రాహుల్‌ ససేమిరా.. సోనియానే శరణ్యం!

Sonia Gandhi Elected Leader Of New Congress Parliamentarians - Sakshi

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ ఎన్నిక

సీపీపీ భేటీకి హాజరైన రాహుల్‌

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం.. ఆ ఓటమితో రాజీనామాకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పట్టుబడుతుండటంతో శనివారం ఉదయం జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీపీపీ నాయకుడిగా రాహుల్‌ గాంధీని ఎన్నుకుంటారని మొదట భావించారు. అయితే, రాహుల్‌ రాజీనామాకు పట్టుబడుతున్న నేపథ్యంలో మళ్లీ సోనియా గాంధీ శరణ్యమని కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీపీపీ సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోనియాగాంధీ పేరును ప్రతిపాదించగా, ఇందుకు పార్టీ ఎంపీలు ఆమోదం తెలిపారని సమాచారం. 

లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగబోనని రాహుల్‌ గాంధీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన సీపీపీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సమావేశానికి లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన 52 మంది కాంగ్రెస్ సభ్యులు, 50మంది రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో కాంగ్రెస్‌కు 52 మంది ఎంపీలు ఉన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే ఇంకా ముగ్గురు సభ్యుల మద్దతు కావాలి. లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టే అంశంపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే, కాంగ్రెస్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అనడంతో శుక్రవారం కాంగ్రెస్‌ పెద్దలు శరద్ పవార్‌తో సమాలోచనలు జరిపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, మల్లిఖార్జున ఖర్గెతోపాటు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ కేసీ వేణుగోపాల్ శుక్రవారం రాహుల్‌తో భేటీ అయి.. ఆయనను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. 

1999లోనూ ఇదేతరహా సంక్షోభం
1999లోనూ కాంగ్రెస్ పార్టీ  ఇదే తరహా సంక్షోభం ఎదుర్కొంది. విదేశీ మహిళ అయిన సోనియాగాంధీ పార్టీ సారథ్య బాధ్యతలు స్వీకరించడాన్ని  అప్పట్లో పార్టీ సీనియర్‌ నేతలు శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్‌ శ్రేణుల నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో ఆమె తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. సోనియా సారథ్యాన్ని వ్యతిరేకించిన  శరద్ పవార్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top