‘ఏ ఆటలోనూ కేటీఆర్‌ నాతో పోటీపడలేడు’

revanth reddy commented over ktr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రి కేటీఆర్‌వి అన్నీ ఫిట్‌నెస్‌షోలేనని, ఏ ఆటలోనూ తనతో పోటీపడలేరని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు చేతనైతే తనతో 10కే రన్‌కు రావాలని సవాల్‌ విసిరారు. సోమవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ జరిపారు. నాడు తెలంగాణ ఉద్యమ ముసుగులో చిల్లర రాజకీయాలు చేసిన కేసీఆర్‌ ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అదే చేస్తున్నారని విమర్శించారు.

దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీ గ్రాఫ్‌ పెరిగిపోతోందని, మోదీకి దీటైన నాయకుడిగా దేశ ప్రజలకు కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా రాహుల్‌ తన ప్రసంగంతో ప్రజలకు మరింత దగ్గరయ్యారని, మోదీని ఆలింగనం చేసుకుని తనను ద్వేషిస్తున్న వారికి కూడా మంచి సందేశం పంపారని రేవంత్‌ పేర్కొన్నారు.  

‘ఎంఐఎం, బీజేపీవి మతతత్వ రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఎంఐఎం, హిందూ మతతత్వాన్ని రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ ఓట్ల లబ్ధి పొందాలని చూస్తున్నాయని టీపీసీసీ కార్యదర్శి మహ్మద్‌ సలీం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రెండు పార్టీలు పోటీపడుతున్నాయని ఆయన విమర్శించారు.

సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గత ఆరు దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీ ముస్లిం మైనార్టీలను మోసం చేస్తూనే ఉందని చెప్పారు. కేవలం కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేసే ఓవైసీలకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీని విమర్శించే అర్హత లేదన్నారు. పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్న ఎంఐఎంకు ముస్లిం ప్రజానీకం రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top