‘పోలవరం’ ఘనత వైఎస్సార్‌దే

Somu Veerraju Comments On Chandrababu Naidu Over Polavaram - Sakshi

దమ్మున్న నేత ఆయన

ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు సోము వీర్రాజు

సీఎం చంద్రబాబుకు సిగ్గుండాలి 2016 చివరి వరకు పనులెందుకు ప్రారంభించలేదు

కమీషన్ల కోసమే కాంట్రాక్టర్ల మార్పు

గతంలో 9 ఏళ్లు అధికారంలో ఉన్నా..ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని ధ్వజం

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని శాసనమండలి సభ్యుడు, బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయన దమ్ము, ధైర్యం ఉన్న  నేత అని  కొనియాడారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి సిగ్గుందా అని ప్రశ్నించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.  ఈ ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ హయాంలో సీఎం అంజయ్య శంకుస్థాపన చేశారని..వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముఖ్యమైన పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని సీఎం ఆరోపించడం తగదన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటికే రూ.6,700 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు.

2014లోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చినా.. 2016 చివరి వరకు ఎందుకు పోలవరం పనులు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణ జాప్యం కారణంగానే రూ.52 వేల కోట్లకు వ్యయం పెరిగిపోయిందన్నారు.ప్రాజెక్టు పనులపై లేని శ్రద్ధ.. కాంట్రాక్టర్‌ను మార్చడంలో చూపించి దండిగా కమీషన్లు దండుకున్నారని విమర్శించారు.  పూర్తిగా అవినీతిమయం చేశారని ఆరోపించారు. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ  పోలవరాన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడేమో కేంద్రంపై నిందలు మోపుతున్నారని చెప్పారు.

ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రఫెల్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు నుంచి క్లీన్‌చిట్‌ పొందిన ప్రధానిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.  ముఖ్యమంత్రి పర్యటనలు, ప్రారంభోత్సవాలకు ప్రజాధనంతో పాటు అధికారుల విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రానికి అత్యధికంగా 9.65 లక్షల ఇళ్లు కేటాయించిందని గుర్తు చేశారు. టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు అనవసరంగా కేంద్రంపై నిందలు మోపడం సరికాదని హితవు పలికారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top