మెక్కింది కక్కిద్దాం

Sajjala Rama Krishna Reddy Fires On TDP Party - Sakshi

టీడీపీ నేతల దాష్టీకంతోప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది

వారు దోచుకున్నదంతా వడ్డీతో సహా కక్కిద్దాం

ఎన్నికల యుద్ధంలో బూత్‌ లెవల్‌ కమిటీలు సైనికుల్లా పనిచేయాలి

వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని    దెబ్బకొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

ఒంగోలు: పచ్చనేతల దాష్టీకానికి ఇప్పటి వరకు మీతోపాటు సాధారణ ప్రజానీకం సైతం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. మీరు ఉల్టాల పేర్లు నోట్‌చేసి పెట్టుకోండి.. వారు తిన్నదంతా వడ్డీతో సహా కక్కిద్దాం. అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఒంగోలులోని ఎ–1 ఫంక్షన్‌ హాలులో కొండపి, మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల బూత్‌ లెవల్‌ కమిటీలకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ముందుగా శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించగా సజ్జల రామకృష్ణారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్‌ కాంగ్రెష్‌ పార్టీలో విభేదాలున్నాయని, చంద్రబాబు బలం ముందు ఆ పార్టీ నిలువలేదంటూ పచ్చమీడియా కోడైకూస్తోందని, పదిమంది ఒక్కటై ఒకే మాట వల్లిస్తే అదే వేదం అవుతుందని వారి నమ్మకం. ఆ నమ్మకంతోనే వైఎస్సార్‌ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేలా ప్రచారం చేస్తున్నారని సజ్జల ఆరోపించారు. ఈ నేపథ్యంలో పచ్చమీడియా మాటలను తిప్పికొట్టేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంచుకున్న ఏకైక మార్గం బూత్‌లెవల్‌ కన్వీనర్లు, కమిటీలు. కనుక యుద్ధం అనే ఎన్నికల్లో అసలైన సైనికులు మీరే.. యుద్ధంలో మీరు చూపే ధైర్య సాహసాలే 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేందుకు కారణంగా నిలుస్తాయి. అభ్యర్థి ఎవరనే విషయాన్ని పక్కనబెట్టి ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయడం జగన్‌ను సీఎం చేసుకోవడం ఒక్కటే ధ్యేయంగా ఉండాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిలా ఉదారంగా ఉండే ప్రశ్న అయితే లేదు అంటూ బూత్‌లెవల్‌ కన్వీనర్లకు సూచించారు.

బూత్‌ లెవల్‌ కమిటీలే పార్టీకి పునాది..
శిక్షణా తరగతులకు అధ్యక్షత వహించిన మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బూత్‌ లెవల్‌ కమిటీలే ఎన్నికల్లో విజేతలను నిర్ణయిస్తాయని, కనుక పార్టీకి పునాది అయిన మీరు పూర్తిస్థాయి శిక్షణ పొందాల్సిన అవసరాన్ని జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. కనుక బూత్‌ లెవల్‌ కమిటీల బాధ్యత, విధులు ఎలా పనిచేయాలి. ఇవన్నీ ఈ శిక్షణా తరగతులలో నేర్పుతారని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాక్షస పాలన అంతమొందించాలి..
శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలింగ్‌ కమిటీ సభ్యుల విధులు, బాధ్యతలను వివరించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు కలిసి పోటీచేస్తే 5.30లక్షల ఓట్లతో మనం అధికారాన్ని కోల్పోయాం..అదే ప్రతి పోలింగ్‌ బూత్‌ సభ్యుడు రెండు ఓట్లు పెంచినా 8 లక్షల పైచిలుకు ఓట్లు వచ్చి ఉండేవనే విషయాన్ని వివరించారు. గెలుస్తామనే ధీమా ఉంటే సరికాదని, సీఎం స్థాయి అభ్యర్థులు సైతం కేవలం ఒక్క ఓటుతో పరాజయం పాలైన సందర్భాలు ఉన్నాయంటూ పలు ఉదాహరణలను వివరించారు. పోలింగ్‌ బూత్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు ఓటరును పోలింగ్‌బూత్‌ వరకు తీసుకువచ్చి ఓటు వేయించేవరకు కష్టించి పార్టీని గెలిపించేవారు మీరే అంటూ బూత్‌ కన్వీనర్లకు సూచించారు. ప్రతి ఓటు జగన్‌కు వేస్తున్నామని, రాక్షస పాలన అంతమొందించేందుకు వేస్తున్నామని గుర్తుంచుకోవాలని సూచించారు.

కుయుక్తులు ఎదుర్కోవాలి..
బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ వైఎస్సార్‌ కుటుంబం రాష్ట్ర ప్రజల అభివృద్ధి అంకితం అయి ఉందని, చంద్రబాబు ఎన్నికల్లో పన్నే కుయుక్తులను ఎదుర్కొనేందుకు తీవ్రంగా పోరాడక తప్పదని గుర్తుంచుకోవాలన్నారు. 1989లో కేవలం 56 ఓట్ల తేడాతో నేడు ఓడిపోయా...ఓటు విలువ ఏమిటో నాకు స్పష్టంగా తెలుసు.. కనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అధికార పార్టీ ఆగడాలను గుర్తించడం, దొంగ ఓట్లు ఉంటే రద్దుచేయించడం, అర్హులైన వారికి ఓటు హక్కు వచ్చేలా చేయాలంటూ సూచించారు. నాయకులకు, ప్రజలకు, పార్టీకి అనుసంధానం మీరే అంటూ కన్వీనర్లకు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్‌ స్వర్ణయుగం తిరిగి ప్రజలకు అందించాంటే అందుకు జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవడం ఒక్కటే మార్గం అన్న విషయాన్ని ప్రతి ఓటరు గ్రహించేలా చైతన్యపరచాలన్నారు. ఈ సమావేశంలో మార్కాపురం ఎమ్మెల్యేల జంకె వెంకటరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే, వై.పాలెం నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్, ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా మధుసూధన్‌రెడ్డి, కొండపి నియోజకవర్ల సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, బూత్‌లెవల్‌ కన్వీనర్లు, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top