లీజుకు ఇస్తున్నారు. నిజంగా మత్స్యకారులకు చెందిన ఆ భూములను మత్స్యకారులకే ఇచ్చి ఆ ట్రస్టుకు ఇంకా ఎక్కువ డబ్బు వచ్చి వారి సంక్షేమానికి ఉపయోగపడేలా చేయాల్సింది పోయి ఇలా దోపిడీ చేస్తున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఏప్రిల్‌లో పుస్తకాలు ఇవ్వాల్సిందిపోయి జూలై ఆఖరు వస్తున్నా కూడా ఇంత వరకూ ఇవ్వని పరిస్థితులు నెలకొన్నాయి. యూనిఫాంలు కూడా ఇవ్వలేదు. ఈ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పోవడం మానిపించి నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపించాలని ఇలా చేస్తున్నారు. ఆ స్కూళ్లు చంద్రబాబు బినామీ అయిన నారాయణ అనే మంత్రివి కావడం వల్లే ఇలా చేస్తున్నారు. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 217వ రోజు శనివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని అచ్చంపేట క్రాస్‌ వద్ద మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు. తమకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని అడిగినా కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆయనకు చెప్పడంతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పని చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అన్ని వర్గాల వారినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ సమ్మేళనంలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఎన్నికలప్పుడే బాబుకు జనం గుర్తుకొస్తారు 
‘‘నాలుగున్నర సంవత్సరాలుగా మీరంతా చంద్రబాబు పాలన చూస్తున్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా అన్ని వర్గాల వారిని మోసం చేశారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో మళ్లీ మోసం చేయడానికి మీ ముందుకు వస్తారు. డెభ్బై ఏళ్లు ఉన్న చంద్రబాబు రేపో మాపో పెళ్లికొడుకు మాదిరిగా తయారై చక్కటి ఫొటో పెట్టుకుని ఎన్నికల ప్రణాళిక అని రూపొందించి విడుదల చేస్తారు.  అందులో ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పేజీ కేటాయిస్తూ.. ఆ కులానికి సంబంధించిన ఫొటో పెడతారు. మగ్గం నేస్తున్న, మత్స్యకారులకు సంబంధించిన ఫొటోలు కూడా పెడతారు. ఇక్కడ నేను కొన్నింటినే ప్రస్తావిస్తాను. చంద్రబాబు ఎన్నికలకు వెళ్లే ముందు చేపల వేటకు పడవలపై వెళ్లే మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీపై డీజిల్‌ సరఫరా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారి అయినా డీజిల్‌ సబ్సిడీని పెంచారా? ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కానీ ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయనగానే మళ్లీ ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారు.

ఈనాడు దినపత్రికలో డీజిల్‌ సబ్సిడీని చంద్రబాబు వెంటనే పెంచబోతున్నారని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించాడు. ఇందుకు కారణమేమంటే జగన్‌ అంతకు కొద్ది రోజుల ముందే అధికారంలోకి రాగానే మత్స్యకార సోదరులకు డీజిల్‌ సబ్సిడీని పెంచుతానని చెప్పాడు కా>బట్టి. నర్సాపురంలో నేను చెప్పిన తర్వాత చంద్రబాబు నక్క బుద్ధితో జిత్తులు చూపించాడు. మత్స్యకారుల పిల్లల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు కట్టిస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రకటించారు. మీకెక్కడైనా ఆ పాఠశాలలు కనిపించాయా? స్కూళ్లను కట్టడం సంగతి దేవుడెరుగు, ఉన్న స్కూళ్లను రేషనలైజేషన్‌ పేరుతో దగ్గరుండి మూయిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా పిల్లలను చదివిస్తానని చెప్పాడు. నిజంగా ఇవాళ మనమంతా మన పిల్లలను ఇంజినీర్లు, డాక్టర్లుగా చదివించే పరిస్థితుల్లో ఉన్నామా? ప్రభుత్వ స్కూళ్లు దూరంగా ఉన్నా కూడా చదువుకునేందుకు పిల్లలు పోతా ఉంటే ఇప్పటి వరకూ పుస్తకాలు ఇవ్వలేదని ఆ పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.  

వేట విరామంలో ఎంతమందికి సాయం అందుతోంది? 
చంద్రబాబు అధికారంలోకి రాక ముందు ఫిషింగ్‌ హాలిడే (వేట విరామం) సందర్భంగా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15వ తారీఖు దాకా ఈ రెండు నెలల పాటు రూ.4 వేలు ఇచ్చేది పెంచుతామని చెప్పారు. పెంచడం మాట దేవుడెరుగు ఆ రూ.4 వేలు కూడా నూటికి పదిమందికైనా వస్తున్నాయా? మత్స్యకారులందరికీ 50 ఏళ్లకే పింఛను ఇస్తానని చంద్రబాబు ఎన్నికలపుడు ప్రకటించారు. నాలుగున్నరేళ్ల పాలన తర్వాత అవ్వాతాతలందరికీ ఆవిధంగా పింఛన్లు వస్తున్నాయా అని అడుగుతున్నా. ఎన్నికలు ఇంకో ఆరు నెలలున్నాయన్నప్పుడు మాత్రం ఈనాడు పత్రికలో మత్స్యకారులందరికీ 50 ఏళ్లకే పింఛను చంద్రబాబు ఇస్తాడు అని పెద్ద అక్షరాలతో రాస్తారు. జీవో విడుదల అయిందని రాస్తారు. జీవో విడుదలైన తర్వాత కూడా మీకు ఇప్పుడు వస్తోందా? ఎన్నికలకు ఆరు నెలల ముందు డ్రామాలు ఎంత బాగా రక్తి కట్టిస్తారనడానికి ఇదే నిదర్శనం. ముమ్మడివరం నియోజకవర్గంలో 63 తీరప్రాంత గ్రామాలకు సంబంధించి గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ వారు పైపులైన్లు వేశారు.

వీటి వల్ల మత్స్యకార సోదరులకు చేపలు పట్టుకోవడానికి ఇబ్బందులు వస్తాయని చెప్పి తీవ్రంగా ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం వల్ల జీపీసీఎల్‌ వారు దిగి వచ్చి ఆ ప్రాంతంలోని 17,400 కుటుంబాలకు 17 నెలలపాటు, నెలకు రూ.6,750 చొప్పున ఇస్తామని చెప్పారు. ఇంతకు ముందు ప్రభుత్వాల్లో డబ్బు కూడా వారికి బాగా వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నరేళ్లుగా రూ.130 కోట్ల బకాయిలున్నాయని వారంతా నాతో వాపోయారు. ఈ పెద్దమనిషి నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేస్తాడు. ఈయన ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా.. బీజేపీ ఎమ్మెల్యేలు ఈయన మంత్రివర్గంలో సభ్యులుగా ఉంటారు. చిలుకా గోరింకల మాదిరిగా పొగుడుకుంటూ సంసారం చేసుకుంటారు కానీ మత్స్యకార సోదరులకు న్యాయంగా రావాల్సిన రూ.130 కోట్ల బకాయిల గురించి మాత్రం పట్టించుకోరు.

ఇలాంటి అన్యాయమైన పాలన పోయి రేపు దేవుడు ఆశీర్వదించి, మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలతో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు చూడాలని ఆరాటపడుతున్నాం. ఆ నవరత్నాలతో పాటు మత్స్యకార సోదరులకు ఈ పాదయాత్రలో మేము ప్రకటించిన హామీలను మరోసారి గుర్తు చేస్తున్నా. చంద్రబాబును ఇక నమ్మకండి.’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. అనంతరం పలువురు మత్స్యకారుల సందేహాలను జగన్‌ నివృత్తి చేశారు. వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ఈ ఆత్మీయ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోపిదేవి వెంకటరమణ, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, కాకినాడ, అమలాపురం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పొన్నాడ సతీష్‌కుమార్, ద్వారంపూడి చంద్రశేఖరెడ్డి, పలాస కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అప్పలరాజు, ఎంఎస్‌ఎన్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు మల్లాడి రాజు, ఆయా జిల్లాల మత్సకార సంఘాల నాయకులు పాల్గొన్నారు.  

మత్స్యకారుల కోసం ఇలా చేస్తాం.. 
- మత్య్సకారులకు వేట విరామ (ఫిషింగ్‌ హాలిడే) సమయంలో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 దాకా రూ.10 వేలు ఇస్తాం.   
చంద్రబాబు హయాంలో కొత్త బోట్లకు డీజిల్‌కు ఇవ్వాల్సిన సబ్సిడీ మొత్తం పెరుగుతుందని చెప్పి రిజిస్ట్రేషన్లు చేయకుండా ఆపేశాడని మత్స్యకారులు వాపోతున్నారు. మత్స్యకారుల బోట్లకు ఇచ్చే డీజిల్‌ పరిమాణాన్ని పెంచడంతోపాటుగా దానిపై సబ్సిడీని కూడా పెంచుతాం. డీజిల్‌ పోయించుకునేటప్పుడే ఆ సబ్సిడీ అందుబాటులోకి వచ్చేలా డీజిల్‌ కార్డులు ఇచ్చి వాటిని కంప్యూటర్‌తో అనుసంధానం చేస్తాం.   
సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల జీవితాలకు చాలా రిస్క్‌ ఉంటుంది. వారికేదైనా జరగరానిది జరిగితే రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తాం. మూడు నెలల్లోనే ఆ కుటుంబానికి డబ్బు చెల్లించే ప్రక్రియ పూర్తి చేస్తాం. ఇదే విషయాన్ని నేను నర్సాపురం సభలో కూడా చెప్పాను.  
కాకినాడ వాటర్‌ పోర్టు, యాంకరేజ్‌ పోర్టులో పని చేస్తున్న కార్మికులకు మత్స్యకారులకు ఇచ్చినట్లే ప్రమాదవశాత్తూ చనిపోతే రూ.10 లక్షలు ఇస్తాం. పోర్టులో పని చేసే వారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. రిజిస్ట్రేషన్‌ చేయిస్తాం.  
పోర్టులో పని చేస్తున్న కార్మికులకు (ఐటమ్‌ను బట్టి) ఇచ్చే మొత్తాన్ని చంద్రబాబు హయాంలో ఒక్కసారి కూడా పెంచలేదని కార్మికులు చెబుతున్నారు. వీటిని రివిజన్‌ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఉప్పాడ నుంచి అద్దెరపేట వరకు కోతకు గురవుతున్న తీర ప్రాంతాన్ని రక్షించేందుకు ముంబయి తరహాలో టెట్రా బండ్స్, సిమెంట్‌ దిమ్మెలు వేయిస్తాం.  
కాకినాడలో మెరైన్‌ యూనివర్సిటీ స్థాపిస్తాం. 
మత్స్యసంపద నిల్వ ఉంచుకోవడం కోసం మోడల్‌ మార్కెట్లు, కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తాం.  
మత్స్యకార సోదరులు ఆరోగ్యం బాగోలేక ఒక వారం చేపల వేటకు వెళ్లకపోతే ఇంట్లో పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ వర్గాలన్నింటికీ పింఛన్‌ ఇచ్చే వయస్సును 45 ఏళ్లకు తగ్గిస్తాం. 
నాన్నగారి హయాంలో మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండని దగ్గరుండి చదివించారు. ఆయన చనిపోయాక చంద్రబాబు దగ్గరుండి కళాశాలకు ఫీజులు పెంచుకోమని చెబితే వాటికి రెక్కలొచ్చి యాజమాన్యాలు పెంచేశాయి. బీ కేటగిరీలో డాక్టర్‌ కోర్సు చదవాలంటే ఏటా రూ.13 లక్షలు అవుతోంది. ఇవాళ ఇంజినీరింగ్‌ ఫీజు ఏటా రూ.లక్షకు పైగానే ఉంది. ప్రభుత్వం మాత్రం రూ.30 వేలు ముష్టి వేసినట్లు ఇస్తోంది. అదికూడా సక్రమంగా ఇవ్వడం లేదని పిల్లలు చెబుతున్నారు. మిగతా రూ.70 వేలు ఎక్కడి నుంచి ఆ తల్లిదండ్రులు తెస్తారు? నాలుగేళ్లకు రూ.3 లక్షలు అవుతాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అందుకే నేను చెబుతున్నా.. రేపు మన ప్రభుత్వం రాగానే.. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి. ఎంత ఖర్చయినా నేను దగ్గరుండి చదివిస్తాను. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు హాస్టల్‌ ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాం.   
పిల్లల ఉన్నత విద్య చదవడానికి చిన్నతనంలోనే పునాదులు గట్టిగా ఉండాలి. అందుకే పిల్లలను బడికి పంపించినందుకు ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం.   
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తాం. ఎక్కడైనా చికిత్స పొందేలా మార్పులు చేస్తాం. చికిత్సానంతరం కోలుకుంటున్న రోగికి విశ్రాంతి సమయంలో వైద్యుల  సూచన మేరకు ఆర్థిక సాయం అందిస్తాం. కిడ్నీ వ్యాధి, తలసేమియా లాంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం.   
అవ్వాతాతల పింఛన్‌ను రూ.2 వేలకు పెంచుతాం. పింఛన్‌ వయసును 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. 
గ్రామ సచివాలయాలు నెలకొల్పి ఆయా గ్రామాల్లోని 10 మందికి ఉద్యోగాలిస్తాం. వారే ఆ సచివాలయాలను నడుపుతారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ వాటితోపాటుగా ప్రభుత్వానికి చెందిన ఏ పథకాలు కావాలన్నా దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో వర్తింప చేస్తాం. ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేకుండా చేస్తాం.  
డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికల నాటికి ఉన్న బ్యాంకు అప్పును నాలుగు విడతల్లో నగదుగా వారి చేతికే నేరుగా అందజేస్తాం. మళ్లీ సున్నా వడ్డీకే రుణం ఇప్పిస్తాం. 
పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తీసుకొస్తాం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top