హోరెత్తిన అభిమానం

Solid welcome to YS Jagan in Every Step of Prajasankalpayatra - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు నీరాజనాలు..

అడుగడుగునా ఘన స్వాగతం 

కష్టాలు చెప్పుకున్న పొందూరు ఖాదీ కార్మికులు  

చరఖా తిప్పుతూ వారికి ధైర్యం చెప్పిన జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ఆమదాల వలస నియోజకవర్గం ఆదరించింది. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎదురేగి ఘన స్వాగతం పలికింది. పొందూరు పోటెత్తింది. ఎరుకలపేట జనసంద్రమైంది. రాపాక మొదలు రెడ్డిపేట వరకు జగన్నినాదం హోరెత్తింది. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 313వ రోజు బుధవారం జగన్నినాదాల మధ్య ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సింగడం మండలం ధవళపేట క్రాస్‌లో మొదలై ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం రెడ్డిపేట వద్ద ముగిసింది. దారి పొడవునా జన ప్రభంజనం. జగన్‌ బస చేసిన శిబిర ప్రాంగణం ఉదయం నుంచే అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, నాయకులతో కిటకిటలాడింది. వాస్తవానికి ఇది పనుల కాలమైనా ప్రజాభిమానం ఉప్పొంగింది. కొండకోనలు, పంట పొలాలు మాకా అడ్డంకి అంటూ ఆబాల గోపాలం ఉరుకులు పరుగులు పెడుతూ చేలకు అడ్డంపడి పరుగెత్తుతూ జగన్‌ను చూసేందుకు పోటెత్తారు. యువతీ యువకులు మొదలు పండుటాకుల వరకు బారులు తీరి జగన్‌తో కరచాలనం చేశారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. చేతిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, మెడలో కండువాలతో కదిలివచ్చిన కార్యకర్తల నినాదాల మధ్య పాదయాత్ర.. ఖద్దరుకు ప్రఖ్యాతి గాంచిన పొందూరు క్రాస్‌కు చేరినప్పుడు జనసంద్రమే అయింది. బాణసంచా పేలుళ్లు, పూలవర్షాలు, కాబోయే సీఎం జగన్‌ అంటూ విద్యార్థులు, మహిళల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అదే సమయంలో ప్రజలు తమ కష్టాలను వైఎస్‌ జగన్‌కు చెప్పుకున్నారు.  


పొందూరు ఖాదీకి పేటెంట్‌ ఇప్పించండి.. 
విశ్వ ఖ్యాతి గాంచిన పొందూరు ఖాదీకి పెటెంట్‌ లభించినప్పుడే తమకు న్యాయం జరుగుతుందని ఆంధ్ర ఫైన్‌ ఖాదీ కార్మిక సంఘం నేతలు జగన్‌కు నివేదించారు. పొందూరు క్రాస్‌ వద్ద ఖద్దరు నేసే కార్మికులు ఆయనకు వారి కష్టాలు వివరించారు. పొందూరు ఖాదీ పేరిట రాష్ట్రంలో పది వేల నకిలీ షాపులు నడుస్తున్నాయని, మర మగ్గాలతో నేసిన వస్త్రాన్ని కూడా పొందూరు పేరిట చలామణి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పొందూరు ఖాదీ నేత.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఖాదీ బోర్డు ఆధీనంలో ఉంటుందని, రాష్ట్రంలోని చేనేత రంగం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని, ఈ రెండూ వేర్వేరని, పొందూరు ఖాదీని ప్రత్యేకంగా చూసినప్పుడే ఇది బతికి బట్టకడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పొందూరు ఖాదీపై పది శాతం రాయితీ ఇస్తే తమకు మేలు జరుగుతుందని వివరించారు. కూలి తక్కువగా ఉండడం, ముడి సరుకు ధరలు పెరగడం వల్ల కార్మికులు వలస పోతున్నారన్నారు. తమకూ గృహ వసతి, పింఛన్‌ సౌకర్యం కల్పించాలని కోరారు. అక్కడ జగన్‌ కాసేపు చరఖాను తిప్పారు. వారి ఇక్కట్లను ఓపికగా విన్నారు. ఇప్పటికే నవరత్నాలలో చేనేత రంగాన్ని కూడా చేర్చామని, ప్రతి కుటుంబానికి పింఛన్‌ వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ హామీపై ఆ సంఘం నాయకులు దండా వెంకట రమణ, జీకే ప్రసాద్, కోరుకొండ సరోజిని, కాపల చిన్నమ్మ, కోరుకొండ సాయికుమార్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.  
 


మడ్డువలస రెండో దశను విస్మరించారన్నా.. 
డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో మడ్డువలస రెండో దశ కాలువను జి.సిగడాం మండలం నుంచి తవ్వించి 36 వేల ఎకరాలకు నీరిస్తే ఇప్పుడీ ప్రభుత్వం దానిని విస్మరించినట్టు జి.సిగడాం, లావేరు, ఎచ్చెర్ల ప్రాంత రైతులు వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్లుగా ఆ కాలువకు మరమ్మతులు లేక ఇప్పుడా పథకం మూలనపడిందని రైతులు ఎస్‌ కే బాషా, సీతారాం, ఎ.నాగరాజు తదితరులు జగన్‌ ఎదుట వాపోయారు. వైఎస్సార్‌ హయాంలో నారాయణపురం కుడి కాలువ పనులు 90% పూర్తవ్వగా, మిగిలిన పది శాతం పనులను ఈ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని అరిణాం అక్కివలస మాజీ సర్పంచ్‌ ఎ.సుజాత ఆధ్వర్యంలో పలువురు రైతులు వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు. హుదుహుద్‌ తుపాన్‌తో తీవ్రంగా నష్టపోయిన తనకు ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందలేదని పాలఖాండ్యం గ్రామానికి చెందిన కౌలు రైతు రమణరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొలంలో విద్యుత్‌ స్తంభాలు పడిపోతే ఇంతవరకు పునరుద్ధరించలేదన్నారు.

  

స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చిందెక్కడ 
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు దక్కేలా చూడాలని పలువురు నిరుద్యోగులు వైఎస్‌ జగన్‌ను కోరారు. స్థానిక పరిశ్రమలలో ఉద్యోగాలు దొరకాలంటే పైరవీలో, పైసలో కచ్చితంగా కావాలని వాపోయారు. డీఎస్సీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమను మోసం చేస్తోందని కృష్ణాపురం వద్ద జగన్‌ను కలిసిన డీఎస్సీ నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులు భర్తీ చేయని రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పలువురు యువతీ యువకులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ప్రభుత్వం తమ పొట్ట కొడుతోందని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో నీరు – చెట్టు పేరిట రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావ్‌ మనుషులు దోచేస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. బలసలరేవు వంతెన నిర్మాణానికి 650 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం చలించడం లేదని, నాలుగున్నరేళ్లుగా అన్నీ కష్టాలేనని వాల్తేరు గ్రామ ప్రజలు జగన్‌ దృష్టికి తెచ్చారు. కరాటే, క్విక్‌ బాక్సింగ్‌ క్రీడాకారులకు చేయూత ఇవ్వాలని అన్మీష్‌ వర్మ, తప్పెటగుళ్ల కళాకారులకు నెలవారీ పింఛన్లు ఇప్పించాలని ఆ సంఘం కళాకారులు, తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని రజకులు జగన్‌ను కోరారు.   

ఇళ్లు మంజూరు చేయడం లేదయ్యా..  
సాబ్‌.. మా పూర్వీకుల నుంచి దవళపేటలో 30 ముస్లిం కుటుంబాలు ఉన్నాయి. రాళ్లు కొట్టుకునే పని చేసుకుంటూ బతుకుతున్నాం.  ఇప్పుడు క్రషర్లు, యంత్రాలు వచ్చాక మాకు చేతినిండా పనిలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు లేవు. ఒకే ఇంట్లో మూడు నుంచి నాలుగు కుటుంబాల వాళ్లం కలిసి ఉంటున్నాం. అప్పట్లో వైఎస్సార్‌ ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నాం. కొత్తగా ఇళ్లు మంజూరు కాలేదు. యువతకు ఉపాధి లేక వలస పంపుతున్నాం. మాలాగే ఎన్నో కుటుంబాలున్నాయి. మీరు సీఎం కాగానే మా సమస్యలు తీర్చాలి.  
– సయ్యద్‌ సలీం,జయబుల్, బీబీ, పాలఖండ్యాం. 


85 వేల మంది మహిళల పొట్టకొడుతున్నారు..  
అయ్యా.. రాష్ట్రంలో 85 వేల మంది మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులుగా ఉన్న మహిళల పొట్టకొట్టే ప్రయత్నం జరుగుతోంది. నిర్వాహకులను తొలగించి ఇస్కాన్, అక్షయపాత్ర, నవప్రయాస వంటి సంస్థలకు ఈ పథకాన్ని అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది అన్యాయం అని పోరాడుతున్న మహిళలను అరెస్ట్‌ చేసి, మగ పోలీసులతో కొట్టిస్తున్నారు. నెలల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. అడిగితే వంట బాగోలేదని, మెనూ ప్రకారం పెట్టలేదని, గుడ్లు చిన్నగా ఉన్నాయని చెప్పి సాకులు చూపుతున్నారు. జిల్లాలను క్లస్టర్లుగా విడదీసి మేము ఎవరి పరిధిలోకి రాకుండా అన్యాయం చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాను 9 క్లస్టర్లుగా విడదీసి అందులో చోడవరం, భీమిలి క్లస్టర్లలో నవప్రయాస అనే సంస్థ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న 16 మంది నిర్వాహకురాళ్లపై అక్రమ కేసులు పెట్టి సెంట్రల్‌ జైలుకు పంపారు. ఎవరైనా తిరుగుబాటు చేస్తే ఇదే గతి పడుతుందని బెదిరింపులకు దిగుతున్నారు.మీరు అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని రద్దుచేసి మళ్లీ మహిళలకే అవకాశం కల్పించాలి. 
– జనపరెడ్డి శేషారత్నం, విశాఖ జిల్లా మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల సంఘం నాయకురాలు  

ప్రభుత్వ గుర్తింపు వచ్చేలా చేయండి సార్‌  
సార్‌.. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు వచ్చేలా చేయండి. సీపీఎస్‌ విధానం రద్దు చేయండి. 1983 నుంచి 1992 వరకు రూ.398 జీతం తీసుకున్న ఉపాధ్యాయులకు నోషనల్‌ ఇంక్రిమెంట్‌ వర్తింపచేయాలి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలపై మీరు సానుకూలంగా స్పందించాలి. 
– సాకేటి నాగరాజు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి, వాండ్రంగి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top