చంద్రబాబు వచ్చాకే నిర్ణయం

revanth reddy on party change

పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు   

టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి  

కొడంగల్‌/కోస్గి: విదేశాల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాగానే ఆయనను కలసి, తెలంగాణలో టీడీపీ తీసుకునే భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చిస్తానని, తరువాతే తన నిర్ణయం ఉంటుందని టీ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో, మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

కొన్ని మీడియా సంస్థలు తన ప్రమేయం లేకుండా విష ప్రచారానికి ఒడిగట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రేకింగ్‌లు వేస్తూ తమ జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని, తప్పుడు ప్రచారం చేస్తూ తన మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చిన వార్తలను బేషరతుగా ఖండిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాణం ఉన్నంత వరకు కొడంగల్‌ నుంచే పోటీ చేస్తానని రేవంత్‌ ప్రకటించారు. కొడంగల్‌ ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు.

తన అధిష్టానం అమరావతిలో ఉందని.. ఢిల్లీలో లేదన్నారు. ఈనెల 26న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని, అసెంబ్లీలో తాము మాట్లాడే విషయాలను చర్చిస్తామన్నారు. కేసీఆర్‌ బలం, ఆయన భజనపరులు ఓ వైపు ఉంటే తాను మరోవైపు ఉన్నానని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పెద్దలు తనకు మంత్రి పదవితో పాటు కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని ఆశ చూపినా లొంగలేదన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టినా భయపడలేదని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top