సార్వత్రిక ఎన్నికలకు.. షెడ్యూల్‌ ఫిబ్రవరిలోనే!

Schedule For Lok Sabha Elections May On February - Sakshi

ఏప్రిల్‌ తొలి వారం నుంచి ఎన్నికలు షురూ

ఐదు దశల్లో పూర్తిచేసేలా ఈసీ కసరత్తు

తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు

 రెండో వారంలో తెలంగాణ, మూడో వారం ఆంధ్రప్రదేశ్‌లో..

తొలి రెండు దశల్లో నక్సల్స్‌ ప్రభావిత, 

ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహణ

మే తొలి వారానికి ప్రక్రియ ముగించే యోచన

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: 2019 సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు, నాలుగు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రాల ఎన్నికల అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సంప్రదింపులు, సమావేశాలు జరిపిన ఈసీ.. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖతోనూ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన లాంఛనాలను పూర్తి చేసింది. ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్‌ విడుదల చేయడానికి వీలుగా ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది.

మొత్తం ఐదు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయనున్నట్లు సమాచారం. మునుపటి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ గజిబిజిగా ఉండటంతో పాటు ఎన్నికల ప్రక్రియ (షెడ్యూల్‌ మొదలుకుని ఫలితాలు వచ్చేవరకు) ఎక్కువకాలం సాగడంపై రాజకీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సుదీర్ఘమైన ప్రక్రియ వల్ల రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనేక విషయాల్లో అచేతనంగా ఉండాల్సి వస్తుందనే ఫిర్యాదు కూడా వచ్చింది. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ నెలరోజుల్లో మొత్తం ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 2014లో మార్చి6న మొదలైన ప్రక్రియ రెండున్నర మాసాలపాటు సాగింది. ఈ సారి 55–60 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా షెడ్యుల్‌ ఉంటుందని విశ్వసనీయవర్గాల సమాచారం.
 
ఏప్రిల్‌ మొదటి వారంతో మొదలై.. 
సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యుల్‌ విడుదల చేయడం దాదాపుగా ఖరారైందని, తేదీ ఎప్పుడనేది ఈ నెలాఖరుకు స్పష్టత వస్తుందని విశ్వసనీయ అధికార వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎంత పెద్ద రాష్ట్రమైనా ఈసారి కనిష్టంగా రెండు, గరిష్టంగా మూడు దశల్లో పోలింగ్‌ పూర్తి చేయాలని భావిస్తోంది. 2014లో బీహార్, ఉత్తరప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఐదు నుంచి ఏడు దశల పాటు ఎన్నికలు నిర్వహించడం ద్వారా పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని.. ఆయా రాష్ట్రాల పభ్రుత్వాలు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువచ్చాయి. దీంతో ఏప్రిల్‌ మొదటివారంలో ప్రారంభించి ఈసారి 5 లేదా 6 దశల్లో ఎన్నికలు పూర్తి చేయాలని (ఏప్రిల్‌ చివరి వరకు) నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలి రెండు విడతల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాలు, జమ్ముకాశ్మీర్‌తో పాటు ఇతర కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేసేలా షెడ్యుల్‌ రూపొందిస్తోంది. 

తెలంగాణ, ఏపీల్లో.. 
గతంలో మాదిరిగానే.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేయనున్నారు. ఏప్రిల్‌ రెండో వారంలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు, మూడో వారంలో ఏపీలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో పూర్తి చేసేందుకు వ్యూహరచన జరుగుతోంది. దక్షిణాది ఐదు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ఒకే దశలో పూర్తి చేస్తారు. రెండో దశలో తెలంగాణ, తమిళనాడు, మూడో దశలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక ఉండొచ్చని అధికారవర్గాల సమాచారం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top