గ్రామాల్లో జగన్నినాదం

Solid welcome to YS Jagan from all over the Villagers - Sakshi

కష్టాలు వినే నేత వచ్చారంటూ వైఎస్‌ జగన్‌కు ఊరూరా ఘన స్వాగతం

పూల బాట పరచి, హారతి పట్టిన అక్కచెల్లెమ్మలు   

మీతోనే న్యాయం జరుగుతుందని దీవించిన అవ్వాతాతలు  

  బాబు పాలనలో ఒక్క పనీ కావడం లేదని వివిధ వర్గాల ప్రజల ఆవేదన 

అందరి కష్టాలు వింటూ.. ధైర్యం చెబుతూ ముందుకు సాగిన జననేత 

భోజన విరామం లేకుండా పాదయాత్ర

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వర్షంతో రోడ్లన్నీ బురదమయమై ఉన్నప్పటికీ చెక్కు చెదరని సంకల్పంతో ప్రతిపక్ష నేత,వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ బుధవారం 210వ రోజు పాదయాత్ర కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలోని రాయవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర అనపర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించినప్పుడు ప్రజలు భారీ ఎత్తున ఎదురేగి సాదరంగా స్వాగతం పలికారు. జనం సైతం బురదను లెక్క చేయక జననేత అడుగులో అడుగు వేశారు. కొమరిపాలెం గ్రామంలో స్థానికులు పూల బాట పరచి ఘన స్వాగతం పలికారు. ఊరూరా జనం దారిపొడవునా, మిద్దెలపైకి ఎక్కి చేతులూపుతూ జననేతకు సంఘీభావాన్ని ప్రకటించారు. జగన్‌ వారి స్పందనకు అనుగుణంగా జనం ఎటువైపు ఉంటే అటు తిరుగుతూ.. వెనక్కు తిరిగి అడుగులు వేస్తూ ముందుకు సాగారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామం చేరుకునేటప్పుడు పంట పొలాల్లో పనిచేసే రైతు కూలీలు జగన్‌ను చూడాలనే ఆరాటంలో పనులు మధ్యలోనే ఆపేసి గట్ల మీద పరుగులు తీస్తూ రోడ్డుపైకి చేరుకున్నారు. నాట్లు వేసే కూలీలు, దొండపాదుల్లో పనిచేసే కూలీలు ఉరుకులు పరుగులపై వచ్చి జననేతను కలిసి మురిసిపోయారు. రాయవరం, పందలపాక, కొమరిపాలెం, తొస్సిపూడి క్రాస్, ఊలపల్లి వరకు అడుగడుగునా జనం వెల్లువెత్తడంతో మధ్యాహ్నం భోజన విరామం లేకుండానే జగన్‌ పాదయాత్ర కొనసాగించారు.  
 
దారిపొడవునా సమస్యలే.. 
దారిపొడవునా అనేక మంది జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఊళ్లల్లో బెల్టు షాపుల వల్ల తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిసవుతున్నారని ఇద్దరు మహిళలు కన్నీటిపర్యంతమవుతూ ఆవేదన వ్యక్తం చేసినప్పుడు అందరి కళ్లలో నీళ్లు కదిలాయి. పొలాల మధ్యలో రాయవరం కాలేజీ ఏర్పాటు చేయడం వల్ల, వర్షం వస్తే జలమయం అవుతోందని.. పాములు, తేళ్ల వంటి విష జంతువులు వస్తున్నాయని విద్యార్థినులు వాపోయారు. కాలేజీని మరో చోటకు మార్చేలా చూడాలని జననేతకు విన్నవించుకున్నారు. వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో నడవాల్సిన మసీదులను తెలుగుదేశం పార్టీ రాజకీయ కేంద్రాలుగా మారుస్తున్నారని అనపర్తికి చెందిన ముస్లింలు జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. 2007 నుంచి పనిచేస్తున్నా రెగ్యులర్‌ చేయడం లేదంటూ జాతీయ ఉపాధి హామీ పథకం కాంట్రాక్టు ఉద్యోగులు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. ‘అన్నా.. బాబు మాటలు నమ్మి మోసపోయాం. మీతోనే న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకుంది. ఇక మీ వెంటే నడుస్తాం’ అని వివిధ వర్గాల ప్రజలు స్పష్టం చేశారు. ‘మీపై నమ్మకం ఉంది.. మంచి జరుగుతుంద’ని అక్కచెల్లెమ్మలు జననేతకు హారతి పట్టగా, అవ్వాతాతలు ఆశీర్వదించారు. అందరి సమస్యలు ఓపికగా వింటూ.. ధైర్యం చెబుతూ జగన్‌ ముందుకు సాగారు.  

వైఎస్సార్‌సీపీలోకి మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి  
ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి భారీ సంఖ్యలో తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. కందుకూరు శాసనసభా నియోజకవర్గం నుంచి గతంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడటమే కాక, 2014కు ముందు రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు జగన్‌ నాయకత్వంలో మళ్లీ పని చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఈ నెల 7న ఆయన తిరుపతిలో ప్రకటించిన మేరకు బుధవారం వేలాది మంది తన అనుచరులు, కార్యకర్తలు, వైఎస్‌ అభిమానులతో కలిసి వచ్చి పందలపాక వద్ద పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలుసుకుని తన అభీష్టాన్ని వెల్లడించారు.

జగన్‌ ఆయనకు పార్టీ కండువాను వేసి ఆహ్వానం పలికారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా నేత తూమాటి మాధవరావు సమక్షంలో ‘జైజగన్‌.. వైఎస్సార్‌ అమర్‌ రహే..’ అని కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేస్తుండగా మహీధర్‌రెడ్డితో పాటు పలువురు నేతలకు జగన్‌ పార్టీ కండువాలు కప్పారు. అనంతరం మహీధర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో తమకు మేలు జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారని చెప్పారు. జగన్‌.. తండ్రిని మించిన తనయుడిగా వైఎస్సార్‌ ఆశయాలను సంపూర్ణంగా నెరవేరుస్తారనే నమ్మకం, వైఎస్సార్‌సీపీ విధానాల పట్ల ఆకర్షితుడనై పార్టీలో చేరానని వెల్లడించారు. చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం కాకుండా సొంత అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారన్నారు.   

బీసీల్లో చేరుస్తామని బాబు మోసం చేశారు..  
అన్నా.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు మమ్మల్ని నట్టేట ముంచారు. ఒక్క అనంతపురం జిల్లా వ్యాప్తంగా బలిజలు ఆరు లక్షల మందిమి ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, ఒంటరి కులస్తులం పెద్ద సంఖ్యలో ఉన్నాం. ఈ కులాలన్నింటినీ బీసీల్లో చేరుస్తామని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది. ఎన్నికల సభల్లో ఇదే విషయాన్ని చంద్రబాబు పలుమార్లు చెప్పారు. ఆయన మాటలు నమ్మి మేమందరం ఓట్లు వేసి గెలిపించాం. తీరా గెలిచాక మాట తప్పారు. ఈ సారి మేమందరం టీడీపీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు సీఎం అయితే న్యాయం చేస్తారన్న నమ్మకం ఉంది.  
    – కొమరిపాలెం వద్ద జగన్‌తో రాయలసీమ బలిజ సంఘం నేతలు 

వైఎస్‌ దయ వల్లే నా కుమారుడు బతికాడు   
అయ్యా.. ఐదేళ్ల క్రితం నా కుమారుడు దుర్గాప్రసాద్‌ గుండెకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డాడు. ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకునేంత ఆర్థిక స్తోమత లేదు. ఆ సమయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే నా కుమారుడిని కాపాడింది. ఈ పథకం కింద ఉచితంగా శస్త్ర చికిత్స చేశారు. నా కుమారుడు ఇప్పుడు బాగున్నాడు. వైఎస్‌ మా పాలిట దైవం. అందుకే నా మనవడికి (దుర్గాప్రసాద్‌ కుమారుడు) ఆయన పేరే పెట్టుకున్నాను.   
– పందలపాక వద్ద జగన్‌తో గుత్తుకొల్లు వరలక్ష్మి  

మీపై నమ్మకం పెరిగింది..    
సార్‌.. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. డీఏలు, పీఆర్సీ బకాయిల కోసం ఎదురు చూస్తున్నాం.. నూతన పీఆర్‌సీకి సంబంధించి ఫిట్‌మెంట్‌ను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా ఇచ్చేలా కృషి చేయండి. ప్రతి పాఠశాలకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండే విధంగానూ, ఇంగ్లిషు మీడియం విద్యా బోధన ఉండేలా పాఠశాలలను మెరుగుపరిచేందుకు కృషి చేయండి. మీ వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం పెరిగింది.   
 – రాయవరం వద్ద జగన్‌తో అనపర్తి ఎస్‌టీయూ నాయకులు 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top