ఇరుగు పొరుగు

Settlers Votes is Crucial in Greater Hyderabad range - Sakshi

గ్రేటర్‌లో మమేకమైన ఏపీ, ‘తెలంగాణ’ ప్రజలు

ఎన్నికల్లో నిర్ణయాత్మకశక్తిగా మారిన వీరి ఓట్లు

పది నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం

‘చేపపిల్లలతో నిండిపోయి నది కళకళలాడినట్టే.. ఈ నగరం జనంతో నిండి కళకళలాడేలా చేయి ప్రభూ’.. నాడు హైదరాబాద్‌ నగర నిర్మాత కులీకుతుబ్‌షా చంచలం చెరువు ప్రారంభ సందర్భంలో అన్నమాటలివి. శతాబ్దాల చరిత్ర కలిగిన భాగ్యనగరం నేడు ఆ మాటలను నిజం చేసుకుంది. మహా నగర జనాభా ఇంతింతై అన్నట్లు నేడు కోటి మార్కును దాటింది. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి దశాబ్దాల క్రితమే వచ్చి స్థిరపడిన వారంతా ఈ ప్రాంతంలో అంతర్భాగమయ్యారు. ఇక్కడి సామాజిక, రాజకీయ, ఆర్థిక, సేవా రంగాల్లో తమదైన పాత్ర పోషిస్తున్నారు. సంఖ్యాపరంగానూ చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న వివిధ ప్రాంతాల వారు.. ప్రతి ఎన్నికల సమయంలో కీలకంగా మారుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు పది నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు అభ్యర్థుల గెలుపోటముల విషయంలో నిర్ణయాత్మక శక్తిగా ఉంటున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఉప్పల్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల్లోని మొత్తం ఓట్లలో సుమారు 20 శాతం ఓట్లు వారివే.. ఇక తెలంగాణ రాష్ట్రంలోని పొరుగు జిల్లాల నుంచి ఏళ్ల క్రితమే ఇక్కడికొచ్చి స్థిరపడిన వారూ లక్షల్లో ఉన్నారు. వీరి జనాభా కూడా ఆయా నియోజకవర్గాల్లోని మొత్తం ఓట్లలో సుమారు 25 శాతం మేర ఉన్నట్లు అంచనా. ఎన్నికల వేళ వీరందరి ఓట్లను రాబట్టుకునేందుకు వివిధ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులివీ..

కూకట్‌పల్లి: కీలకం
మినీ ఆసియాగా పేరొందిన ఈ నియోజకవర్గంలో ఏపీలోని సీమాంధ్ర ప్రాంతాలతో పాటు, తెలంగాణ జిల్లాలు, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల వారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. నియోజకవర్గంలో 3.67 లక్షల ఓటర్లుండగా, 1.50 లక్షల మంది సీమాంధ్ర ప్రాంతం వారే ఉన్నారని అంచనా. ఇక తెలంగాణలోని పలు జిల్లాల నుంచి దశాబ్దాల క్రితమే వచ్చి స్థిరనివాసం ఏర్పర్చుకున్న వారు లక్ష మంది వరకు ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కూకట్‌పల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాధవరం కృష్ణారావు ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే, కూటమి నుంచి నందమూరి సుహాసినిని అభ్యర్థిగా ప్రకటించడంతో ఇక్కడ పోరు రసవరత్తరం కానుంది. 

శేరిలింగంపల్లి: మినీ ఇండియా
ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్, నిర్మాణ, ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల కొంగు బంగారంగా మారిన ఈ నియోజకవర్గాన్ని మినీ ఇండియాగా అభివర్ణించవచ్చు. ఇక్కడ మొత్తం ఓటర్లు 5.49 లక్షలు. వీరిలో దశాబ్దాల క్రితమే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం నగరానికి వచ్చి స్థిరపడిన సీమాంధ్రులు 1.75 లక్షల మంది ఉన్నట్లు అంచనా. తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారూ రెండు లక్షల మంది వరకు ఉంటారు. ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాలకు చెందిన వారు మరో లక్ష వరకు ఉన్నట్లు అంచనా. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన అరికెపూడి గాంధీ ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. 

ఎల్బీనగర్‌: మొగ్గు ఎటుంటే అటే..
ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చే వారికి గేట్‌వేగా ఉన్న ఈ నియోజకవర్గంలో సెటిలర్స్‌ ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 4.74 లక్షల మంది ఓటర్లుండగా, సీమాంధ్రులు 40 వేల మంది ఉన్నట్లు అంచనా. తెలంగాణలోని నల్లగొండ సహా ఇతర జిల్లాల నుంచి స్థిరపడిన వారు మరో లక్ష మంది వరకు ఉన్నారు. వీరంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థే గెలుపొందడం ఖాయం. గత ఎన్నికల్లో బీసీ సంఘం జాతీయ నేత ఆర్‌.కృష్ణయ్య టీడీపీ తరఫున గెలుపొందారు.

ఖైరతాబాద్‌: ప్రభావం ఎక్కువే
ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోనూ ఇరుగుపొరుగు ఓట్లే కీలకపాత్ర పోషించనున్నాయి. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2.56 లక్షలు. ఇందులో 50 వేల మంది సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారే. మరో 30 వేల మంది వరకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారున్నారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన న చింతల రామచంద్రారెడ్డి (బీజేపీ) మరోసారి బరిలోకి దిగారు. 

జూబ్లీహిల్స్‌: 1.50 లక్షల మందిపైనే..
జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో 3.23 లక్షల ఓటర్లు ఉంటే, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి ఓట్లు 80 వేల దాకా ఉన్నాయి. ఇక తెలంగాణ జిల్లాల నుంచి ఏళ్ల క్రితం వచ్చి స్థిరపడిన వారు 50 వేల మంది, మరో 20 వేల మంది వరకు ఉత్తరాది రాష్ట్రాల వారున్నట్లు అంచనా. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్‌ ఈసారి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్నారు. 

రాజేంద్రనగర్‌: ‘కీ’ రోల్‌
జంటజలాశయాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థలతో నిండి ఉండే ఈ నియోజకవర్గంలోనూ సెటిలర్స్‌ ఓట్లు కీలకం కానున్నాయి. నియోజకవర్గంలో ఓటర్లు 4.13 లక్షలు కాగా, 70 వేల మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే. మరో 50 వేల మంది వరకు తెలంగాణ జిల్లాల నుంచి స్థిరపడిన వారున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన ప్రకాశ్‌గౌడ్‌ ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బరిలోగి దిగారు.

ఉప్పల్‌: వారి చేతిలోనే ‘లక్‌’
పాతకొత్తల సమ్మేళనమైన ఉప్పల్‌ నియోజకవర్గంలో 4.54 లక్షలమంది ఓటర్లు ఉండగా, సీమాంధ్రులు 50 వేల మంది, లక్ష మంది వరకు తెలంగాణ జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీచేసి గెలిచిన ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సికింద్రాబాద్‌: సంఖ్య స్వల్పమే
ఆధునికతకు అద్దంపట్టే ఈ నియోజకవర్గంలో 2.20 లక్షల మంది ఓటర్లున్నారు. ఇక్కడ సీమాంధ్ర ఓటర్లు సుమారు 20 వేల మంది ఉండగా.. తెలంగాణ జిల్లాల నుంచి వలస వచ్చిన వారు 70 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి గెలుపొందిన పద్మారావు మరోసారి బరిలోకి దిగారు.

కంటోన్మెంట్‌: ఇక్కడా ఎఫెక్ట్‌..
రక్షణ శాఖకు నిలయమైన కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో 2.37 లక్షల ఓటర్లు ఉండగా, 20 వేల మంది వరకు సీమాంధ్రులున్నారు. మరో 50 వేల మంది వరకు తెలంగాణ జిల్లాల నుంచి వలస వచ్చిన వారున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన జి.సాయన్న ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీకి దిగారు.

సనత్‌నగర్‌.. నిర్ణేతలు వారే..
పారిశ్రామికీకరణ ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో ఇరుగుపొరుగు వారి ఓట్లే ప్రధాన పార్టీల భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2.25 లక్షల మంది ఓటర్లు ఉండగా, 70 వేల మంది వరకు సీమాంధ్రులున్నట్లు అంచనా. మరో 50 వేల మంది తెలంగాణ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారున్నారు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌.. ఈసారి టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్నారు.  ఇక్కడా అభ్యర్థుల గెలుపోటములపై ఇక్కడ స్థిరపడిన వారి ఓట్లే ప్రభావం చూపనున్నాయి. 
..:: ఏసిరెడ్డి రంగారెడ్డి

నాడు శత్రువులు.. నేడు మిత్రులు
బంజారాహిల్స్‌: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు/శత్రువులు ఉండరు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ డైరెక్టర్‌ విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి దానం నాగేందర్‌ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీల పరంగా బద్ధ శత్రువులు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరినీ టీఆర్‌ఎస్‌ ఒక్కటి చేసింది. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు ఖైరతాబాద్‌ టిక్కెట్‌ కేటాయించగా టీఆర్‌ఎస్‌లోనే ఉన్న విజయరామారావు మద్దతు కావల్సి వచ్చింది. దీంతో నాగేందర్‌ శనివారం విజయరామారావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2009లో ఇద్దరూ పోటీపడ్డ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. ఈ ఎన్నికల అనంతరం విజయారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు ప్రస్తుతం ఖైరతాబాద్‌ టిక్కెట్‌ దక్కడంతో.. నాడు పోటీలో నిలిచి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న విజయారెడ్డి వద్దకు వెళ్లి ఆమె మద్దతు కోరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ రెండు సంఘటనలు కళ్లకు కట్టాయి.

కమలానికి కలిసొచ్చిన స్థానం
పూర్వపు హిమాయత్‌నగర్‌ స్థానానికి 1983లో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆలె నరేంద్ర గెలిచారు. మళ్లీ 1985 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షాల మద్దతుతో ఆయన గెలుపొందారు. 1989 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వి.హనుమంతరావు చేతిలో ఓడిపోయారు. 1992 ఉప ఎన్నికలో ఇక్కడి నుంచే మళ్లీ నరేంద్ర ఎన్నికయ్యారు. తర్వాత 1994, 99 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సి.కృష్ణాయాదవ్‌ గెలిచారు. 2004లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా జి.కిషన్‌రెడ్డి గెలిచారు. 2008 పునర్విభజనతో ఇది అంబర్‌పేటగా మారింది. వరుసగా 2009, 2014లో కిషన్‌రెడ్డి  (బీజేపీ) గెలుపొందారు. మళ్లీ అంబర్‌పేట నుంచి కిషన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్‌ (టీఆర్‌ఎస్‌) పోటీచేస్తున్నారు. 

ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆపద్ధర్మ సీఎం హోదాలో తొలిసారి తెలంగాణలో 1985లో నల్లగొండ నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలిచారు. అప్పుడు హిందూపురం, గుడివాడ నుంచి కూడా ఆయన ఎన్నికయ్యారు. వెంటనే నల్లగొండ, గుడివాడ సీట్లకు ఎన్టీఆర్‌ రాజీనామా చేసి హిందూపురం శాసనసభ్యునిగా కొనసాగారు. ఐదేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (1989 డిసెంబర్‌) ఆయన హిందూపురంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేశారు. ఈ తెలంగాణ సీటులో కాంగ్రెస్‌ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్‌ చేతిలో ఎన్టీఆర్‌ ఓటమి పాలయ్యారు. మళ్లీ ఆయన తెలంగాణ నుంచి అసెంబ్లీకి పోటీ చేయలేదు. 1989 తర్వాత 29 ఏళ్లకు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యురాలు (మనవరాలు) సుహాసిని పోటీ చేస్తుండటం విశేషం. హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి నుంచి టీడీపీ టికెట్‌పై ఆమె పోటీచేయడం ద్వారా తాత తర్వాత తెలంగాణ నుంచి అసెంబ్లీకి ఎన్నికల రంగంలోకి దిగిన నందమూరి కుటుంబసభ్యురాలిగా గుర్తింపు పొందారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top