పోలీసులూ.. టీడీపీ తొత్తులుగా వ్యవహరించొద్దు

Ramachandra Reddy And Chevireddy comments on Chandrababu - Sakshi

గ్రామస్తులేమైనా తీవ్రవాదులా?

అర్ధరాత్రి ఇళ్లల్లో దూరి దౌర్జన్యాలేంటి?

అక్రమ అరెస్టులను సహించేది లేదు 

వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి, చెవిరెడ్డి

తిరుపతి రూరల్‌/సదుం: ‘పోలీసులూ.. అధికారపార్టీ తొత్తులుగా వ్యవహరించొద్దు. గ్రామస్తులేమైనా తీవ్రవాదులా?. అర్ధరాత్రి ఇళ్లలో దూరి దౌర్జన్యాలేంటి? చంద్రబాబునాయుడు పోలీసులు, డబ్బులను అడ్డంపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. అక్రమ అరెస్టులను సహించేదిలేదు.’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం మండల పరిధిలో శుక్ర, శని, ఆదివారం సర్వే పేరుతో ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిని గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే టీడీపీ నేతల ఆదేశాలతో పోలీసులు వారిని విడిచిపెట్టి.. పట్టించిన గ్రామస్తుల్లో ముగ్గురిపై అక్రమ కేసులు బనాయించి కోర్టులో హాజరుపరిచారు. విషయం తెలుసుకుని కోర్టుకు వచ్చిన రామాంజనేయులు అనే యువకుడు తనను నిర్బంధించినట్లు తానేమీ గ్రామస్థులపై ఫిర్యాదు చేయలేదని, ఆ తప్పుడు కేసుతో తనకు సంబంధంలేదని జడ్జికి విన్నవించారు. విషయం తెలుసుకున్న న్యాయమూర్తి అప్పగించిన వారిపై కేసులేంటి అని ప్రశ్నించి గ్రామస్తులను ఇళ్లకు పంపేశారు.

ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డితో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అమాయక విద్యార్థులకు డబ్బులు ఎరజూపి సర్వే పేరుతో గ్రామాల్లో తిప్పుతూ వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకున్న గ్రామస్తులపైన తీవ్రవాదులు, దోపిడీ దొంగలు, నరహంతకులపై పెట్టినట్లు కేసులు బనాయించి అర్ధరాత్రి ఇళ్లలో దూరి దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కొంతమంది పోలీసులు చంద్రబాబు బంట్రోతుల్లా వ్యవహరిస్తూ.. చట్టాన్ని, ధర్మాన్ని విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసులు, అధికారులు మూల్యం చెల్లించక తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. అనంతరం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ పోలీసు బాస్‌ కనుసన్నల్లోనే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు సాగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్, న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు.  

‘గెలుపునీదే’ పుస్తకావిష్కరణ
చిత్తూరు జిల్లా సదుం మండలంలోని ఎర్రాతివారిపల్లెలో ప్రముఖ రచయిత మర్రిపూడి దేవేంద్రరావు రచించిన ‘గెలుపునీదే’ పుస్తకాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ సీఎం కావడం తథ్యమన్నారు. వైఎస్‌ సేవలను స్మరిస్తూ, వైఎస్‌ జగన్‌ పోరాటాలను ప్రశంసిస్తూ, చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేసే పుస్తకం అని వివరించారు. బాబు పాలనలో వైఫల్యాలను  తెలియజేసేలా పుస్తకం రచించిన దేవేంద్రబాబును పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి అభినందించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top