తెలంగాణ టీడీపీ ఖాళీ!

Revanth Reddy decision makes tdp empty in telangana - Sakshi

రేవంత్‌ ఇచ్చిన షాక్‌తో అతలాకుతలం

ఆయన వెంట వెళ్లే నేతలపై చర్చ

పార్టీ మారే ఆలోచనలో పలువురు నేతలు, సగం జిల్లాల అధ్యక్షులు

కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం

అదే బాటలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు

నేడు సన్నిహితులతో రేవంత్‌ సమావేశం?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఇచ్చిన షాక్‌తో ఆ పార్టీ అతలాకుతలమవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలితో విసిగిపోయిన తెలంగాణ టీడీపీ నాయకత్వం పార్టీని వీడటమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయనతోపాటు కాంగ్రెస్‌ కండువాలు ఎవరెవరు కప్పుకుంటారనే అంశంపైనే ప్రధానంగా చర్చంతా జరుగుతోంది. బుధవారం రేవంత్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడటం, ఏపీ మంత్రులు, నాయకులపై విమర్శలు చేయడం వంటి అంశాలను పరిశీలిస్తే.. ఆయన కాంగ్రెస్‌కు చేరువ కావడానికి మానసికంగా సిద్ధమైపోయారని అంటున్నారు. ఆయన వెంట ఎంత మంది వెళ్తారన్న విషయం చర్చనీయాంశమవుతోంది. సగంపైగా తెలంగాణ టీడీపీ ఖాళీ అయినట్లే అని బలమైన అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

సగం జిల్లాల అధ్యక్షులు జంప్‌
పార్టీ మారడానికి సరైన ముహూర్తం ఇంకా కుదరకున్నా.. రేవంత్‌ వెంట ఎవరెవరు బయటకు వెళతారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. మరోమారు తన సన్నిహితులతో అభిప్రాయాలు పంచుకునేందుకు రేవంత్‌ గురువారం ప్రత్యేకంగా భేటీ కానున్నారని సమాచారం. పార్టీ వర్గాల నుంచి అందుతున్న వివరాల ప్రకారం కనీసం 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు కూడా అదే బాటలో ఉన్నారని తెలిసింది. భూపాలపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వికారాబాద్, మేడ్చల్, సూర్యాపేట జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కేడర్‌ మారే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ జిల్లాల అధ్యక్షులంతా రేవంత్‌ వెంటే ఉన్నారని సమాచారం.

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, దయాకర్‌ రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, ఉమా మాధవ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, పటేల్‌ రమేశ్‌ రెడ్డి, కంచర్ల భూపాల్‌ రెడ్డి తదితరులు పార్టీ మారే వీలుందని ప్రచారం జరుగుతోంది. మొత్తంగా సగానికిపైగా పార్టీ రేవంత్‌ అభిప్రాయానికి మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు. వీరేకాక జీహెచ్‌ఎంసీ పరిధిలో కూడా పలువురు నేతలు ఉన్నారని సమాచారం. గురువారం జరగనున్న సన్నిహితుల సమావేశం తర్వాత మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.  

చివరకు వారిద్దరే..
పార్టీలో చివరకు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీనియర్‌ నేత మోత్కుపల్లి వంటి నేతలే మిగిలుతారని చర్చ నడుస్తోంది. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబుపై వీరే ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. రేవంత్‌ వెంట ఉన్నారని ప్రచారం జరుగుతున్న జిల్లాల టీడీపీ అధ్యక్షులంతా ఇటీవల సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని వాదించారని, కానీ చంద్రబాబు ఆలోచన మరోలా ఉండటంతో టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్‌ ఉండదన్న నిర్ణయానికి వచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఏడాది కిందటే రెండు వర్గాలు
ఏడాది కిందటే టీడీపీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. పార్టీ శ్రేణుల్లో అత్యధికులు రేవంత్‌ను అధ్యక్షుడిగా చేయాలని అభిప్రాయ సేకరణలో చెప్పినా, చంద్రబాబు ఎల్‌.రమణనే అధ్యక్షుడిగా ప్రకటించారు. అప్పటి నుంచి పార్టీలో ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. ఇటీవల ప్రకటించిన జంబో కార్యవర్గంలో సైతం రేవంత్‌ వర్గానికి చెందిన కొందరికి పదవులు దక్కలేదు. ఆయన చేపట్టే కార్యక్రమాలకు, తీసుకునే నిర్ణయాలకు ఎప్పుడూ కొందరు సీనియర్లు అడ్డుపడుతున్నారని రేవంత్‌ వర్గీయులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా ఓపిక పట్టిన వారంతా పార్టీని వీడాలని ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top