‘కేశినేని నాని విఙ్ఞతకే వదిలేస్తున్నాం’

Ramakrishna Fires On MP Kesineni Over His Comments Against Communist Parties - Sakshi

సాక్షి, విజయవాడ : కార్మికుల సమస్యలు ఉన్నంత కాలం ఎర్రజెండా పార్టీలు ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీపై టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...కేశినేని నాని వ్యాఖ్యలను ఆయన విఙ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కేశినేని రాజకీయాల్లో ఉండవచ్చు, ఉండకపోవచ్చు గానీ ఎర్రజెండా పోరాటాలు మాత్రం ఉంటాయని వ్యాఖ్యానించారు. కార్మికుల సమస్యలు తీర్చకుండా పార్టీల పేరుతో విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్విటర్‌లో కమ్యూనిస్టు పార్టీపై ఇలా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కమ్యూనిస్టులు ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పోరాడతారని పేర్కొన్నారు. అటువంటి పార్టీలపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా కేశినేనికి చెందిన ట్రావెల్స్‌లో పనిచేస్తున్న సిబ్బంది పాత బకాయిలు చెల్లించాలని శుక్రవారం నిరసస దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్ట్‌ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో కేశినేని నాని కమ్యూనిస్ట్‌ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘ఎంతో ఘన చరిత్ర ఉన్న కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవటంవల్లే ఈరోజు దేశంలో కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది’ అంటూ తన ట్విటర్‌ ఖాతాలో శనివారం పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఆయనపై కమ్యూనిస్ట్‌లు భగ్గుమంటున్నారు.

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top