ఎవరి ఆస్తులేమిటో తేల్చుకుందామా?

Revanth Reddy Fires On KCR In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు దమ్ముంటే తనతోపాటు ఆయన ఆస్తులపై విచారణకు ముందుకు రావాలని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాటి నుంచి తన ఆస్తులతోపాటు టీఆర్‌ఎస్‌ పెట్టిన రోజు నుంచి నేటి వరకూ ఉన్న ఆస్తులపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధపడదామని కేసీఆర్‌ను చాలెంజ్‌ చేశారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాయడానికి తాను సిద్ధమని, ఒకవేళ తన సవాల్‌పై 24 గంటల్లోగా స్పందించకపోతే కేసీఆర్‌ అవినీతిపరుడని ఒప్పుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. తన నివాసంలో జరిగిన ఐటీ, ఈడీ అధికారుల సోదాలు శనివారం తెల్లవారుజామున 2.45 గంటలకు ముగియడం, వచ్చే నెల 3న విచారణకు హాజరుకావాలంటూ ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 

ఆస్తుల మార్కెట్‌ ధరలోనే మార్పు... 
రాష్ట్రంతో సంబంధంలేని రామారావు అనే వ్యక్తిని ముందుపెట్టి ఐటీ అధికారులు తన ఇంట్లో సోదాలు చేశారని రేవంత్‌ విమర్శించారు. నకిలీ పత్రాలను మీడియా కార్యాలయాలకు పంపి తనపై అసత్య కథనాలు ప్రసారం చేయించారని మండిపడ్డారు. 2009లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో చూపిన ఆస్తులే 2014 అఫిడవిట్‌లోనూ ఉన్నాయని, ఎటొచ్చీ ధరలోనే మార్పు వచ్చిందన్నారు. దానిపై ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆస్తుల విషయంలో మార్కెట్‌ విలువనే చూపించాలన్న ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 2014లో ధరను మార్చి చూపించిన సంగతిని అందరూ విస్మరిస్తున్నారన్నారు. రెండు ఎన్నికలకు ముందు తాను సమర్పించిన అఫిడవిట్లలో ఆస్తుల వివరాలను పక్కపక్కన పెట్టుకొని చూస్తే ఆస్తులు పెరిగాయా తగ్గాయా అన్నది తెలిసిపోతుందన్నారు. 

22 ఏళ్ల కిందటే పాత ఇల్లు అద్దెకిచ్చా... 
తన పాత చిరునామాతో అనేక షెల్‌ కంపెనీలు నడుస్తున్నాయని, అవన్నీ తనవే అని చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేశాయంటూ రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దాదాపు 22 ఏళ్ల క్రితమే తన పాత ఇంటిని కిరాయికి ఇచ్చామని, అందులో అద్దెకుంటున్న వారు కంపెనీలు ఏర్పాటు చేసుకొని లావాదేవీలు సాగిస్తే వాటిని కూడా తనకే అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ దాడులకు సంబంధించి మీడియా సంస్థలపై కేసీఆర్‌తోపాటు మైహోమ్‌ గ్రూప్‌ యజమాని రామేశ్వర్‌రావు లాంటి వ్యక్తుల ఒత్తిడి ఉందని ఆరోపించారు. తనకు పిల్లనిచ్చిన మామ పద్మనాభరెడ్డితోపాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులను బినామీలుగా ప్రచారం చేశారని రేవంత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను పుట్టక ముందే, తన మామది కోటీశ్వరుల కుటుంబమన్నారు. అలాంటి వారిని తన బినామీలుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. 

విదేశీ ఖాతాల పేరిట దుష్ప్రచారం... 
విదేశాల్లో ఖాతాలపై అవగాహన లేకుండా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని రేవంత్‌ మండిపడ్డారు. ఒక రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌ తప్పించడానికి కేటీఆర్‌ చెబితే తనపై ఆరోపణలు చేస్తున్నాడని పరోక్షంగా న్యాయవాది రామారావు విషయాన్ని ప్రస్తావించారు. హాంకాంగ్, మలేసియాకు తాను వెళ్లానో లేదో తెలి యకుండా ఆరోపణలు చేస్తున్న వారు ఆ ఖాతాలు నిజమని నిరూపించకపోతే లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధపడాలన్నారు. సోదాల పేరిట తనను, తన కుటుం బాన్ని మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో ఖాతా తెరవడానికే తనకు అర్హత లేదన్నారు. ఆయా దేశాల్లో బ్యాంకు అకౌంట్లకు ఎన్ని నంబర్లు ఉంటాయో కూడా సరిచూసుకో కుండా ఎవరో ఇచ్చిన పత్రాలను నమ్మి తనపై కొన్ని మీడియా, పత్రికాసంస్థలు దుష్ప్రచారం చేశాయని  మండిపడ్డారు. మలేసియా, హాంకాంగ్‌ల్లో బ్యాంకు ఖాతాలకు 14 లేదా 12 డిజిట్లుంటాయని, తనకు విదేశీ ఖాతాలున్నాయంటూ చూపిన పత్రాల్లో ఉన్న ఖాతాలకు 13 నంబర్లున్నాయని గుర్తుచేశారు. 

కేసీఆర్‌కు అభద్రతాభావం
సీఎం కేసీఆర్‌ అభద్రతాభావంతో భయాందోళనకు లోనవుతున్నట్లు మూడు రోజుల పరిణామాలను చూస్తే తెలుస్తోందని రేవంత్‌ పేర్కొన్నారు. తన ఇంట్లో జరిగిన సోదాలపై పారదర్శకంగా, జవాబుదారీగా ఉండాలనే ప్రజలకు అన్ని విషయాలు చెబుతున్నానన్నారు. ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి తన నుంచి వివరాలు సేకరించారని, వాళ్లు అడిగిన ప్రతి ప్రశ్నకూ స్పష్టమైన సమాధానాలిచ్చానని తెలిపారు. అయితే ప్రతి రెండు నిమిషాలకోసారి ఐటీ అధికారులకు ఫోన్లు చేసి ఏం జరుగుతోంది, అరెస్ట్‌ చేస్తున్నారా లేదా అంటూ ఒత్తిడి తెచ్చిన అజ్ఞాత వ్యక్తులెవరో బయటపెడతానన్నారు. ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌రావు తాను నివసిస్తున్న ప్రాంతంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని నిఘాలో పెట్టారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ కవిత సాగిస్తున్న అక్రమ వ్యాపారాలను త్వరలోనే ఆధారాలతో బయడపెడతామన్నారు. ఇప్పటికే కోర్టులో వారిపై ఆరు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. మైంహోం రామేశ్వర్‌రావుకు అక్రమంగా కేటాయించిన భూముల సంగతితోపాటు కేటీఆర్‌ సినిమా వాళ్లతో సాగిస్తున్న చీకటి వ్యవహారాలను అతిత్వరలో బయటపెడతానన్నారు. తనను చంపేందుకు కొందరు వ్యక్తులు రెక్కీ చేస్తున్నారని జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఆరుసార్లు వాహనాల నంబర్లు, వ్యక్తుల ఫొటోలతో సహా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.

కొడంగల్‌ ప్రజలకు రుణపడి ఉంటా
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి మూడు రోజులుగా తనకు అండగా నిలబడిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులకు ముఖ్యంగా కొడంగల్‌ ప్రజలకు రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 2009 నుంచి తన వెన్నంటే ఉండి గెలిపిస్తూ వస్తున్న కొడంగల్‌ ప్రజలకు తన చివరి రక్తపుబొట్టు వరకు రుణపడి ఉంటానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆదివారం నుంచి ప్రచారంలోకి వెళ్తున్నానని, టీఆర్‌ఎస్, కేసీఆర్‌ చేస్తున్న అక్రమాలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ఆదివారం కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ నేతృత్వంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు.

రేవంత్‌, ఆయన భార్య సెల్‌ఫోన్లు స్వాధీనం...
గత మూడు రోజులుగా జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు చేపట్టిన సోదాలు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ముగిశాయి. శుక్రవారం రాత్రి 11 గంటల వరకు రేవంత్‌ను విచారించిన అధికారులు ఆ తర్వాత ఆయన ఇంట్లో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్, సీడీలను ఓ గదిలో ఉంచి గదిని సీజ్‌ చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డితోపాటు ఆయన భార్య గీతకు చెందిన రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని సిమ్‌కార్డులను మాత్రం వారికి ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top