కేసీఆర్‌ అందరివాడు

The situation of minorities has changed in kcr ruling : ktr - Sakshi

ఇమామ్‌లు, మౌజన్‌ల సమావేశంలో మంత్రులు కేటీఆర్, నాయిని, మహమూద్‌

అరవై ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలను ఓటుబ్యాంక్‌గా వాడుకుంది..

కేసీఆర్‌ పాలనలో మైనారిటీల స్థితిగతులు మారాయి

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుల,మతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. శనివారం ఇక్కడ నాంపల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం నేతృత్వంలో జరిగిన ఇమామ్‌లు, మౌజన్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ హయాంలో ప్రతిఏటా నగరంలో మతకలహాలు జరిగేవని, రోజుల తరబడి కర్ఫ్యూ ఉండేదన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో చిన్న సంఘటన కూడా జరగలేదన్నారు. గంగా జమునా సంస్కృతికి తెలంగాణ ప్రతీక అని అన్నారు. కేసీఆర్‌ మైనారిటీ పిల్లల విద్య కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 2,014 మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లను కార్పొరేట్‌ స్థాయి విద్యా ప్రమాణాలతో స్థాపించారన్నారు.

ఇందులో సుమారు 50 వేలమంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందజేస్తున్నట్లు తెలి పారు. విదేశాల్లో ఉన్నతవిద్య కోసం రూ.20 లక్షల ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తున్నట్లు చెప్పారు. షాదీముబారక్‌ పథకం ద్వారా వేలాదిమంది మైనారిటీ అమ్మాయిల వివాహానికి ప్రభుత్వం నిధులు అందజేసిందని పేర్కొ న్నారు. కాంగ్రెస్‌పార్టీ మైనార్టీలను అరవై ఏళ్లు గా ఓటుబ్యాంక్‌గా వినియోగించుకున్నదే తప్ప వారి అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు.  

ముస్లిం ఉద్యోగులసంఖ్య తగ్గింది: నాయిని
మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ నిజాం హయాంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలు 22 శాతముండగా, ప్రస్తుతం కేవలం 2 శాతమే ఉన్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 66 ఉర్దూ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసిందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింలకు అన్ని ప్రభుత్వ శాఖల్లో సముచిత స్థానం దక్కుతుందని హామీనిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో మైనారిటీల విద్యా ప్రమాణాలను పెంచడానికి పథకాలను ఎందుకు ప్రవేశ పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.

ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ బీజేపీతో జత కడుతుందని కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల నేతలు పుకార్లు చేస్తున్నారని, ఇందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌ సెక్యులర్‌ భావాలు కలిగిననేత అని పేర్కొన్నారు. దేశ బడ్జెట్‌లో మైనారిటీల కోసం రూ.4 వేల కోట్లు కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. మైనారిటీ ప్రజలు అత్యధికంగా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, బిహార్‌ రాష్రా ్టల్లోనూ ఇంత మొత్తంలో బడ్జెట్‌ కేటాయించలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పక్షాన ఉండాలని ఇమామ్, మౌజన్‌లను ఆయన కోరారు.  

సకాలంలో భృతి అందడంలేదని గరంగరం
రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ఆదేశాల ప్రకారం ప్రతినెలా ప్రభుత్వం అందజేస్తున్న భృతి సకాలంలో అందడంలేదని పలువురు ఇమామ్‌లు, మౌజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం ముగిసిన తర్వాత సమీపంలోని వక్ఫ్‌ బోర్డు కార్యాలయానికి ఇమామ్‌లు, మౌజన్‌లు మూకుమ్మడిగా వెళ్లి సంబంధిత అధికారు లను, సిబ్బందిని నిలదీశారు.

సమావేశానికి తప్పక రావాలని, లేనిపక్షంలో భృతి అందజేయబోమని ఫోన్‌లో చెప్పడం సరికాదని పలువురు ఇమామ్‌లు, మౌజన్‌లు అధికారులపై మండిపడ్డారు. తమకు బోర్డు చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫోన్లు చేశామని, తప్పు తమది కాదని అధికారులు, సిబ్బంది వివ రణ ఇవ్వడంతో ఇమామ్‌లు, మౌజన్‌లు శాంతించా రు. ఇంతవరకు భృతి అందనివారికి వెంటనే చెల్లించాలని ఇమామ్‌లు, మౌజన్‌లు కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top