కుటుంబ పెత్తనమా? ప్రజాస్వామ్య ప్రభుత్వమా?

Sakshi special interview with revanth reddy

ప్రజలు ఆలోచించాల్సిన తరుణమిది!

ఇప్పుడు తీసుకునే నిర్ణయమే.. రాబోయే వందేళ్లకు పునాది

బకాసురుడి వంటి కేసీఆర్‌ను రాజకీయంగా వధించాలి

ఆయనొక్కడి ఉద్యోగం ఊడితే.. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలు

కేసీఆర్‌కు కాంగ్రెస్‌ అంటే భయం.. నాపేరు వింటే అరికాళ్లలో మంట

బీజేపీ, మజ్లిస్‌లు టీఆర్‌ఎస్‌ చీఫ్‌కు రెండు కళ్లు

ఫలితాలొచ్చాక 500 కేసులు పడితే మళ్లీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడా?

పార్టీలో నాకు మంచి గౌరవమే ఉంది.. చేరిన 9 నెలల్లోనే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి

సీఎం సీటుపై ఆత్రుత లేదు.. వయసు, ఓపిక ఉన్నాయి

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలు కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమయిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ సాధించుకున్న ప్రజానీకం ఇప్పుడు తీసుకునే నిర్ణయమే రాబోయే 100ఏళ్లకు పునాది అవుతుందని ఆయన అన్నారు. రాచరికం వైపు వెళ్లేందుకు కుటుంబ పాలన, పెత్తందారీతనానికి ఆమోదం తెలపాలో.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తీర్పునివ్వాలో.. ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ధర్మగంట మోగాలంటే కాంగ్రెస్‌ పార్టీనే గెలిపించాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణే కోసమే.. కాంగ్రెస్‌లో చేరానన్నారు. సీఎం పదవిపై తనకు ఆత్రుత లేదన్న రేవంత్‌.. ఆ పదవిని చేపట్టేందుకు తనకింకా సమయం ఉందన్నారు. కేసీఆర్‌కు తనపేరు వింటేనే.. అరికాలి మంట నెత్తికెక్కుతుందని ఆరోపించారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలివి..

సాక్షి: పదవులు, అధికారం కోసమే టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి మారారా?
రేవంత్‌: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రాంతంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. గత ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ 40% ఓట్లు సాధించింది. 60% ఓట్లు అన్ని పార్టీల మధ్య చీలిపోయాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల ప్రకారం రాష్ట్రంలో కాస్తయినా మార్పు వస్తుందేమోనని మూడేళ్లపాటు గమనించాను. ఉద్యమ ఆకాంక్షలు, ఎన్నికల హామీల దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ తరుణంలో ప్రజానుకూల ప్రభుత్వం ఏర్పడాలంటే కేసీఆర్‌ కంటే ఎక్కువ మద్దతున్న పార్టీకి మరింత మద్దతు కూడగట్టాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ప్రజాసమస్యల గురించి తెలిసిన పార్టీగా కాంగ్రెస్‌ ఇందుకు సరైన వేదిక అనుకున్నాను.

టీడీపీలో ఉండగా మీకు ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్‌లో మీకున్న గుర్తింపు ఏంటి?
కాంగ్రెస్‌ జాతీయ పార్టీ. 55ఏళ్లు కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. నేను పార్టీలో చేరిన 9 నెలల్లోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు అప్పగించారు. ఏ కార్యక్రమమైనా నాకెలాంటి ప్రాధాన్యం ఇస్తున్నారో మీరే చూస్తున్నారు. రాహుల్‌గాంధీ పాల్గొన్న సరూర్‌నగర్‌ సభలో మాట్లాడే అవకాశమిచ్చారు. ఇది చాలదా?

ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి ఆశించి.. భంగపడ్డారనే వార్తలపై..
పార్టీకి మన గురించి కొన్ని ఆలోచనలుంటాయి. నాయకుల సామర్థ్యాన్ని బట్టి కొన్ని అంశాలను ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లగలరనే అంచనా ఉంటుంది. ప్రచార కమిటీ చైర్మన్‌ పదవికి వీహెచ్, మధుయాష్కీ, భట్టి విక్రమార్కలతోపాటు నా పేరు కూడా చర్చకు వచ్చింది. వివిధ సమీకరణల తర్వాత ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో అధిష్టానం నిర్ణయించింది. ఇందులో నేను పెద్దగా ఆశించి.. నిరాశ చెందిందేమీ లేదు.

కాంగ్రెస్‌ పార్టీలో 10 మంది సీఎంలున్నారనే విమర్శ ఉంది. మీరు కూడా రేసులో ఉన్నారా?
అదే.. కాంగ్రెస్‌ పార్టీ గొప్పదనం. 10 మంది నేతలు సీఎం స్థానాన్ని ఆశించే స్వేచ్ఛ ఉందంటే.. పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నట్లు. ప్రతిసారీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప నేతలు పార్టీలో ఉండాలని లేదు. అయినా, నా 10 నెలల ప్రస్థానంతో.. అలాంటి పదవులు ఆశించడం సరైంది కాదు. ఎవరిని, ఎప్పుడు, ఏ హోదాలో ఉపయోగించుకోవాలో అధిష్టానానికి బాగా తెలుసు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు?
మేనిఫెస్టో చాలా కీలకం. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. కేసీఆర్‌ కూడా ఆయన రాజకీయ, ఉద్యమ అనుభవాలతో 2014 మేనిఫెస్టో రూపొందించారు. రాంగోపాల్‌ వర్మ అప్పట్లో తీసిన శివ సినిమా లాంటి ప్రయోగమది. శివ హిట్టయినా.. తర్వాత ఆర్జీవీ పెద్దగా సక్సెస్‌ కాలేదు. కేసీఆర్‌ కూడా అంతే. 2014 తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనలు ప్రజలకు ఉపయోగపడలేదు. కుటుంబ కథా చిత్రాలు తీయగల సత్తా ఉన్న కె.విశ్వనాథ్‌ లాంటిది కాంగ్రెస్‌.

వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి ‘సంక్షేమ’నాయకుడిని అందించింది. తెలంగాణ మిగులు బడ్జెట్‌ ఉన్న ధనిక రాష్ట్రం ఎలా అయింది? అంతకుముందు కాంగ్రెస్‌ పదేళ్లపాటు కష్టపడి పనిచేయకపోతే ఇదేలా సాధ్యమైంది? రూ.2లక్షల ఏకకాల రైతురుణ మాఫీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5లక్షలు, పింఛను పెంపు లాంటి మా వాగ్దానాలతో కేసీఆర్‌లో వణుకు పుడుతోంది. రాష్ట్రంలో ఒక్క కేసీఆర్‌ ఉద్యోగం ఊడితే.. 100 రోజుల్లో లక్ష ఉద్యోగాలొస్తాయి.

మీ పార్టీ అభ్యర్థుల జాబితా ఖరారులో ఆలస్యమెందుకు?
సహజంగా అభ్యర్థులను ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతే ప్రకటిస్తారు. అప్పుడు కూడా నిర్ణయం తీసుకోలేకపోతే ఆలస్యం అనొచ్చు. కేసీఆర్‌కు ఏది ఎప్పుడు చేయాలో తెలియదు. కేసీఆర్‌ అనే కోయిల ముందే కూసింది. నేను కూసినప్పుడే ఊరికి తెల్లారింది అనుకునే కోడిని ఏం చేస్తారో తెలుసు కదా. కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరకడం లేదని స్వయంగా హోంమంత్రి చెప్పారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మా పార్టీ పొత్తుల ప్రక్రియలో ఉంది. అందరితో సంప్రదించాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. మాది వ్యూహాత్మకమే కానీ ఆలస్యం కాదు.

నాలుగు సీట్ల కోసం టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా? అడిగితే నేనే ఇచ్చేవాడిని కదా అని కేసీఆర్‌ అంటున్నారు కదా?
కేసీఆర్‌ నియంత పోకడలకు నిదర్శనమిదే. దాన్ని బలుపు, కండకావరం అని కూడా అనొచ్చు. ప్రజాస్వామ్యంపై అవగాహనలేని విమర్శలివి. 2004లో కాంగ్రెస్‌తో, 2009లో టీడీపీతో, తెలంగాణ బద్ద వ్యతిరేకి అయిన సీపీఎంతో పొత్తు పెట్టుకున్న చరిత్ర కేసీఆర్‌దే కదా. ఆయన వ్యాఖ్యలు అహంకారంతో కూడిన అసహనాన్ని, ఓటమి భయాన్ని, కేసీఆర్‌ అధమ స్థాయిని సూచిస్తున్నాయి.

బీజేపీ, ఎంఐఎం పార్టీల పాత్ర, సీపీఎం మీతో కలిసి రాకపోవడంపై..  
బీజేపీ, ఎంఐఎంలు కేసీఆర్‌కు రెండు కళ్ల లాంటివి. ప్రజల సమస్యలను ప్రస్తావించడంపైనే సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ల ప్రభావం ఉంటుంది. ఎన్నికల్లో ఈ పార్టీ ప్రభావం నామమాత్రమే.

ఎన్నికలకు భయపడే మీరు కోర్టుల్లో కేసులు వేస్తున్నారా?
కేసీఆర్‌ వితండ, మూర్ఖపు వాదనలకు ఇదో ఉదాహరణ. కోర్టులు రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైనవి. విధానపరమైన లోపాలను సవరించి ఎన్నికలను నిర్వ హించాలని కొందరు కోర్టుకెళ్లారు. ఈసారి అవకాశం దక్కకపోతే.. 17లక్షల మంది కొత్త ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు మరో ఐదేళ్లు ఆగాల్సి వస్తుంది. అందుకే న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో గెలిచాక 500 కేసులు వేస్తే మళ్లీ అసెంబ్లీని రద్దుచేస్తాడా?

మిమ్మల్ని జైల్లో పెట్టేందుకే.. ఇటీవల ఐటీ దాడులు జరిగాయని అనుకుంటున్నారా?
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై ఎవరూ గొంతెత్త వద్దన్నదే.. కేసీఆర్‌ ఆలోచనగా స్పష్టంగా కనబడుతోంది. చురుకుగా ఉన్న నన్ను చూస్తే ఆయనకు అరికాలి మంట నెత్తికెక్కుతుంది. నన్ను చాలా ద్వేషిస్తున్నాడు. రేవంత్‌ను మూసేస్తే విలాసవంతంగా ఉండొచ్చన్నది తండ్రీకొడుకుల ఆలోచన. చరిత్రలో ఇలా అనుకున్న చాలా మంది సంగతేమైందో మరవద్దు. రాంజీ గోండు, కొమురం భీం, చాకలి ఐలమ్మ, సర్వాయి పాపన్న గౌడ్, దొడ్డి కొమురయ్య, స్వతంత్ర దేశంలో బెల్లి లలిత.. ఇలాంటి వారంతా రాచరికం మీద పోరాటం చేశారు. వీరి అడ్డు తొలగించుకోగలిగారు. కానీ, శాశ్వతంగా ప్రజల హృదయాల్లోంచి తొలగించగలిగారా? ఆ కోణంలోనే నాపై ఐటీ దాడులు చేయిస్తున్నారు.

ఈ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ పాలనకు రెఫరెండం అని కేటీఆర్‌ అనడంపై..
మాటలు నేర్చిన కుక్క.. ఉస్కో అంటే డిస్కో అన్నదట. ఏ ఎన్నికలయినా ఏలుబడిలో ఉన్న పార్టీకి రెఫరెండమే. వెర్రి కాకపోతే ‘మా పాలనకు రెఫరెండం’అని అనడమేంటి? రాజకీయాలు, పరిపాలనలో ఓనమాలు తెలియకుండా, అనుకోకుండా తండ్రి వల్ల మంత్రి పదవి అప్పనంగా వస్తే ఇలానే ఉంటుంది. ఈ ఎన్నికలు అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలుగా మా పనితీరుకు కూడా రెఫరెండమే.

టీఆర్‌ఎస్‌కు 100 సీట్లు ఖాయమంటున్నారు కదా?
వాళ్ల బొందేం కాదా? గెలిచినోళ్లు, ఫిరాయించినోళ్లు, అమ్ముడుపోయినోళ్లు.. అందరూ కలిసి ఇప్పుడే దగ్గరదగ్గర 100 మంది దాకా ఉన్నారు కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు రద్దు చేసుకున్నారు? మళ్లీ 100 సీట్ల కోసం ఎందుకు పోతున్నారు?

కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలని అడిగితే మీరేం చెబుతారు?
రావణాసురుడు, బకాసురులను ఎందుకు వధించాల్సి వచ్చింది? తెలివితేటల్లో రావ ణాసురుడిని అపరబ్రహ్మ అంటా రు. కానీ ఆయన తప్పు చేశాడు కాబట్టి నరులు, వానరులు కలిసి మట్టుబెట్టారు. కేసీఆర్‌ కూడా రావణాసురుడు, బకాసురుడు లాంటివాడే. గత నాలుగేళ్లలో రూ.6.75 లక్షల కోట్లు ఖర్చు చేసి ఒక్క గ్రామానికయినా నీళ్లిచ్చారా? రూ.2లక్షల కోట్లు అప్పు తెచ్చి రాష్ట్రానికి ఏం చేశారు? ఈ లెక్కలు ప్రజలకు చెప్పాలి.

సీఎంగా కేసీఆర్‌ పనితీరుపై  మీ అభిప్రాయం?
అద్భుతమైన అబద్ధాలతో, తెలంగాణ యాస, భాషలతో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెట్టాడు. నిజంగా కేసీఆర్‌కు అంత సమర్థత లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పట్నుంచే ఆయన బద్ధకస్తుడు. కేంద్ర మంత్రిగా కూడా ఏనాడూ పార్లమెంటుకు వెళ్లలేదు. అధికారులతో సమీక్ష జరిపిన దాఖలాలూ తక్కువే. తాను బాధ్యతలు చేపట్టిన శాఖలో ఒక్క సత్ఫలితమైనా తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్‌కు లేదు. సీఎం అయ్యాక కూడా.. విశ్రాంతే తీసుకుంటున్నాడు. కేసీఆర్‌ రాష్ట్రానికి చాలా ప్రమాదకరంగా తయారయ్యాడు.

చివరిగా... ఈ రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
ఎన్నో చారిత్రక ఉద్యమాలకు పుట్టినిల్లయిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్క నిమిషం ఆలోచించాలి. భవిష్యత్తులో తెలంగాణ ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన కీలకమైన సందర్భమిది. నేడు వారు తీసుకునే నిర్ణయం రాబోయే వందేళ్లకు పునాది. బాధ్యతారాహిత్యంగా ఉన్న వ్యక్తి చేతికి మరోసారి పాలన పగ్గాలు ఇవ్వాలా? ప్రజాస్వామ్య ప్రభుత్వమా? అని తేల్చుకోవాలి. 1956–2014 వరకు రాష్ట్రంలో రూ.69 వేల కోట్లు అప్పుచేస్తే.. నాలుగేళ్లలో కేసీఆర్‌ రూ.2లక్షల కోట్ల అప్పు చేశాడనే విషయాన్ని మరిచిపోవద్దు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top