కొత్త కండువాతో కొడంగల్‌కు..

Rrevanth Reddy Joins Congress Party Presence of Rahul Gandhi - Sakshi

రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న రేవంత్‌

ముఖ్య అనుచరులతో పార్టీలో చేరిక..

ఆసక్తిగా గమనించిన జిల్లావాసులు

స్వాగతిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు

ఊహాగానాలకు తెరదించుతూ టీ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాతో కొడంగల్‌కు చేరుకోనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో యువనేత రాహుల్‌గాంధీ సమక్షంలో మంగళవారం ఆయన అనుచరగణంతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దీంతో దశాబ్దకాలంగా పచ్చకండువా (టీడీపీ)తో దర్శనమిచ్చిన రేవంత్‌రెడ్డి.. ఇక కాంగ్రెస్‌ కండువాతో కనిపించనున్నారు. ఒకప్పుడు టీడీపీకి ప్రధాన శత్రువుగా భావించిన కాంగ్రెస్‌పై రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో పోరాటం చేశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్న నానుడిని నిజం చేస్తూ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోయారు.

సాక్షి, వికారాబాద్‌:  ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన పరిణామాలను కొడంగల్‌ నియోజకవర్గ ప్రజలు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా గమనించారు. ఈ పరిణామాల విశేషాలను ఉదయం నుంచే పలు ఛానళ్లు, సోషల్‌మీడియాలో ప్రసారం చేయడం, హల్‌చల్‌ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా.. తమనేత వెంటే ఉంటామంటూ మెజారిటీ టీడీపీ నాయకులు ఇప్పటికే స్పష్టం చేయగా, మిగతా పార్టీల వారు వేచి చూసే ధోరణితో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

స్వాగతిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు
నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి చుక్కాని లేకపోవడంతో రేవంత్‌రెడ్డి రాకను వారు సైతం మెజారిటీగా స్వాగతిస్తున్నారు. ప్రస్తుతానికి కొడంగల్‌ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ పార్టీకి ఇన్‌చార్జిగాని, చెప్పుకోదగిన నాయకుడు గాని లేకపోవడంతో కొన్నేళ్లుగా పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డిదే హవా కొనసాగింది. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి ప్రభావం రోజురోజుకు తగ్గుతుండడంతో రేవంత్‌రెడ్డికి గడచిన రెండు ఎన్నికల్లో ఎదురు లేకుండాపోయింది. దీంతో అక్కడ జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డికి ఇటీవలనే టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించింది. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో పార్టీ నాయకులు, అభిమానులు మెజార్టీగా స్వాగతిస్తున్నారు. అటువంటి మాస్‌లీడర్‌ వస్తే పార్టీ బలోపేతమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top