చంద్రబాబు డ్రామాలకు పరాకాష్ట

Sajjala Ramakrishna Reddy Criticize Chandrababu - Sakshi

రాష్ట్ర ప్రజలకు బాబు క్షమాపణలు చెప్పాలి

జగన్‌ బాటలో నడుస్తానని ఒప్పుకోవాలి

సీఎం అవినీతిపై కేంద్రం ఎందుకు విచారణ జరపదు?

అధికారంలోకి వచ్చేది వైయస్సార్‌సీపీనే

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

సాక్షి, అమరావతి: ఢిల్లీ దీక్ష చంద్రబాబు డ్రామాలకు పరాకాష్ట అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు సంజాయిషీ చెప్పాల్సిన వాళ్లు ప్రశ్నలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను నాలుగున్నరేళ్లపాటు వదిలేసినందుకు క్షమాపణ చెప్పాల్సిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ ఖర్చుతో ధర్మపోరాట దీక్షలు చేయడమేమిటని నిలదీశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు అనలేదా? అని నిలదీశారు. ప్యాకేజి ప్రకటించినందుకు కేంద్ర మంత్రులను ఘనంగా సన్మానించింది ప్రజలు మరిచిపోయారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ హోదా కోసం డిమాండు చేయకపోతే పుట్టి మునుగుతుందని తెలిసి చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దీక్ష పెద్ద డ్రామా..
ఢిల్లీలో చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పెద్ద డ్రామా అని సజ్జల మండిపడ్డారు. బాబు డ్రామాలకు ఇది పరాకాష్ట అని, ఈ నాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గతంలో టీడీపీకి చీకటి మిత్రులుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు బాహాటంగా కలుసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రజా పోరాటాలు చేసే ఏ రాజకీయ పార్టీ అయినా తమ కార్యక్రమాలకు ఆర్థిక వనరులను సేకరించుకుంటుందని, చంద్రబాబు మాత్ర తన పోరాట దీక్షలకు ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారన్నారు. ఢిల్లీ దీక్షకు రూ.10 కోట్లు వెచ్చించి ఈవెంట్‌ మేనేజ్‌మెంటుగా నిర్వహించారని విమర్శించారు. తన స్వార్థ ప్రయోజనాలకు కోట్లకు కోట్లు ప్రజాధనం ఖర్చు పెడుతూ చిన్న ఉద్యోగులకు వేతనాలు సరిగా చెల్లించడం లేదన్నారు.  

వాళ్లు ముగ్గురూ సంజాయిషీ ఇవ్వాలి...
2014 ఎన్నికల హామీలు ఐదేళ్లు కావస్తున్నా పూర్తిచేయనందుకు బీజేపీ, టీడీపీ, జనసేన ముందుగా సంజాయిషీ ఇవ్వాలని సజ్జల డిమాండ్‌ చేశారు. హోదా ఇస్తామని మోదీ హామీ ఇవ్వగా, దాని అమలు పూచి తనది అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారని గుర్తు చేశారు. ఆరోజు ముగ్గురూ ఉన్న వేదికపై చెప్పిన ఈ మాటలకు వారంతా సమష్టిగా బాధ్యులేనన్నారు. ఇన్నాళ్లూ హామీలు అమలు చేయకుండా ఈ ముగ్గురు గాడిదలు కాస్తున్నారా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రత్యేక హోదా వల్ల ఏ రాష్ట్రమైనా బాగుపడిందా? అని గతంలో ప్రశ్నించిన చంద్రబాబు కేంద్రం ప్యాకేజీ ప్రకటించినందుకు అసెంబ్లీలో అభినందన తీర్మానం చేసిన విషయం మరిచారా? అని ప్రశ్నించారు. ఇంత చేసిన పెద్ద మనిషి వైఎస్సార్‌సీపీ ఆందోళనతో ఎన్నికల్లో పుట్టిపునుగుతుందని భయపడి యూటర్న్‌ తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్యాకేజికి ఒప్పు కోవడం తప్పేనని ముందుగా ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ బాటలో నడుస్తానని ఒప్పుకోవాలని సజ్జల డిమాండ్‌ చేశారు. బీజేపీ, టీడీపీ దొందూ దొందే అని, ఈ రెండు పార్టీల నేతల తీరు చూస్తుంటే ప్రజలను మోసం చేస్తున్నారని భావించాల్సి వస్తోందని ఆయన విమర్శించారు.   

బాబు అక్రమాలపై విచారణ జరపరే? 
గుంటూరు సభలో ప్రధాని ప్రసంగం విన్న తర్వాత చంద్రబాబు, మోదీ ఇద్దరూ మాట్లాడుకునే డ్రామా ఆడుతున్నట్టుగా ఉందని సజ్జల దుయ్యబట్టారు. హోదా ప్రస్తావనే లేకుండా ప్రధాని ఏపీలో ఎలా మాట్లాడతారు? అని ప్రశ్నించారు. పోలవరం నుంచి అమరావతి దాకా అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రధాని గుంటూరు సభలో ప్రస్తావించారన్నారు. అందులోనూ కేంద్రం ఇచ్చిన నిధుల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారన్నారు. మరి విచారణకు ఎందుకు ఆదేశించడంలేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు ముందు వెనుకా చూడకుండా చేస్తున్న అప్పులపై కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదు? అని నిలదీశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top