హస్తం కాదంటే.. ఏనుగుతో నేస్తం! 

Six leaders ready to the contest with Congress ticket or BSP - Sakshi

కాంగ్రెస్‌ టికెట్‌ రాకుంటే బీఎస్పీ బీఫాంతో పోటీకి సిద్ధం

ఆరుగురు నేతల ప్రయత్నాలు

గతంలో ఏనుగు గుర్తుతో గెలిచిన పలువురు నేతలు  

సాక్షి, హైదరాబాద్‌: పొత్తులు, ఎత్తులు, తీవ్రమైన పోటీ కారణంగా టికెట్‌ దక్కకపోతే... ఎలాగైనా బరిలో నిలిచి గెలవాలంటే... అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే... ప్రత్యామ్నాయం చూసుకోవాలని భావిస్తున్నారు ఆశావహులు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే లక్ష్యం.. ప్రస్తుతమున్న పార్టీలో టికెట్‌ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించడం, లేదంటే మరో పార్టీ నుంచి బీ–ఫాం తెచ్చుకొని పోటీ చేయడం.. ఆశావహుల ముందున్న ప్రత్యామ్నాయాలు. అయితే, ఏదో ఒక పార్టీ నుంచి కాకుండా గుర్తింపు పొందిన జాతీయ పార్టీ తరఫున పోటీ చేయాలని వారు యోచిస్తున్నారు. ఒకవేళ గెలవలేకపోయినా గట్టిపోటీ ఇవ్వవచ్చని, రెండోస్థానంలోనైనా నిలిచి బలమైన నేతగా గుర్తింపు పొందవచ్చని భావిస్తున్నారు.

ఇతర పార్టీలతో పొత్తుల కారణంగా పలు స్థానాల్లో ఆశావహులకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు లభించే పరిస్థితి కానరావడంలేదు. దీంతో వారు ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నారు. టికెట్‌ రాకపోతే మరో జాతీయపార్టీగా ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) వైపు మొగ్గుచూపుతున్నారు. ఏనుగు గుర్తుపై పోటీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. చాలా జాతీయ పార్టీలుండగా బీఎస్పీ నుంచే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారన్న దానిపై అభ్యర్థులు ఓ లాజిక్‌ చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా బీఎస్పీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు గెలవడం, ఆయా సందర్భాలలో ఏర్పాటైన ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా కలసి పోవడం ఆనవాయితీగా వస్తోందని లెక్కలు వేసుకుంటున్నారు.

2004లో నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ అసెంబ్లీ స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన చిట్యాల రాజన్న 12,884 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతగా ఉన్న నిర్మల్‌ అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయన అనుచరుడు సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీ బీఫాం మీదే గెలుపొందారు. తదనంతరం టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా పనిచేశారు. దీంతో కాంగ్రెస్‌ టికెట్‌ రాని పక్షంలో ఆరుగురు ఆశావహులు బీఎస్పీ బీఫాం కోరుతున్నట్టు తెలిసింది. కరీంనగర్‌లో ఇద్దరు, వరంగల్‌లో ఒకరు, నిజామాబాద్‌ నుంచి ఒకరు, రంగారెడ్డిలో ఒకరు, నల్లగొండ నుంచి ఒకరు బీఎస్పీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top