కర్ణాటకలో గెలుపోటముల్ని మారుస్తాయా ? 

Is Small Parties Playing Key Role In Karnataka Assembly Elections - Sakshi

కర్ణాటకలో గెలుపెవరిది ? ఇప్పుడు ఈ ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. ఏ సర్వే కూడా జనం నాడిని పట్టలేకపోతోంది. త్రిముఖంగా సాగే పోరులో హంగ్‌ అసెంబ్లీ తప్పదనే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్‌) మధ్య పోటీ ప్రధానంగా ఉన్నప్పటికీ ఎన్నికల తేదీ దగ్గరకొస్తున్నకొద్దీ  రోజుకో రకంగా ట్రెండ్స్‌ మారిపోతున్నాయి. కాంగ్రెస్‌ విజయావకాశాలను చిన్న పార్టీలు చిత్తు చేస్తాయని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు మొదలయ్యాయిు.

భారీగా ఓట్లు, సీట్లు సాధించలేకపోయినప్పటికీ కాంగ్రెస్‌కు ఈ పార్టీలు పక్కలో బల్లెంలా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2013 ఎన్నికల్లో బీఎస్‌ యడ్యూరప్ప నేతృత్వంలోని కర్ణాటక జనతా పక్ష, బి.రాములు  ఆధ్వర్యంలోని బీఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సహా చిన్నా చితక పార్టీలు ఏకంగా 15శాతం ఓట్లను సాధించి బీజేపీకి అధికారం రాకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్‌  పార్టీకి కలిసొచ్చింది. ఈ సారి ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు లేకపోయినప్పటికీ, మిగిలిన పార్టీలు ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తోంది.  వెయ్యి ఓట్లు కూడా అభ్యర్థి తలరాతను మార్చే ఈ ఎన్నికల్లో చిన్న పార్టీల విస్మరించే పరిస్థితి లేదు. ఏయే పార్టీలు, ఏ విధంగా కాంగ్రెస్‌ను దెబ్బ తీసే అవకాశం ఉందంటే..

బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ)
ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ దళితులు, మైనార్టీలు, ఓబీసీల ఓట్ల మీదే కొండంత ఆశలు పెట్టుకుంది. ఆ ఓటు బ్యాంకుని ఆకర్షించడానికి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. కానీ దళిత ఓట్లను మాయావతి బీఎస్‌పీ పార్టీ భారీగా చీలుస్తుందనే అంచనాలున్నాయి. బీఎస్‌పికి 2004లో 1.74 శాతం ఓటు షేర్‌ ఉంటే. 2008 ఎన్నికల నాటికి 2.74 శాతానికి పెరిగింది. గత ఏడాదికి 0.91 శాతానికి పడిపోయినప్పటికీ కాంగ్రెస్‌ దళిత బ్యాంకుని చీల్చడం కోసం ఈసారి జేడీ(ఎస్‌) బీఎస్పీ చేతులు కలిపాయి. దీంతో దళిత ఓట్లు భారీగా చీలిపోయి కాంగ్రెస్‌కు నష్టం చేకూరుస్తాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

సోషల్‌ డెమొక్రటికి పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డీపీఐ)
ఎస్‌డీపీఐకి కోస్తా కర్ణాటకలో మంచి పట్టుంది. ముస్లింలలో చాలా మంది ఎస్‌డీపీఐకి మద్దతుగా ఉన్నారు. ఇదే ప్రాంతంలో బీజేపీ హిందూత్వ కార్డుతో బలమైన శక్తిగా మారింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంకు అత్యంత కీలకం.  అందుకే ఎన్నికలకు ముందే ఎస్‌డీపీఐతో పొత్తు కోసం కాంగ్రెస్‌ ఆరాటపడింది. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.ఇప్పుడు ఈ పార్టీ ముస్లిం ఓటు బ్యాంకుని ఎంత చీలుస్తుందాన్న ఆందోళన కాంగ్రెస్‌లో నెలకొంది. 

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)
2014 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో పోటీ చేసిన ఆప్‌ 0.8 శాతం ఓటు షేర్‌ని సాధించింది. ఈ సారి ఎన్నికల్లో ముఖ్యంగా బెంగుళూరు నగరంపైనే దృష్టి పెట్టింది. మొత్తం 18 స్థానాల్లో పోటీకి సై అంటోంది. సిద్దరామయ్య సర్కార్‌ పనితీరుపై పట్టణ ప్రాంత ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నా ఆప్‌ కూడా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకే గండి కొడుతుందనే అంచనాలున్నాయి. 

ఆల్‌ ఇండియా మహిళా ఎంపవర్‌మెంట్‌ పార్టీ (ఎఐఎంఎంపీ)
నౌహెరా షేక్‌ అనే మహిళా పారిశ్రామికవేత్త స్థాపించిన ఈ పార్టీ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తోంది. ఈ పార్టీపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోయినా ముస్లిం ఓట్లను చీల్చడం కోసం బీజేపీయే పరోక్షంగా ఈ పార్టీని తెరపైకి తీసుకువచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఇక ముస్లిం ఓటు బ్యాంకుని ఎంఐంఎం చీలుస్తుందన్న ఆందోళన కాంగ్రెస్‌లో నెలకొంది.

60 స్థానాల్లో పోటీకి తొలుత ఎంఐఎం సిద్ధమైంది. ఆ తర్వాత మనసుమార్చుకొని ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఊపిరి పీల్చుకుంది. అయితే జేడీ(ఎస్‌) తరపున అసదుద్దీన్‌ ఒవైసీ ప్రచారం చేస్తూ ఉండడంతో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు ముప్పు వాటిల్లే అవకాశాలున్నాయి. 

ఇవే కాకుండా కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, భారతీయ జనశక్తి కాంగ్రెస్‌ వంటి 12 పార్టీలు గత ఆరునెలల్లోనే పుట్టుకొచ్చాయి. మొత్తమ్మీద ఇవన్నీ కాంగ్రెస్‌ కొంప ముంచుతాయన్న అంచనాలైతే ఉన్నాయి. 

- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top