బీరు, బిర్యానీ ఇచ్చినా వెళ్లిపోతారు! : రేవంత్‌

Revanth Reddy Slams CM KCR Over Pre Poll Plans - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పొత్తుల మీద చర్చలు జరిపి కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని పార్టీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవని ఆ పార్టీనేత రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వచ్చినప్పుడే.. భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని.. అయితే సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ సభ పెడితే ఫెయిల్‌ అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆ సభకు 25 లక్షల మంది కాదు కదా, రెండున్నర లక్షల మంది కూడా రారని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ సభ లాగానే.. మీరు బీరు, బిర్యానీ ఇచ్చినా జనం వెళ్లిపోతారని.. టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు నివేదిక ఇచ్చారని ప్రస్తావించారు. కేసీఆర్‌ సెప్టెంబర్‌ 2న సభ పెట్టలేడని పునరుద్ఘాటించారు.

‘ఆగస్ట్‌ 15 తేదీలోగా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అన్నారు ఏమైంది. 2017 డిసెంబర్‌ నాటికే ఇంటింటికి నీళ్లు ఇస్తాం. లేదంటే ఓట్లు అడగం అని టీఆర్‌ఎస్‌ నేతలు అన్నారు. అయితే 2018 డిసెంబర్‌ వరకు కూడా నీళ్లు ఇవ్వలేరు. ఇది నా చాలెంజ్‌. పాతిక వేల కోట్లు దోచుకోవడానికి ఉన్న అవకాశాన్ని 40 వేల కోట్లకు పెంచేశారు. కొత్త పాస్‌ పుస్తకాల పేరుతో రైతుల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు. కేబినెట్‌ మీటింగ్‌ తర్వాత సెప్టెంబర్‌ 2 సభ వాయిదాను ప్రకటిస్తారు. సొంత పార్టీలో తిరుగుబాటు మీద నుంచి దృష్టి మరల్చడానికి ముందస్తు ఎన్నికలు అని చర్చ మొదలుపెట్టాడు. అయితే జనవరి 1వరకు కొత్త ఓటర్ల లిస్ట్‌ ఇవ్వమని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సంఘానికి లేఖ రాసింది. 

నీకు ఇప్పటికే 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి తోడు మజ్లిస్‌కు 7 సీట్లున్నాయి. సిట్టింగ్‌లు అందరికీ టికెట్లు ఇస్తా అన్న కేసీఆర్‌ ఇప్పుడు ఇంకా ఎవరికి టికెట్లు ప్రకటిస్తారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీతో జట్టు కట్టడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. వన్‌ నేషన్‌ వన్‌ ఎలెక్షన్‌ అంటున్న మోదీ.. సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఎందుకు సహకరిస్తున్నారో తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. అంటే మొత్తం పన్నాగంలో కేసీఆర్‌, మోదీ ఆడుతున్న నాటకమే ఇది. దేశం శ్రేయస్సు కోరుకుంటే పార్లమెంట్‌, అసెంబ్లీ రెండింటికి ముందస్తు ఎన్నికలు పెట్టండి. అయితే ముందస్తుతో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కేసీఆర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఆర్డర్‌ను రాష్ట్ర అధికారులు పాటించాలని’ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top