దింపుడు కళ్లం ఆశతోనే చంద్రబాబు జిమ్మిక్కులు

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజం

మోసపూరిత హామీలపై చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపు

నాలుగున్నరేళ్లలో ఒక్క కొత్త పథకమూ అమలు చేయలేదు

అభివృద్ధి చంద్రబాబు కుటుంబం, బినామీల ఆస్తుల్లోనే!

రాజధాని వెల్‌కమ్‌ గ్యాలరీకి రూ.44 కోట్లు ఖర్చా?

వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం మొదలైన వెంటనే కొత్త నాటకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెరతీశారని, ప్రజలను మభ్య పెట్టేందుకు ఆయన వరాలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయి కనుక ప్రకటనలు, జీవోలు విడుదల చేస్తూ.. పింఛన్ల పెంపుదల అంటూ హామీలిస్తున్నారన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇచ్చిన హామీలనే అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ప్రతి ఇంటికీ నిరుద్యోగభృతి అని ప్రచారం చేసి.. కేవలం 3 లక్షల మందిని మాత్రమే గుర్తించారన్నారు. నిన్నటికి నిన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు 2,700 ఉంటే 3 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. వందల ఖాళీలున్నా.. వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయని, దీన్నిబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోందన్నారు. ఎన్నికలకు రెండు నెలల ముందు ఇలాంటి కంటితుడుపు చర్యలు చేపడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. పింఛన్లు రూ.2 వేలు అని, తొమ్మిది గంటల కరెంటు ఇస్తున్నామని ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ప్రకటించారని తాను ఏదో చేసేస్తున్నానని డాబు ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ ప్లీనరీలో నవరత్నాలు ప్రకటించినప్పుడు అయినా.. పాదయాత్ర బహిరంగ సభల్లో గుర్తు చేసినప్పుడైనా వాగ్దానాలు అమలు చేయాల్సిందని, అప్పటి నుంచీ స్పందించకుండా ఇపుడు హడావుడిగా చేస్తున్నారన్నారు. బాబు నాటకాలు వేస్తున్నారని ప్రజలు బహిరంగంగా అంటున్నారన్నారు. రాష్ట్రం దివాళాతీసే పరిస్థితుల్లో ఉన్నా రేపు ఎలాగోలా అధికారంలోకి రావాలనే దింపుడుకళ్లం ఆశతో బాబు ఇవన్నీ చేస్తున్నారన్నారు. 

రూ.కోట్లు ఖర్చు: పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలేసి అమరావతికి వెళ్లిన తర్వాత కూడా హైదరాబాద్‌లో సీఎం కార్యాలయాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టారని, చంద్రబాబు చర్యల వల్ల ఉద్యోగుల కుటుంబాలకు వేల కోట్ల నష్టం కలిగిందన్నారు. ఏపీ ఖజానాలో ప్రస్తుతం జీతాలు చెల్లించటానికి నిధులు లేక రూ.7 వేల కోట్ల రుణం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. ఖజానా అంతా ఊడ్చేసి ఖర్చు చేసిన నిధులన్నీ ఎక్కడకు వెళ్లాయని సజ్జల ప్రశ్నించారు. చివరి విడత, మూడో విడత రుణమాఫీ కోసం కూడా రుణాలు తెస్తామని చెబుతున్నారని, ఇంత వరకు చెల్లించలేదన్నారు. నాలుగున్నరేళ్లలో ఒక్క కొత్త పథకమూ అమలు చేయలేదన్నారు. చంద్రబాబు రుణమాఫీ మోసానికి రైతులు రూ.43 వేల కోట్ల మేర నష్టపోయారన్నారు. లక్ష కోట్లకు పైగా అప్పులు తెచ్చారని, ఇన్ని అప్పులు ఎందుకు చేశారు. ఏయే ఆస్తులు కొత్తగా వచ్చాయి? ఆదాయం, ఖర్చులపై శ్వేతపత్రాలు ఇవ్వాలని, ప్రజలకు సంజాయిషీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

బినామీల ఆస్తుల్లోనే అభివృద్ధి: అభివృద్ధి చంద్రబాబు కుటుంబ ఆస్తుల్లో, తన బినామీలు, ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీల్లో కనిపిస్తోందన్నారు. రాజధానిలో వెల్‌కమ్‌ గ్యాలరీ పేరుతో సెట్టింగులు రూ.44 కోట్లతో పెడుతున్నారన్నారు. పది ధర్మపోరాట దీక్షల్లో ఒక్కొక్కదానికి రూ.3 కోట్ల చొప్పున రూ.30 కోట్లు వృధా చేశారన్నారు. సింగపూర్‌కు విమానం ఏర్పాటు చేసినందుకు ఇండిగో కంపెనీకి రూ.10 కోట్లు, జ్ఞానభేరీకి రూ.3 కోట్లు చెల్లించారన్నారు. థ్యాంక్స్‌ సీఎం సర్‌ అంటూ.. ప్రమోషన్‌ పేరిట కోట్లు తగలేశారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించినట్లయితే మంచి జరిగేదన్నారు. రాజధానిని గొప్పగా నిర్మిస్తున్నానని చెబుతున్న బాబు మాటల్లో నిజమెంతో విజయవాడలో మొండిగోడలు, పూర్తి కాని ఫ్లైఓవర్లు చెబుతున్నాయన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటాలను చంద్రబాబు రాబట్టలేకపోయారని, 10వ పీఆర్‌సీ బకాయిలనూ ఇవ్వాలనిపించటం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు ప్రజలు డిసైడ్‌ అయ్యారని సజ్జల తెలిపారు.

టీడీపీ కనుసన్నల్లో పనిచేసే పోలీసులపై మాకు నమ్మకం లేదు
ఆంధ్రాలోని పోలీసులందరిపైనా తమకు నమ్మకం లేదని షర్మిల అనలేదని, టీడీపీ కనుసన్నల్లో పనిచేసే పోలీసు అధికారులపై తమకు పూర్తి నమ్మకం లేదని చెబుతున్నామని సజ్జల చెప్పారు. జగన్‌కు భద్రత కల్పించే వారిలో ఏపీ పోలీసులు ఉన్నారన్నారు. ఆంధ్రాలో నిష్పాక్షికంగా వ్యవహరించే వారున్నారని, కానీ టీడీపీ కనుసన్నల్లో వారి ఆజ్ఞలకు లోబడి పని చేసే వారిపై తమకు నమ్మకం లేదన్నారు. తమ వ్యాఖ్యలను తప్పు పడుతున్న పోలీసు అధికారుల సంఘం నేతలు, మరి తాము ఏపీలో సోషల్‌ మీడియాలో వచ్చే అభ్యంతరకర రాతలపై ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు రిజిస్టర్‌ చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసు అధికారుల సంఘం చేత ఎవరైనా అలా మాట్లాడిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఏపీలో కొందరు పోలీసులు ఏకపక్షంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో కూడా పోలీసు అధికారుల సంఘం నేతలు చెప్పాలని హితవు పలికారు. 

చిలక పలుకులు బాబువే..
పవన్‌తో చిలక పలుకులు బాబే పలికిస్తున్నాడని, రేపటి ఎన్నికల్లో పవన్, టీడీపీ కలిసి పోటీ చేస్తారా? లేదా అనే చర్చ పెట్టి అసలు అంశాలను మీడియా తప్పుదోవ పట్టిస్తోందన్నారు. నెలన్నర క్రితం వరకు చంద్రబాబు–మోదీ, వైఎస్‌ జగన్, పవన్‌ అని విమర్శించే వారని, ఈమధ్య మోదీ, జగన్, కేసీఆర్‌ అని చంద్రబాబు మండిపడుతున్నారని పవన్‌ను మినహాయించారని గుర్తుచేశారు. పవన్‌ మాటలు ఆయనవే అని తాము అనుకోవడం లేదని అవన్నీ చంద్రబాబు పలికిస్తున్న చిలుక పలుకులన్నారు. చిరంజీవిలా పవన్‌ సీరియస్‌గా ప్రయత్నించినట్లయితే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top