అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందే

Revanth Reddy Fires On KCR And Modi Govt - Sakshi

     అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్‌ ప్రజలకు చేసిందేమీ లేదు 

     టీఆర్‌ఎస్‌ పార్టీని వంద మీటర్ల లోతున పాతిపెట్టాలి  

     టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శలు

జహీరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో ఆయన కాంగ్రెస్‌  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలుపుకోలేదని, ఇలాంటి అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంపదను దోచుకోవడంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ మరోసారి అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. చంద్రబాబు అభివృద్ధికి అడ్డుపడుతున్నాడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ను వంద మీటర్ల లోతున పాతిపెట్టాలని అన్నారు. వంద స్థానాలు గెలుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెప్పు కొంటున్నారని, ఏం చేశారని ప్రజలు వారిని గెలిపిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ మహిళలను చిన్నచూపు చూస్తోందని, ప్రభుత్వంలో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన  ఉద్యమకారుల కుటుంబాలకు ఇంత వరకు పరిహారం అందలేదని రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.

జర్నలిస్టులు పిట్టల్లా రాలుతున్నా ఆదుకున్న సందర్భాలు లేవన్నారు. మంత్రి కె.తారక రామారావు  చౌకబారు విమర్శలు చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మర్యాద నేర్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, రాబోయేది తమ ప్రభుత్వమే అని, అప్పుడు సంగతి తేల్చుతామని హెచ్చరించారు. కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ కూడా ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. మోదీ, కేసీఆర్‌లకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకురాలు జె.గీతారెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top