ప్రజాసమస్యలపై స్టార్‌ హోటల్‌లో చర్చా?

revanth reddy commented over kcr - Sakshi

కేసీఆర్‌ తిండి పెడితే వెళతారా..?

టీటీడీపీ నేతల తీరుపై రేవంత్‌ ఆగ్రహం

పార్టీ కోసం పనిచేసిన నన్ను జైలుకు పంపారు

ఉదయం టీడీపీ కార్యాలయంలో.. సాయంత్రం పైరవీలు, పైసల కోసం సీఎం వద్దకు..

ఆ నేతల గురించి అందరికీ తెలుసని వ్యాఖ్య

చంద్రబాబును కలిసిన తర్వాత అన్ని విషయాలు చెబుతానని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ, బీజేపీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక స్టార్‌ హోటల్‌లో తిండి పెట్టిస్తే ఎలా వెళ్తామని టీటీడీపీ ముఖ్య నేత ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై స్టార్‌ హోటళ్లలో సమావేశాలు పెట్టడమేమిటని నిలదీశారు. టీఆర్‌ఎస్‌పై పోరాడుతున్న తనను మోత్కుపల్లి నర్సింహులు వంటివారు తిడుతున్నారని.. ఆయనను ఆపాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణపై లేదా అని ప్రశ్నించారు.

ఉదయం పూట టీడీపీ కార్యాలయంలో ఉంటూ సాయంత్రం పైరవీల కోసం, పైసల కోసం సీఎం కేసీఆర్‌ వద్దకు పోయేవారి గురించి పార్టీలో అందరికీ తెలుసన్నారు. అసెంబ్లీలోని టీటీడీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో రేవంత్‌ మాట్లాడారు. ‘‘నా పోరాటమే కేసీఆర్‌ మీద. నన్ను తిట్టేవారెవరైనా కేసీఆర్‌కు అనుకూలురే.

టీడీపీ అధినేత చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పుడు.. నన్ను పార్టీ పదవుల నుంచి తొలగించినట్టుగా ప్రకటన ఎలా చేస్తారు?’’అని నిలదీశారు. అసలు ప్రజా సమస్యలపై స్టార్‌ హోటళ్లలో చర్చించేదేమిటని, శాసనసభలో పార్టీ కార్యాలయాలుండగా స్టార్‌ హోటళ్లలో సమావేశాలు ఎందుకని పేర్కొన్నారు.

కేసీఆర్‌ కోసమే నన్ను తొలగించారు
కేసీఆర్‌పై పోరాడుతున్న తనను పార్టీ పదవుల నుంచి తొలగిస్తే లాభం ఎవరికి ఉంటుందని.. టీడీపీ నేతలు ఎవరికోసం పనిచేస్తున్నారో దీనితో తేలిపోతోందని రేవంత్‌ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ, కేసులు పెడుతున్న సీఎం కేసీఆర్‌ శత్రువో, మిత్రుడో తేల్చుకోకుంటే ఎలాగని పేర్కొన్నారు.

‘‘కేసీఆర్‌ 30 ఏళ్ల నుంచి మిత్రుడని టీడీపీలో ఉన్న నాయకుడు అంటున్నారు. 3నెలల కిందటి దాకా కేసీఆర్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన ఆ నాయకుడు ఇప్పుడేమో పొగుడుతున్నారు. ఇదేంటో కార్యకర్తలకు అర్థం కాదా? ఉత్తమ్‌తో సింగరేణి ఎన్నికల్లో, నేరెళ్ల ఘటనపై టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ కలసి వెళ్లాడు.

అలాంటి అవసరాల కోసం కాంగ్రెస్‌ నేతలతో కలిస్తే తప్పేమిటి? బాబు వచ్చేదాకా ఆగే ఓపిక లేదా? నాపై ఫిర్యాదు చేయడంలో పార్టీ కేంద్ర కమిటీ ఆమోదం ఉందా? పార్టీ కోసం పనిచేసినందుకు నన్ను జైలుకు పంపినవాళ్లకు అనుకూలంగా మాట్లాడితే ఎలా?’’ అని రేవంత్‌ నిలదీశారు. తనను పదవుల నుంచి తొలగించాల్సిన అవసరం కేసీఆర్‌కు తప్ప ఎవరికీ లేదని... కేసీఆర్‌ కోసమే తనను పార్టీ పదవుల నుంచి తొలగించారన్నారు. తనను తిట్టడానికి టీఆర్‌ఎస్‌ నేతలతో టీడీపీ నేతలు పోటీ పడుతున్నారని అన్నారు.

టీడీఎల్పీ నేత కుర్చీకి దూరంగా..
టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఎ.రేవంత్‌రెడ్డి చీఫ్‌ కుర్చీలో కూర్చోకుండా పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు. అలా పక్క సీట్లో ఎందుకు కూర్చున్నారని విలేకరులు ప్రశ్నించినా.. అది పెద్ద విషయం కాదంటూ సమాధానం దాటవేశారు.

ఆ అదృశ్య శక్తి ఎవరు?
తెలంగాణలో టీడీపీ లేదని బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, మురళీధర్‌రావు వంటివారు బహిరంగంగానే చెప్పారని.. మరి ఇప్పుడు రాష్ట్రంలో అదే బీజేపీ నేతలతో టీటీడీపీ నేతల సమన్వయం ఎలా సాధ్యమైందని రేవంత్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ, టీడీపీలను కలిపిన ఆ అదృశ్యశక్తి ఎవరని ప్రశ్నించారు. ఒక్క రేవంత్‌ తప్ప టీడీపీ నేతలంతా తమవైపే ఉన్నారన్న ఎర్రబెల్లి దయాకర్‌ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.

రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని, దాన్ని నివారించడానికి రకరకాల మందు లు కొడతామని ఎద్దేవా చేశారు. టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్ష, టీడీఎల్పీ నేత పదవుల నుంచి తొలగిస్తున్నట్టుగా తనకు   బాబు నుంచి సమాచారం లేదన్నారు. రాహుల్‌గాంధీని కలిశారా, లేదా అని విలేకరులు ప్రశ్నించగా.. సూటిగా సమాధానం ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ను కలసిన తర్వాత అన్ని విషయాలు బహిరంగంగా చెబుతానని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top