తాయిలాలతో మభ్య పెట్టాలని చూస్తున్నారు : సజ్జల

Sajjala Ramakrishna Reddy Slams CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలు దగ్గర పడేకొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాస్తవ విషయాలు వెలుగులోకి రాకుండా, ఆయన చేసిన దుర్మార్గాలపైన చర్చ జరగకుండా ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లుగా ప్రజలను ఇబ్బంది పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఆఫర్లు ఇస్తూ తాయిలాలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇన్నాళ్లు ప్రజలను పట్టించుకోని వ్యక్తి  ఇప్పుడు వారి బలహీనతలపై కొడుతూ.. ఓటర్లను ఊహ లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతల డ్రామాలను ప్రజలను నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు డబ్బులు పంచి ఓట్లు కొనాలని చూస్తున్నారని.. 8వ తేదీలోపు అందరికి డబ్బు చేరాలని ప్లానింగ్ చేశారని ఆరోపించారు. ప్రభుత్వమే ఇలా బరితెగింపు చర్యలకు పాల్పడితే ఈసీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. 

అది టీడీపీ నేతల డ్రామాలు
టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడుల విషయంలో అనుమానాలు ఉన్నాయని సజ్జల అన్నారు. అది టీడీపీ నేతల డ్రామాలా అనిపిస్తోందన్నారు. వాళ్ళను వాళ్ళు హీరోలుగా చిత్రీకరించుకుంటున్నారని విమర్శించారు. వీళ్ళ డ్రామాలకు కేంద్రం రియాక్ట్ కాకపోవడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. బీజేపీ, చంద్రబాబు మధ్య సంబంధం ఇంకా కొనసాగుతుందని, వీరి బంధం ఈ మధ్య ఇంకా పటిష్టం అయిందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు రకరకాల కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేఏ పాల్  పార్టీకి వైస్సార్ కాంగ్రెస్‌ను పోలిన గుర్తు, కండువా, ఓకే పేరుతో అభ్యర్థులు ఇవన్నీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వ్యవస్థను ఏమార్చగల వ్యక్తి చంద్రబాబు అని, ఆయనకు సహకరించేది కేంద్రంలోని పెద్దలని ఆరోపించారు. టీడీపీ నేతల డ్రామాలు నమ్మొద్దని, చంద్రబాబు దరిద్రపు పాలనకు ఏప్రిల్ 11 న ఓటుతో బుద్ది చెప్పాలని ప్రజలను కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top