జనవరి 9.. చరిత్రాత్మకం

Sajjala Ramakrishna Comments On ChandraBabu - Sakshi

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి 

చంద్రబాబు మోసాలపై విస్తృత ప్రజాచైతన్య కార్యక్రమాలు 

ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోతో సమానం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన దారుణమైన మోసాలపై పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి పెద్దఎత్తున ప్రజాచైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ‘నిన్ను నమ్మం బాబూ’ అంటూ పార్టీ నాయకులకు సర్క్యులర్‌ జారీ చేశామని చెప్పారు. ఈ నెల 7వ తేదీ వరకూ అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సంఘీభావ కార్యక్రమాలు నిర్వహిస్తామని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పడుతున్న తపన, చంద్రబాబు మోసాలను వివరిస్తారని పేర్కొన్నారు. ‘నిన్ను నమ్మం బాబూ’ కార్యక్రమం ద్వారా బాబు మోసాలను వివరించి ప్రజలను మరింత చైతన్య పరుస్తారని తెలిపారు. సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో  మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2019 జనవరి 9 ఒక చరిత్రాత్మక రోజుగా నిలిచిపోతుందని చెప్పారు. జగన్‌ ప్రజా సంకల్పయాత్ర ముగింపు రోజును చరిత్రాత్మకమైనదిగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడపడానికి జగన్‌ వస్తున్నారని జనం పూర్తిగా నమ్ముతున్నారని వెల్లడించారు. 

పవన్‌ను బాబు జట్టులో కలుపుకున్నారేమో! 
ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి దేశంలో ఏ నాయకుడూ ఎదుర్కోనన్ని సమస్యలను జగన్‌ ఎదుర్కొన్నారని, చివరకు హత్యాయత్నం నుంచి కూడా బయటపడ్డారని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. గత పదేళ్లలో ఇన్ని సమస్యలు, సంక్షోభాలు ఎదుర్కొన్న నాయకుడు దేశంలో ఎవరూ లేరని వివరించారు. చంద్రబాబు పాలన భరించడం ఇక తమ వల్ల కాదు, జగన్‌కు తోడూ నీడగా ఉంటామమని జనం చెబుతున్నారని తెలిపారు. ‘‘పాదయాత్రలో జగన్‌ ఎన్నడూ, ఎక్కడా మొక్కుబడిగా చేతులు ఊపుకుంటూ వెళ్లలేదు. జనంతో మమేకమై వారు చెప్పింది వింటూ సమస్యలపై వినతిపత్రాలు తీసుకుంటూ, ఆపన్నులకు భరోసా ఇస్తూ సమస్యల పరిష్కారానికి ఏమిచేయాలో మథనం చేస్తూ, ప్రణాళికలు రూపొందిస్తూ మహాయజ్ఞమే సాగిస్తూ వస్తున్నారు. అందువల్లే పాదయాత్రను అనుకున్న దానికంటే ఆరు నెలలకు పైగా పొడిగించాల్సి వచ్చింది. ప్రతి వర్గమూ తమ సమస్యలను జగన్‌కు చెప్పాలని కోరుకుంది. ఆయనకు చెబితే పరిష్కరిస్తారనే భరోసా ఉండటమే ఇందుకు కారణం. అందువల్లే ప్రజాసంకల్పయాత్రను పొడిగించక తప్పలేదు. ఒక దృఢచిత్తం, నిజాయతీ, విశ్వసనీయత గల నాయకుడిపై గురి కుదిరితే ఎలా ఉంటుందో వెల్లువలా వచ్చిన ప్రజా సమూహం ద్వారా తేటతెల్లమైంది. చంద్రబాబు నిద్రలో లేచినా మోదీ, జగన్, కేసీఆర్‌ పేర్లే స్మరిస్తున్నారు. పవన్‌ పేరు గతంలో అనేవారు. పవన్‌ను జట్టులో కలుపుకుంటున్నారేమో! ఇప్పుడు ఆయన పేరును బాబు ఎత్తడం లేదు’’ అని వివరించారు. 

ఇది జగన్‌ నామ సంవత్సరం
2019 జగన్‌ నామ సంవత్సరం అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మన రాష్ట్రానికి జగన్‌ తిరుగులేదని దశ కల్పిస్తారని విశ్వసిస్తున్నామని చెప్పారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలు మేనిఫెస్టోతో సమానమని స్పష్టం చేశారు. ‘‘జగన్‌ ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారు. కొన్ని నియోజకవర్గాల ప్రజలు ఇంకా తమ వద్దకు జగన్‌ రాలేదని, రావాలని కోరుకుంటున్నారు. సమయాభావం వల్ల వెళ్లలేకపోయారు. ఇక బస్సులో వెళతారా? వేరేగా వెళతారా అన్నది ఆలోచిస్తున్నాం’’ అని సజ్జల వివరించారు. టీఆర్‌ఎస్‌ గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ... చంద్రబాబుతో జతకడితే మంచివారు, లేకపోతే చెడ్డవారా? అని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు తప్పిదాలు, మోసాలు, నేరాలు ఎవరి ద్వారా బయటకు వచ్చినా తాము సంతోషిస్తామని అన్నారు.   

తెలుగు ప్రజలకు సుఖసంతోషాలు చేకూరాలి 
తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి కేక్‌ కట్‌ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. 2019 ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే సంవత్సరంగా మిగిలిపోవాలన్నారు. ఈ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ కుటుంబ అభిమానులందరూ ఐకమత్యంతో ముందుకు సాగి ప్రజలు కోరుకుంటున్నట్లు వైఎస్సార్‌ సీపీని ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. పలువురు ప్రముఖులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలసి పుష్పగుచ్ఛాలు అందజేసి  శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు, నాయకులు వాసిరెడ్డి పద్మ, చల్లా మధు, కానుమాను రాజశేఖర్, ఆవుల శ్రీనివాసరెడ్డి, పుత్తా శివశంకర్, సత్యనారాయణ మూర్తి బసిరెడ్డి సిద్ధారెడ్డి, ఇ.రాజశేఖర్, శ్రీవర్దన్‌ రెడ్డి, దేవరకొండ రామభాస్కర్, బుర్రా సురేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top