టీడీపీలో రాజుకున్న చిచ్చు!

Seniors Angry on TDP Committees

పార్టీ కమిటీల్లో సీనియర్లకు మొండిచేయి

ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారని విమర్శలు

మండిపడుతున్న సీనియర్‌ నేతలు

సాక్షి, విజయవాడ: టీడీపీ జాతీయ, ఏపీ రాష్ట్ర కమిటీల్లో సీనియర్ నాయకులకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫిరాయింపుదారులకు పెద్దపీట వేశారని సీనియర్లు మండిపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో పక్కనపెట్టిన తమకు కనీసం పార్టీ పదవుల్లోనైనా న్యాయం జరుగుతుందని భావించిన సీనియర్లకు చంద్రబాబు మరోసారి రిక్తహస్తం చూపారు. పార్టీ మారి వచ్చిన వారికే కమిటీల్లోనూ పెద్ద పీట వేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కమిటీల్లో ఉన్న బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, కరణం బలరాం, బోండా ఉమ, గాలి ముద్దు కృష్ణమనాయుడు లాంటి సీనియర్‌ నాయకులను పక్కన పెట్టడం పట్ల తెలుగు తమ్ముళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వారిని కనీసం కమిటీల విస్తరణలో పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆయారాం.. గయారాంలకు టీడీపీ వేదికగా మారిందని గతంలో చంద్రబాబుకు గోరంట్ల లేఖ రాశారు. కాపుల గొంతు కోశారని బోండా ఉమ విమర్శలు చేశారు. మంత్రి పదవి రాలేదని బండారు గన్‌మెన్‌లను సరెండర్‌ చేశారు. తనకు పదవి రాలేదని ధూళిపాళ్ల, గౌతు శివాజీ రాజీనామాలకు కూడా సిద్ధపడ్డ సంగతి తెలిసిందే. ఫిరాయింపు నేతలను ప్రోత్సహించవద్దని గతంలో కరణం బలరాం బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా వీరికి సీట్లు ఇచ్చేది అనుమనమేనని టీడీపీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడిన వారిని పక్కన పెట్టడంపై పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top