రజనీకాంత్ రాజకీయ ప్రవేశం

sakshi special story on rajinikanth political entry - Sakshi

తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశం ఖాయమని చెప్పడంతో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి మార్పులొస్తాయి? రజనీ తరానికే చెందిన మరో హీరో కమలహాసన్ ఇప్పుడేం చేస్తారు? వంద రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని కిందటి సెప్టెంబర్లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తారా? లేక వెనక్కి తగ్గుతారా? మాజీ సినీతార జయలలిత మరణానంతరం మళ్లీ ప్రజలు సీనీరంగ ప్రముఖులకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆర్కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థి టీటీవీ దినకరన్ విజయం అనేక కొత్త ప్రశ్నలకు తెర లేపింది. పాలకపక్షం ఆలిండియా అన్నాడీఎంకే(ఏఐఏడీఎంకే) ఎన్నికల గుర్తు రెండాకులు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ఈ పళనిస్వామి, ఓ పన్నీర్సెల్వం(ఈపీఎస్-ఓపీఎస్) వర్గానికే దక్కింది. (సాక్షి ప్రత్యేకం) అంతకు ముందే మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు వారికే మద్దతు పలికారు. మాజీ సీఎం జయలలిత సహాయకురాలు, ఆమె వారసురాలని భావించిన వీకే శశికళ జైలుకెళ్లారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమె వర్గాన్ని వదిలి పాలకపక్షానికే దగ్గరయ్యారు. ఈ పరిణామాలతో ఆమె అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ఏఐఏడీఎంకే చిన్న చీలికవర్గంగా మారిపోయింది. టీటీవీ ప్రెజర్ కుకర్ విజయంతో జయ వారసత్వం శశికళదేనని తమిళ ప్రజలు గుర్తించారనే ప్రచారం కూడా మొదలైంది. కేవలం ఒక అసెంబ్లీ ఉప ఎన్నికతో ఇంతటి పెద్ద విషయం తేలకపోయినా మీడియా, జనం ఫోకస్ మాత్రం టీటీవీ-శశికళ వర్గం మీదకు తాత్కాలికంగా మళ్లింది. చీలిక వల్ల ఏఐఏడీఎంకే వచ్చే ఎన్నికల నాటికి బలహీనమై ఓటమి పాలవుతుందనే అంచనాతోనే మొదట రజనీకాంత్, తర్వాత కమలహాసన్ రాజకీయాల్లో చేరడంపై మాట్లాడడం ప్రారంభించారనేది పలువురి అభిప్రాయం.

ఎందుకింత జాప్యం?
సినీరంగంతో మొదట్నించీ సంబంధాలున్న తమిళ రాజకీయాల్లో చేరడానికి రజనీ చాలా సమయం తీసుకున్నారు. 1996 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ సినీ కార్యక్రమంలో  ప్రసంగిస్తూ, రాష్ట్రంలో అసహన ధోరణలు నెలకొన్నాయని ప్రకటించడం ద్వారా రజనీ అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి జయలలితకు కోపం తెప్పించారు. రాజకీయాలపై సూపర్స్టార్ వ్యాఖ్యానించడం ఇలా మొదలైంది. 1996 ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే-తమిళ మానిల కాంగ్రెస్ కూటమికి ఓటేయాలని ప్రజలకు పిలుపు ఇస్తూ, ‘‘జయలలితకు మళ్లీ అధికారం అప్పగిస్తే దేవుడు కూడా తమిళనాడును కాపాడలేడు,’’ అని రజనీకాంత్ చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం సృష్టించింది. డీఎంకే-టీఎంసీ కూటమి విజయం వెనుక రజనీ మాట మంత్రంలా పనిచేసిందని నమ్మినవారూ ఉన్నారు. 1991 నుంచీ ఐదేళ్ల పాలనలో జయలలిత ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. అందుకే ఆమె ఓడిపోయారనీ, ఇందులో రజనీ పాత్ర పెద్దగా లేదని మరి కొందరు భావించారు.  ఇలా ఎన్నికల సమయంలోనే తన అభిప్రాయం చెబుతారనే పేరు తెచ్చుకున్న రజనీకాంత్ పూర్తి స్థాయి రాజకీయ రంగప్రవేశం ఇంకా ముందే జరుగుతుందని అంచనావేశారు. అలా జరగలేదు. వాస్తవానికి రజనీ రాజకీయ ప్రవేశానికి సరైన సమయం 1996 అసెంబ్లీ ఎన్నికలేనని, ఇలా గొప్ప అవకాశం ‘వచ్చి వెళ్లిపోయిందని’ కూడా అనుకోవచ్చు. ఇరవై ఏళ్లు దాటాక ఎట్టకేలకు ఆయన రాజకీయాల్లోకి నిజంగా అడుగుబెడుతున్నట్టు ప్రకటించారు. (సాక్షి ప్రత్యేకం)

పాతికేళ్ల క్రితమే జయతో రజనీ గొడవ?
చెన్నైలోని పోయెస్ గార్డెన్ అనే ఒకే వీధిలో ఉంటున్న మహిళా ముఖ్యమంత్రికి, సూపర్స్టార్కు మధ్య 1992లో అంటే జయ సీఎం అయిన ఏడాదికి గొడవ మొదలైందని చెబుతారు. ఓ రోజు కారులో ఇంటికొస్తున్నరజనీకాంత్ను వీధిలోకి రాగానే పోలీసులు ఆపేశారు. సీఎం జయ బయటికి వెళ్లే వరకూ నిలిచి ఉండాలని ఆయనకు చెప్పారు. ఆగ్రహించిన రజనీ కోపం దిగమింగుకుని పక్కనే ఉన్న కరెంటు స్తంభం ఆనుకుని సిగరెట్ వెలిగించారు. వెంటనే జనం పోగయ్యారు. హడావుడిగా పరిగెత్తుకొచ్చిన పోలీసు ఆయనను ముందుకు పోవాలని కోరాడు. ‘‘ సర్, ఆమె ఎప్పుడు వెళతారా అని చూస్తున్నాను. (సాక్షి ప్రత్యేకం) సీఎం పోయే వరకూ వేచి ఉండడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు,’’ అని రజనీ జవాబిచ్చారు. ఇలా జయపై రజనీలో చీకాకు మొదలైందనే ప్రచారం ఉంది. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో బాహాటంగానే ఏఐఏడీఎంకే ఓటమికి ఆయన పిలుపు ఇవ్వడంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు కేవలం నాలుగు సీట్లే దక్కాయి. బర్గూరు అసెంబ్లీ స్థానంలో జయ ఓడిపోయారు. ఏఐఏడీఎంకే పరాజయానికి రజనీ పిలుపే ప్రధాన కారణమనే ఖ్యాతి ఆయనకు లభించింది.

రాజకీయ ప్రవేశంపై మే నెలలో తొలి ప్రకటన
కిందటి మేలో 8 సంవత్సరాల తర్వాత అభిమాన సంఘాలవారితో చెన్నయ్ రాఘవేంద్ర మండపంలో రజనీ సమావేశమై రాజకీయ ప్రవేశంపై నోరు విప్పారు. ‘‘ ప్రస్తుతం దేవుడు నన్ను నటునిగా ఉండమంటున్నాడు. దైవం అనుమతిస్తే రేపే రాజకీయాల్లో చేరతాను. 21 ఏళ్ల క్రితం నేను ఓ ‘రాజకీయ ప్రమాదం’లో చిక్కుకున్నా. కొన్ని కారణాల వల్ల అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓ రాజకీయ కూటమికి(డీఎంకే-టీఎంసీ) మద్దతు ప్రకటించా. నా అభిమానులు, తమిళ ప్రజలు ఈ కూటమిని గెలిపించారు. ఆ రోజు నుంచి ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నా పేరు ప్రస్తావించడం ఆనవాయితీగా మారింది. ఈ కారణంగానే నేనే పార్టీకి మద్దతివ్వడం లేదని ప్రతి ఎన్నికల ముందూ చెప్పేవాణ్ని.’’అని రజనీ చెప్పిన మాటలు ఆయన రాజకీయ ప్రవేశం ఖాయమనే ఊహాగానాలకు తెరలేపాయి. జయ మరణం తమిళనాట సృష్టించిన ‘శూన్యాన్ని’ తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం వచ్చిందని బీజేపీ భావిస్తోందనీ, రజనీ నిర్ణయం వెనుక కమలం హస్తం ఉందనే మాటలు వినిపించాయి. (సాక్షి ప్రత్యేకం)

ఎన్డీఏకు దగ్గరవుతారా?
రజనీ రాజకీయాల్లో అడగు పెట్టడమంటూ జరిగితే సొంత పార్టీ పెడతారని కొందరు, లేదు కేంద్రంలో పాలకపక్షం బీజేపీలో చేరతారని మరి కొందరు ఎవరికి తోచినట్టు వారు ఆయన మాటలను విశ్లేషించారు. రజనీ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే బీజేపీ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆయనను బీజేపీలోకి ఆహ్వానిస్తూ, రజనీకాంత్కు బీజేపీలోనే తగిన స్థానం ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన ప్రారంభించే ప్రాంతీయపార్టీ తప్పకుండా బీజేపీ కూటమిలో చేరి పొత్తుపెట్టుకుంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు జోస్యం చెప్పారు.

ద్రావిడ మూలాలు లేకున్నా తమిళ రాజకీయాల్లో గెలుపు సాధ్యమేనా?
బెంగుళూరులో స్థిరపడిన మరాఠీ కుటుంబంలో(మరాఠాలకు దగ్గరైన కుణ్బీ కులం) జన్మించిన రజనీకాంత్ దశాబ్దాల క్రితమే తమిళనాడును నివాసప్రాంతంగా చేసుకున్నారు. అంతేకాదు, తమిళ శ్రీవైష్టవ బ్రాహ్మణకుటుంబానికి చెందిన లతా రంగాచారిని పెళ్లాడారు. రాజకీయాల్లోకి వస్తే రజనీని మరాఠీ మూలాలున్న వ్యక్తిగానే పరిగణించాలని తమిళ తీవ్రవాద సిద్ధాంతాలు నమ్మే నటుడు, నామ్ తమిళర్ కచ్చి నేత సీమన్ కొన్ని నెలల క్రితమే హెచ్చరించారు. (సాక్షి ప్రత్యేకం) ఎంజీ రామచంద్రన్ వంటి మలయాళీని తమిళ హీరోగా, ముఖ్యమంత్రిగా ఆమోదించిన తమిళ ప్రజానీకానికి రజనీ సామాజిక మూలాలు అసలు సమస్యే కాకపోవచ్చనే వాదనా ఉంది. జయలలిత వంటి పుట్టుకతో బ్రాహ్మణులైన నేతలు సహా దాదాపు అన్ని ప్రధానపక్షాలూ బ్రాహ్మణేత రాజకీయాల వారసత్వాన్నే పైకి గౌరవిస్తున్నాయి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన జయలలిత ఏఐడీఎంకే వంటి బ్రాహ్మణ వ్యతిరేక సైద్ధాంతిక మూలాలున్న ద్రావిడపార్టీని దాదాపు మూడు దశాబ్దాలు ముందుకు నడిపారు. ప్రస్తుతం తమిళనాట 1967 నాటి భాష, కులం ఆధారంగా నడిచిన ద్రావిడ రాజకీయాలు లేవు. ఈ నేపథ్యంలో రజనీ సామాజిక, సైద్ధాంతిక మూలాలు తమిళ రాజకీయాల్లో విజయానికి అడ్డంకులయ్యే అవకాశమే లేదు.

విజయం ఖాయమేనా?
సొంత పార్టీ పెట్టి ఒంటరిగా పోటీ చేస్తే రజనీ పార్టీకి విజయం ఏ స్థాయిలో ఉంటుందనేదే కీలక ప్రశ్న. అక్టోబర్ ఒకటిన అగ్రశేణి తమిళ నటుడు శివాజీ గణేశన్ స్మారక భవనం ప్రారంభ కార్యక్రమంలో  పాల్గొన్న రజనీ రాజకీయాల్లో నటుల జయాపజయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘శివాజీ గణేశన్ అత్యంత ప్రజాదరణ ఉన్న నటుడైనా రాజకీయాల్లో విజయం లభించలేదు. సొంత పార్టీ పెట్టి సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయారు. (సాక్షి ప్రత్యేకం) అంటే, సినిమా రంగంలో సాధించిన పేరు, పలుకుబడి రాజకీయాల్లో గెలుపునకు గ్యారంటీ ఇవ్వవు. ఇక్కడ గెలుపునకు వీటికి మించినదేదో ఉంది. అదేంటో తెలిస్తే రాజకీయాల్లో విజయం సాధించవచ్చు,’’ అని రజనీ అన్న మాటలు రాజకీయాలపై పెరిగిన ఆయన అవగాహనకు అద్దంపడుతున్నాయి. తోటి తమిళ నటుదు విజయకాంత్, తెలుగు నటుడు చిరంజీవిలా కేవలం 17-18 శాతం ఓట్లకే పరిమితమవుతారా? లేక ఎన్టీఆర్, ఎంజీఆర్లా తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి సీఎం అవుతారా? అనే ప్రశ్నలకు జవాబు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనే తెలుస్తుంది. అదీగాక, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాంతీయపార్టీ పెడతానని రజనీకాంత్ ప్రకటించారు. ప్రస్తుత అసెంబ్లీ ఐదేళ్లూ కొనసాగితే(2016 నుంచి) 2021 మేలో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే ఎన్ని నెలలు ముందు రజనీ పార్టీ పుడుతుందనేదే ఇప్పుడు కీలక ప్రశ్న.

తమిళనాట సినీ రాజకీయం..!
తమిళ రాజకీయాలతో సినీరంగానికి విడదీయరాని బంధం. 1940 దశకం చివరి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయాలు, సినిమాలు కలగలిసి పోయాయి. ద్రవిడ మున్నేట్ర కజగం డీఎంకే విధానాల్లో అంతర్లీనంగా ఉన్న సాంఘిక సంస్కరణలు, సామాజికన్యాయం వంటి కీలకాంశాలు, పార్టీ భావజాలాన్ని స్క్రిప్ట్రైటర్గా ఎం.కరుణానిధి  సినిమాల్లోకి తీసుకొచ్చారు. 1960 దశకం మొదటి నుంచి డీఎంకేతో  ప్రముఖ సినీ హీరో ఎంజీ రామచంద్రన్ మమేకం అయ్యారు. (సాక్షి ప్రత్యేకం) పార్టీ సిద్ధాంతాలకు తోడు, సినీగ్లామర్ పనిచేయడంతో  1967 ఎన్నికల్లో డీఎంకే తొలిసారి గెలుపొందింది. కరుణానిధి సీఎం అయ్యారు.  కరుణానిధి తన పెద్ద కొడుకు ముత్తును హీరోగా ప్రోత్సహించి, అభిమానసంఘాలు ఏర్పాటు చేశారు. దీనితో కరుణానిధి, ఎంజీఆర్ల మధ్య  స్పర్థలు తలెత్తాయి. ఫలితంగా  పార్టీ నుంచి ఎంజీఆర్ను బహిష్కరించారు. ఈ పరిణామాలు డీఎంకే చీలికకు దారితీశాయి. 1972లో అన్నా  ద్రవిడ మున్నట్ర కజగం (ఏడీఎంకే)పార్టీని ఎంజీఆర్ స్థాపించారు.

సీఎం అయిన తొలి హీరో ఎంజీఆర్...
ప్రజాదరణ కలిగిన సినీ హిరోగా కొనసాగుతూ   ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా 1977లో  ఎంజీ రామచంద్రన్ చరిత్ర సృష్టించారు. దాదాపు 25 సినిమాల్లో ఎంజీఆర్‌తో కలిసి జె.జయలలిత నటించారు. మొదట ప్రాపగాండా సెక్రటరీగా నియమితులైన ఆమెకు ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. ఎంజీఆర్ మరణించాక ఆయన భార్య జానకీ రామచంద్రన్ సీఎం పదవిని చేపట్టారు. ఆ తర్వాత జానకి  జయలలితల మధ్య విభేదాలు పొడసూపాయి.  రెండువర్గాలు పోటాపోటీగా పార్టీ ఎన్నికల చిహ్నం ‘రెండాకులు’ కోసం పోరాడాయి. అయితే ఎన్నికల సంఘం వారిలో ఎవరికీ ఆ గుర్తును కేటాయించలేదు. దరిమిలా జరిగిన ఎన్నికల్లో ఇరువర్గాలు ఓటమిని చవిచూశాయి. రాజకీయాల నుంచి జానకి వైదొలగడంతో జయలలిత పార్టీపై పూర్తి పట్టును సాధించారు. (సాక్షి ప్రత్యేకం) 1988లో ఎన్నికల గుర్తును కూడా సాధించిన ఆమె  పార్టీ  ప్రధానకార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1991 ఎన్నికల్లో గెలుపొంది ఆ రాష్ట్ర తొలి మహిళా సీఎం అయ్యారు.

పొలిటికల్ హిట్ సాధించలేకపోయిన విజయకాంత్...!
సినీరంగం నుంచే వచ్చిన మరో నేత విజయకాంత్. 2006 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశీయ మురుపోక్కు ద్రావిడ కజగం (డీఎండీకే) పార్టీని స్థాపించి మొత్తం 234 సీట్లకు పోటీచేశారు. ఆ పార్టీ దాదాపు 28 లక్షల ఓట్ల వరకు తెచ్చుకున్నా విజయకాంత్‌ మినహా ఎవరూ గెలవలేదు. 2011 శాసనసభ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు కుదుర్చుకున్న 41 సీట్లకు గాను 29 సీట్లలో విజయం సాధించింది. 2016 ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, వైగో ఎండీఎంకే, వీసీకే పార్టీలతో కలిసి విజయకాంత్ ప్రజాసంక్షేమ ఫ్రంట్ను ఏర్పాటు చేశారు. మొత్తం 104 సీట్లకు పోటీచేసి ఒక్కసీటును కూడా గెలవలేకపోయారు.

శివాజీ గణేషన్ మొదలు శరత్‌కుమార్, టి.రాజేందర్ వరకు...
తమిళనాడులో తాను నటించిన సినిమాలతో  సొంత ఇమేజీని సాధించిన శివాజీ గణేషన్ మొదట్లో కొంతకాలం డీఎంకే సానుభూతిపరుడిగా ఉన్నారు. తిరుపతికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడంపై ఆ పార్టీలో తీవ్ర విమర్శలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. (సాక్షి ప్రత్యేకం) ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్‌కు మద్దతునిచ్చారు. ఇందిరాగాంధీ హయాంలో ఆయనను రాజ్యసభకు పంపించారు. ఇందిర మరణం తర్వాత 1987లో తమిజగ మున్నట్ర మున్నాని పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 1989లో జనతాదళ్ తమిళనాడు విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సినీ హీరోగా ఎన్నో విజయాలను అందుకున్న ఆయన రాజకీయరంగంలో మాత్రం అనుకున్న ఫలితాలను సాధించలేకపోయారు. ఆ రాష్ట్రంలో నటుడిగా పేరు తెచ్చుకున్న శరత్‌కుమార్ 1996లో డీఎంకేలో చేరి 1998 లోక్‌సభ ఎన్నికల్లో స్వల్పతేడాతో ఓడారు. 2001లో ఆ పార్టీ తరఫునే రాజ్యసభ సభ్యుడయ్యారు. 2006లోనే పార్టీకి, రాజ్యసభకు రాజీనామా చేసి తన భార్య, సినీనటి రాధికతో కలిసి ఏఐఏడీఎంకేలో చేరారు. అదే ఏడాది ఏఐడీఎంకే నుంచి బయటికొచ్చి 2007లో ఆల్ఇండియా సమతువ మక్కల్ కచ్చి పార్టీని స్థాపించారు. 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏఐఏడీఎంకే కూటమిలో చేరి అసెంబ్లీకి ఎన్నికై, 2016 ఎన్నికల్లో  ఓటమి పాలయ్యారు. (సాక్షి ప్రత్యేకం) దర్శక నిర్మాత, నటుడు టి.రాజేందర్ 1996లో డీఎంకే టికెట్పై పార్క్టౌన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. డీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యాక 2004లో సొంతంగా ఆల్ ఇండియా లచ్ఛియా ద్రవిమున్నట్ర కజగం పార్టీ ఏర్పాటు చేశారు. 2006 ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు మద్దతు ప్రకటించారు.

కమల్ హాసన్ నిర్ణయమెప్పుడో?
దాదాపు మూడునెలల క్రితం‘నేను రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను. తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను’ అని ప్రముఖ సినీనటుడు కమల్హాసన్ తన రాజకీయ లక్ష్యాన్ని ప్రకటించారు. అయితే వందరోజుల్లో ఎన్నికలు జరిగితే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టేనంటూ కొంత సందిగ్ధతకు కూడా అవకాశమిచ్చారు. (సాక్షి ప్రత్యేకం)  ప్రసుతమున్న ఏ రాజకీయపార్టీలోనూ చేరబోవడం లేదని, తానే సొంతంగా మరో పార్టీని ప్రారంభించబోతున్నట్టుగా సంకేతాలిచ్చారు. రాజకీయరంగ ప్రవేశం గురించి కొన్నేళ్ల తర్జనభర్జన తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించారు.

--  సాక్షి నాలెడ్జ్ సెంటర్

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top