పెట్టుబడి అందించి, సౌకర్యాలు పెంచి, రైతుల్ని రాజులు చేస్తాం

by reducing investment, increase facilities will make farmers kings: YS Jagan - Sakshi

34వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో రైతన్నలకు వైఎస్‌ జగన్‌ మాట

యుద్ధప్రాతిపదికన అన్ని ప్రాజెక్టుల పూర్తిచేస్తామని వాగ్ధానం

పెట్టుబడి కింద ప్రతి రైతు అకౌంట్లో రూ.12,500

పగటిపూట 9 గంటల విద్యుత్‌.. వడ్డీలేని రుణాలు

రూ.3వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధి.. రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి

రాప్తాడు సెంటర్‌లో బహిరంగ సభ.. పోటెత్తిన జనం

సాక్షి, రాప్తాడు : మహానేత కలలు కన్న రైతు సంక్షేమ రాజ్యం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తానని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. పెట్టుబడిని తగ్గించి, సాగునీటి, మార్కెట్‌ సౌకర్యాలను పెంచడం ద్వారా రాష్ట్రంలోని రైతులు అందరినీ రారాజులుగా చేస్తామని మాట ఇచ్చారు. మరికొద్దిరోజుల్లో ఏర్పాటుకాబోయే ప్రజాప్రభుత్వం.. యుద్ధప్రాతిపాదికన అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తుందని హామీ ఇచ్చారు. పండిన పంటలకు గిట్టుబాటుధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని, రూ.4వేల కోట్లతో ప్రకృతివిపత్తు పరిహార నిధిని ఏర్పాటుచేస్తామని తెలిపారు. 34వరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడు మండలకేంద్రంలో బహిరంగ సభను ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు.

పెట్టుబడి తగ్గాలి.. సౌకర్యాలు పెరగాలి.. : ‘‘రైతన్నలు పడుతోన్న అవస్థల గురించి ఆలోచిస్తే.. పంట విస్తీర్ణం తగ్గిపోయింది. అనంతపురం జిల్లాల్లోని 63 మండలాలూ కరువు మండలాలుగా ప్రకటించారు. వారు పక్కరాష్ట్రాలకు పోయి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. రైతన్నలు ఎదుక్కొనే అతి ముఖ్యమైన పెట్టుబడి సమస్యను ఖచ్చితంగా నివారిస్తాం. వర్షాకాలనికి ముందే (మే నెలలో) ప్రతి రైతుకు పెట్టుబడి కోసం రూ.12,500 ఇస్తాం. బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా డబ్బులు నేరుగా రైతులకే అందేలా చేస్తాం. దానితోపాటు 9 గంటలు పగటిపూట కరెంటు అందిస్తాం. వడ్డీ లేకుండా రుణాలు ఇప్పిస్తాం. దీనివల్ల రైతన్నకు పెట్టుబడి సమస్యలు తీరతాయి.

ఆ తర్వాత పండిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. రూ.3వేల కోట్లతో మార్కెట్‌ స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తాం. ఏ రైతు కూడా గిట్టుబాటు ధర కంటే తక్కువకు  పంటను అమ్మాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లో అమ్ముడుపోని పక్షంలో గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే పంటను కొంటుంది. అలాగే ప్రతి మండలంలోనూ కోల్డ్‌స్టోరేజీలు, గోదాములు నిర్మిస్తాం. వాటిలో రైతులు ఉచితంగా తమ పంటలను ఉంచుకోవచ్చు. కేంద్రం సహకారంతో రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నుంచి రైతులను కాపాడేందుకు నిధిని ఏర్పాటుచేస్తాం. అన్నింటికంటే ముఖ్యంగా అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన అన్ని ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం’’  అని వైఎస్‌ జగన్‌ రైతన్నలకు మాట ఇచ్చారు.

రైతుల ఆత్మహత్యలు ఆగాలి : అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తుచేసిన వైఎస్‌ జగన్‌.. ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండకూడదన్నారు. ఏవేనీ కారణాలవల్ల జరగకూడనిది జరిగితే.. వైఎస్సార్‌ బీమా పథకం ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు నేరుగా రూ.5 లక్షలు ఇస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూముల సర్వే నంబర్లు, పాస్‌ బుక్కులు మారిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో రాబోయే ప్రభుత్వం నిష్పక్ష పాతంగా టైటిల్‌ డాక్యుమెంట్స్‌ రీ సర్వే చేయిస్తుందని జగన్‌ ప్రకటించారు.

ఇంకా జగన్‌ ఏమన్నారంటే..
‘‘గత రెండు రోజులుగా రాప్తాడు నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతోంది. చాలా మంది రైతులు, అక్కచెల్లెమ్మలు, యువత నన్ను కలిసి వారి సమస్యలు చెప్పారు. రేపు రాబోయే మన ప్రభుత్వంలో ఈ సమస్యలు తీరుతాయన్న ఆశతో చెబుతున్నామన్నారు. గడిచిన నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనను చూశాం. మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయని ఆయనే అంటున్నారు. ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచన చేయమని వేడుకుంటున్నా. అసలీ ప్రభుత్వం మనకు ఏదైనా మేలు చేసిందా? అని అడుగుతున్నా. నాలుగేళ్ల కిందట ఎన్నికల్లో గెలవడం కోసం పెద్దమనిషి చంద్రబాబు ఏం మాటలు చెప్పారు? అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పారు. కానీ అలా జరగలేదు. నాలుగేళ్ల కిందట ఒక్కో ఇంటికి రూ.50, రూ.100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు.. ఇవాళ రూ.500, రూ.1000 బిల్లు వచ్చే పరిస్థితి. కరెంటోళ్లు ఇండ్లలోకి వచ్చి ఫైన్లు కట్టాలని అడుగుతున్నారు.

విలేజ్‌మాల్స్‌ మాయాజాలం : ఇంతకుముందు రేషన్‌ షాపుల్లో బియ్యంతోపాటు నిత్యావసరాలు అన్నీ కలిపి రూ.185కే దొరికేవి. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే వాటిని కట్‌ చేశారు. ఇప్పుడేమో విలేజ్‌ మాల్స్‌ పేరుతో మాయాజాలం చేస్తున్నారు. ఆ మాల్స్‌ను చంద్రబాబు బినామీ కంపెనీలు నడుపుతారట! ఇటీవలే విజయవాడలో ఒక విలేజ్‌మాల్‌ ప్రారంభించారు. అప్పట్లో అరకేజి చక్కెర రూ.6.75కు లభించేది. అదే విలేజ్‌ మాల్‌లో ధర రూ.25 రూపాయలు ఉంది. రూ.50కి లభించిన కిలో కందిపప్పు.. విలేజ్‌మాల్‌లో రూ.90గా ఉంది. రేషన్‌ షాపుల్లో కిలో గోధుమలు రూ.7కే దొరికేవి.. విలేజ్‌మాల్స్‌లో వాటి ధర రూ.28 నుంచి 30 దాకా ఉంది. పావుకిలో కారంపొడి రూ.25 ఉండేది మాల్‌లో రూ75, ఉప్పు రూ.5కు దొరికేది అక్కడ రూ.17కు పెరిగింది. అంటే.. సామాన్యుడికి ఇంతకుముందు రూ.185కే దొరికే ఈ నిత్యావసరాలు.. చంద్రబాబు మాల్‌లో దాదాపు రూ.600కు దొరికే పరిస్థితి. ఇంత మోసం చేస్తూ కూడా ఆయన మనకేదో మేలుచేసినట్లు మాట్లాడటం దారుణం.

అన్ని వర్గాలనూ మోసం చేశారు : గత ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని, ప్రతి ఇంటికీ తన సంతకంతో లేఖలు పంపారు.  జాబు రాకుంటే ఇంటింటికీ రూ.2వేలు ఇస్తామన్నారు. ఆయన అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావచ్చింది. రైతులకు రుణమాఫీ జరగలేదు, పొదుపు సంఘాల రుణాలను మాఫీ చెయ్యలేదు. యువతకు ఉద్యాగాలు కల్పించే ప్రత్యేక హోదాను చంద్రబాబు అమ్ముకున్నారు. ఇన్ని మోసాలు చూశారు కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి. రేపు జరిగే ఎన్నికల్లో మోసం చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు మీకు నాయకుడుగా కావాలా అని అడుగుతన్నా. చెడిపోయిన రాజకీయాల్లో విశ్వసనీయత రావాలంటే జగన్‌ ఒక్కడివల్లే కాదు.. మీ అందరి సహకారంతోనే సాధ్యమవుతుంది. ఒక నాయకుడు వాగ్ధానాన్ని నెరవేర్చకుంటే రాజీనామా చేసే పరిస్థితి రావాలి.

కట్టని అమరావతిపై సినిమా తీస్తారట! : వచ్చే ఎన్నిలకు చంద్రబాబు మళ్లీ వస్తారు. ఈసారి ఇంటికీ కేజీ బంగారం, మారుతీ కారు ఇస్తామంటారు, సినిమా యాక్టర్లు, డైరెక్టర్లను పక్కన పెట్టుకొస్తారు. ఈ మధ్యకాలంలో బాహుబలి తీసిన డైరెక్టర్ను చంద్రబాబు పిలిపించి అమరావతి మీద సినిమా తీయమని అడిగారట! నాలుగేళ్లలో అక్కడ పర్మనెంట్‌గా ఒక్క ఇటుకా పడలే. అలాంటిదానిపై సినిమా తీయమన్నారట! ఇక వాళ్లు సెట్టింగులువేసి సినిమాలు తీసి.. అదిగో అమరావతి.. అని జనానికి చూపిస్తారు!  ఆ నటుటు మీ ముందుకొచ్చి ఇలా అంటారు.. చంద్రబాబుకు చాలా ఎక్స్‌ పీరియన్స్‌ ఉంది చాలా కష్టపడ్డాడు, కానీ కేంద్రం సహకరించలేదు అని! ప్రచారానికి వచ్చే ఆ యాక్టర్‌గారిని ఈ సారి మీరు నిలదీసి అడగాలి... నాలుగేళ్లుగా  చంద్రబాబు ఏం చేశారు? ఆయన మోసాల్లో మీకు భాగస్వామ్యం లేదా? అని ప్రశ్నించాలి. మనలో చైతన్యం వస్తే ఇలాంటి మోసగాళ్లు బంగాళాఖాతంలో కలిసిపోతారు’’ అని జగన్‌ అన్నారు.
ప్రసంగాన్ని ముగిస్తూ.. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల్లో ఏవైనా మార్పుచేర్పులు, సలహాలు ఇవ్వాలనుకుంటే చెప్పాల్సిదిగా విన్నవించిన జగన్‌.. ప్రజా సంకల్ప యాత్రను దీవించాల్సిందిగా ప్రజలను కోరారు.

రైతులు అందరినీ రారాజులుగా చేస్తాం

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top