కిలోకు రూ.2.50 కంటితుడుపే

RK Roja Fires On Chandrababu naidu - Sakshi

ఎమ్మెల్యే రోజా ఫైర్‌

పుత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శించారు. బుధవారం స్థానిక పంచాయతీరాజ్‌ అతిథిగృహంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సొంతజిల్లా మామిడి రైతుల గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వరి, వేరుశనగ, చెరకు, టమాట పండించే రైతులు గిట్టుబాటు ధర లేక పంటలను రోడ్డుపైన పారబోసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది వరి పంట సాగుకు రైతులు ముందుకు రాని పరిస్థితి జిల్లాలో నెలకొందన్నారు. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడిని ఎగుమతే చేసే రైతుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందన్నారు. జిల్లాలోని పల్ప్‌ ఫ్యాక్టరీలు అధికార టీడీపీ నాయకుల ఆధీనంలో ఉండడంతోనే మామిడికి గిట్టుబాటు ధర కల్పిం చడం లేదని ఆమె ఆరోపణలు గుప్పించారు.

రైతులు పూర్తిగా నష్టపోయాక చంద్రబాబునాయుడు తీరిగ్గా కిలోకు రూ.2.50 అదనంగా చెల్లిస్తామని చెప్పడం కేవలం కంటి తుడుపు చర్యగా స్పష్టం చేశారు. తోతాపురి రకానికి టన్నుకు కనీసం రూ.12 వేలు మద్దతు ధర ప్రకటిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుందని ఆమె తేల్చి చెప్పారు. ఇతర పంటలకు గిట్టుబాటు ధర లభించనప్పుడు పంట మార్పిడి చేసుకునే వెసులుబాటు ఉంటుం దని, అదే మామిడి పండించే రైతులకు ఆ అవకాశం ఉండదని ఆమె చెప్పారు. గిట్టుబాటు ధరలేక మామిడి రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జిల్లాకు చెందిన మంత్రి మామిడికి రూ.12 వేలు మద్దతు ధరను ప్రకటించాలని ఆమె డిమాండ్‌ చేశారు. మామిడి రైతుల ఉసురుపోసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పుట్టగతులుండవని ఆ మె ఘాటుగా విమర్శించారు. ఆమె వెంట వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీఎన్‌ ఏలుమలై, రెడ్డివారి భాస్కర్‌రెడ్డి, రవిశేఖర్‌రాజు, డీసీసీడీ డైరెక్టర్‌ దిలీప్‌రెడ్డి, ప్రతాప్, బాబూరావ్‌గౌడ్‌ ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top