ఇసుకాసుర వధ ఎప్పుడు..?

Somu Veerraju fires on TDP Leaders about sand scam - Sakshi

     ఒక్కో రీచ్‌ నుంచి రూ.1,000 కోట్లు దోచుకున్నారు

     అధికారపార్టీ నేతల కనుసన్నల్లో రాష్ట్రంలో ఇసుక మాఫియా నడుస్తోంది

     రాష్ట్ర బీజేపీ ప్రజాప్రతినిధుల ధ్వజం

     అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ప్లకార్డులతో నిరసన

     ఇసుకపై ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే ఏడాది సంపాదన రూ.250 కోట్లు పైమాటే: విష్ణుకుమార్‌రాజు

     టీడీపీ నేతలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారు: సోము వీర్రాజు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక మాఫియా సామ్రాజ్యం దారుణంగా విస్తరించిందని భారతీయ జనతాపార్టీ ధ్వజమెత్తింది. నాలుగేళ్లలో ప్రతీ ఇసుక రీచ్‌ నుంచి అధికార పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు రూ.1,000 కోట్లు తక్కువ కాకుండా దోచుకున్నారని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచితంగా ఇస్తారను కున్నా మని, కానీ దానికి భిన్నంగా దోచుకోమంటూ అధికారపార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులకు ఇసుక ర్యాంపులను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కట్టబెట్టిందని దుయ్యబట్టారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, ఆ పార్టీ ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌లు శుక్రవారం మీడియా పాయింట్‌లో ‘ఇసుకాసుర వధ ఎప్పుడు’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రోజురోజుకూ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని చెప్పారు.

ఇసుక రూపేణా అధికార పార్టీకి చెందిన ప్రతీ ఎమ్మెల్యే ఒక్కొక్క ఇసుక రీచ్‌ నుంచి రోజుకు రూ.80 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇలా చూస్తే వారి సంపాదన ఏడాదికి రూ.250 కోట్లు దాటుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు భయపడి మామూళ్లు చెల్లించకపోవడంతో గత రెండు వారాల నుంచి విశాఖకు ఇసుక సరఫరా నిలిపివేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పేరుకు ఉచిత ఇసుక అయినా లారీ ఇసుక ఖరీదు రూ.48,000 దాటిందని, ఇది కిలో రెండు రూపాయల బియ్యం లారీ లోడు ధర కన్నా ఎక్కువని ఆయన తెలిపారు. సోము వీర్రాజు మాట్లాడుతూ ఇసుకను టీడీపీ ప్రజాప్రతినిధులు ఆదాయవనరుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. ఇసుకరీచుల్లో ఎంఆర్‌వోలు, వీఆర్‌వోలు కలెక్షన్‌ కింగ్‌లుగా మారి ప్రజాప్రతినిధులకు కోట్లు వసూళ్లు చేసి పెడుతున్నారని విమర్శించారు. లారీ మీద రోజుకు కనీసం రూ.రెండు వేలు చొప్పున స్థానిక ప్రజాప్రతినిధికి వెళుతున్నాయని, ఆ విధంగా శ్రీకాకుళంలో రోజుకు ఆరు వేల లారీల మీద కలెక్షన్లు వసూలు చేస్తూ ఆ జిల్లా మంత్రి రోజురోజుకూ బరువు పెరిగిపోతున్నాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అవినీతి రహిత ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర సర్కారు చెప్పుకుంటోందని, కానీ వాస్తవంగా నీతి లేని పాలన నడుస్తోందని విమర్శించారు. దేశంలోనే అత్యధిక ధర రాష్ట్రంలోనే ఉందని, ఈ ఇసుకాసుర వధ ఎప్పుడు జరుగుతుందని ఎమ్మెల్సీ మాధవ్‌ ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీది న్యాయబద్ధమైన కోరికే..
పార్టీ మారిన ప్రజాప్రతినిధులను డిస్‌క్వాలిఫై చేయకపోగా వారికి మంత్రి పదవులివ్వడం దారుణమని, వారిని తొలగిస్తే కానీ అసెంబ్లీకి రాకూడదన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయం సరైందేనని విష్ణుకుమార్‌రాజు అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా ప్రకటించాలన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల వినతి న్యాయబద్ధమైన కోరికేనన్నారు. కానీ అధికారపక్షం డబ్బు బలంతో, అహంకారంతో ముందుకు వెళుతోందని, ప్రశ్నిస్తున్న తనలాంటి వాళ్లను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టయినా ఓడించడానికి సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top