కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి

Revanth reddy lashes out at telangana cm kcr - Sakshi

కేసీఆర్‌ ఓ బురిడీ బాబా: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి అప్పుల కుప్పగా మార్చారని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మాయమాటలతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ బురిడీ బాబాలా తయారయ్యారని ఎద్దేవా చేశారు. మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ మహేంద్రహిల్స్‌లోని ఆయన నివాసం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు.

మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్‌రెడ్డిని పలువురు సీనియర్‌ కార్యకర్తలు పరిచయం చేసుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 40 నెలలు గడిచినా తెలంగాణను అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. మరో 15 నెలల్లో ఏమి సాధించగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఎందరో త్యాగమూర్తుల ప్రతిఫలంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిందన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కేసీఆర్‌ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో కుటుంబపాలనకు చరమగీతం పలికితీరుతామని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలమైన పార్టీగా మారిందన్నారు. కేసీఆర్‌ దళిత వ్యతిరేకిగా మారాడని ఎద్దేవా చేశారు. మాలమహానాడు వ్యతిరేకిగా సీఎం కేసీఆర్‌ మారాడని విమర్శించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top