నెహ్రు ఓ క్రిమినల్‌ : చౌహాన్‌

Shivraj Singh Chouhan Says Jawaharlal Nehru Committed A Crime - Sakshi

భువనేశ్వర్‌ : బీజేపీ సీనియర్‌ నాయకులు, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెహ్రు ఓ క్రిమినల్‌ అని విమర్శించారు. జమ్మూ కశ్మీర్‌కు జరిగిన అన్యాయానికి నెహ్రునే కారణమని ఆరోపించారు. నెహ్రు తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే కశ్మీర్‌ పూర్తిగా భారత్‌ సొంతమయ్యేదని అన్నారు.  

‘ భారత భద్రతా బలగాలు కశ్మీర్‌ నుంచి పాక్‌ గిరిజనులను వెళ్లగొడుతున్న సమయంలో నెహ్రు కాల్పుల విరమణను ప్రకటించి తొలి నేరానికి పాల్పడ్డారు. అందువల్ల 1/3 భూభాగం(పీవోకే) పాకిస్థాన్‌ చేతిలో ఉండిపోయింది. నెహ్రు ఇంకొద్ది రోజులు కాల్పుల విరమణ ప్రకటించి ఉండకపోతే కశ్మీర్‌ పూర్తిగా మన సొంతమయ్యేది. ఇక, జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని తీసుకురావడం ద్వారా నెహ్రు రెండో నేరం చేశారు. దీని ద్వారా ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది దేశానికి చేసిన అన్యాయం మాత్రమే కాదు నేరం కూడా’ అని శివరాజ్‌సింగ్‌ పేర్కొన్నారు.

కాగా, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూ కశ్మీర్‌ పునర్విభజన బిల్లును తీసుకువచ్చింది. దీని ప్రకారం కశ్మీర్‌, లదాఖ్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా నెహ్రు తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top