కేసీఆర్‌ కుటుంబమే బాగుపడింది 

Revanth Reddy fires on KCR and TRS Party - Sakshi

నియామకాలు, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఏవీ? 

తెలంగాణను అప్పులపాల్జేసిన ఘనుడు 

టీఆర్‌ఎస్‌ దుష్టపాలన నుంచి విముక్తి కలిగించాలి 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ప్రచార సభల్లో రేవంత్‌రెడ్డి పిలుపు 

సాక్షి, ఆసిఫాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబమే బాగుపడిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ తన కొడుకు, కూతురు, అల్లుడు, ఇతర బంధువులతో దొరల రాజ్యం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం కుమురంభీం జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్‌లో మహాకూటమి అభ్యర్థి ఆత్రం సక్కు, ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడలో బోథ్‌ అభ్యర్థి సోయం బాపూరావు, నిర్మల్‌ జిల్లా కడెంలో ఖానాపూర్‌ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్‌ తరపున ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై విరుచుకుపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలు, నిరుద్యోగులు బాగు పడుతారని అంతా భావించారని, కానీ.. కేసీఆర్‌ కుటుంబమే లబ్ధి పొందిందని ఆరోపించారు.

ఆ కుటుంబం నుంచే ఐదుగురు ఉద్యోగాలు పొంది నెలకు రూ.30 లక్షల జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వని కేసీఆర్‌.. తాను మాత్రం 150 గదులతో ఓ గడిని, వందల ఎకరాల్లో ఫాంహౌజ్‌ నిర్మించారని విమర్శించారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఏమైందని ప్రశ్నించారు. అలాంటప్పుడు రూ.6.75 లక్షల కోట్ల బడ్జెట్‌ ఎక్కడకి పోయిందని నిలదీశారు. ఏ ముఖ్యమంత్రి హయాంలో లేని అప్పులు ఈ నాలుగేళ్లలో రూ.1.52 లక్షలకు చేరాయని ఆరోపించారు. కేసీఆర్‌ చేతిలో తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవద్దని, టీఆర్‌ఎస్‌ దుష్టపాలన నుంచి విముక్తి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

రాబోయేది ఇందిరమ్మ రాజ్యం 
రాబోయే ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.5 వేలు, డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షలు, గతంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూ.2 లక్షలు ఇస్తామని అన్నారు. 58 ఏళ్లకే నెలకు రూ.2 వేల పింఛన్‌ ఇంట్లో ఇద్దరు వృద్ధ దంపతులు ఉన్నా ఇద్దరికీ ఇస్తామని చెప్పారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తెలంగాణలో ఎత్తిపోతల పథకాలు ప్రారంభిస్తామంటే మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామని, కానీ ఆయన ఎత్తుడు పోసుడు తప్పితే ఏమీ చేయలేదని విమర్శించారు. ఎప్పుడూ ఫాం హౌజ్‌లోనే పడుకునే కేసీఆర్, ఓటు వేయకపోతే టీఆర్‌ఎస్‌కు నష్టం లేదు విశ్రాంతి తీసుకుంటా అని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. మహాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top