చందబ్రాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదు: రోజా

Rk Roja Slams Cm Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి చేసిందేమీ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఫైర్‌ అయ్యారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ జరగలేదన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పిన రైతులను అప్పుల ఊబిలోకి నెట్టారని, డ్రాక్వా మహిళలను నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఉన్న అప్పును రెట్టింపు చేశారని తెలిపారు. 90 శాతం హామీలు నెరవేర్చినట్లు టీడీపీ వెబ్‌సైట్స్‌, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాయని, అలా అయితే వెబ్‌సైట్‌లో మ్యానిఫెస్టోను ఎందుకు తీసేశారని ప్రశ్నించారు. మ్యానిఫెస్టో పెట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని, అది పెడితే సొంత పార్టీ నాయకులే ఓట్లేయరని ఎద్దేవా చేశారు.

కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ ..
కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి చంద్రబాబు తీసుకున్నారని, నితిన్‌ గడ్కరీ పర్యటనలో బాబు బండారం బయటపడిందన్నారు. పోలవరాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు దోచుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు కరువుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని, ఎన్నికల్లో సింగిల్‌గా వెళ్లే దమ్ము టీడీపీకి లేదన్నారు. 1999, 2004, 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది టీడీపీనేనని గుర్తు చేశారు. కానీ బీజేపీతో వైఎస్సార్‌ సీపీ కలుస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంపై ఇప్పటికే తమ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతి సభలో స్పష్టం చేశారని పేర్కొన్నారు.

టీడీపీ నేతలు ఏం చేసినా కేసులు ఉండటం లేదు..
‘కరప్షన్‌ ఆఫ్‌ ఎంపరర్‌’ పుస్తకంలో చంద్రబాబు అవినీతి చరిత్ర ఉందని, ఈ పుస్తకాన్ని పార్లమెంట్‌ ప్రతి ఒక్కరికి అందజేశామన్నారు. మీటింగ్‌లు, ట్వీట్‌లు పెట్టడం కాదనీ, దమ్ముంటే సీబీఐ విచారణను ఎదుర్కోవాలని సవాల్‌ విసిరారు. బాబు పబ్లిసిటీ పిచ్చి కోసం సామాన్యులను బలిచేశారని, ఇంత వరకు గోదావరి పుష్కర బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ కార్యాక్రమమని తీసుకెళ్లి కుటుంబాల్లో శోకాన్ని నింపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారని, టీడీపీ నేతలు ఏం చేసినా కేసులు ఉండటం లేదని అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు అ‍న్యాయం జరిగితే న్యాయస్థానాలే ముందకు వచ్చి సుమోటోగా కేసులు నమోదు చేయాలని ఆమె కోరారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top