సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి

Revath Reddy complaint to EC on KCR - Sakshi

ఈసీకి రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌బీ నగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీకి అంగీకరిస్తే రూ.10 కోట్లు ఎన్నికల ఖర్చుగా ఇస్తానని గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ను శనివారం సచివాలయంలో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాయిని వ్యాఖ్యలను సుమోటోగా పరిగణించి చర్యలు తీసుకోవడం సాధ్యం కాని పక్షంలో తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంపై స్పందించేందుకు సీఈఓ రజత్‌కుమార్‌ నిరాకరించారు. తన భద్రతకు సంబంధించిన విషయంపై మాట్లాడటానికి రేవంత్‌రెడ్డి తనను కలిశారని ఆయన విలేకరులకు తెలిపారు.  

సీఈఓను కలిసిన టీఆర్‌ఎస్‌ నాయకులు 
ఎన్నికల కోడ్‌కు సంబంధించిన వివిధ అంశాల్లో అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి శనివారం సీఈఓ రజత్‌కుమార్‌ను సచివాలయంలో కలిశారు. పత్రికలకు ఎన్నికల ప్రకటనల జారీకి ముందస్తు ఈసీ నుంచి అనుమతి, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల పంపడం, బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్‌లు, ఎన్నికల మేనిఫెస్టో తదితర అంశాల్లో అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి సీఈఓను కలిసినట్లు వినోద్‌ పేర్కొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top