ఎన్టీఆర్‌ ఆత్మక్షోభిస్తుంది

 Rajnath Singh criticises Telangana government over minority quota - Sakshi

కాంగ్రెస్‌తో టీడీపీ అపవిత్ర పొత్తు: రాజ్‌నాథ్‌సింగ్‌

తెలంగాణకు రూ.లక్ష 15 వేల కోట్లు ఇచ్చామని వెల్లడి 

మైనార్టీలకు రిజర్వేషన్‌ సరైందికాదని వ్యాఖ్య

జహీరాబాద్‌/సాక్షి, వనపర్తి /నాగర్‌కర్నూల్‌: కాంగ్రెస్, టీడీపీ పొత్తుతో దివంగత ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. గురువారం  సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు.  ఎన్టీ ఆర్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించారని గుర్తు చేశారు.  ప్రస్తుతం  చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, ఇది అపవిత్రమైన కలయిక అని రాజ్‌నాథ్‌ అభివర్ణించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు సరిగా అభివృద్ధి చెందక పోవడానికి ఇరు రాష్ట్రాల నేతల మధ్య విభేదాలే కారణమన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం రూ.లక్ష 15వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపడం లేదని, ఇచ్చిన నిధులను ఎక్కడికి మళ్లించారో కూడా చెప్పడం లేదని విమర్శించారు.  

కేసీఆర్‌ చేసిందేమీ లేదు
కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు చేస్తున్న మేలు ఏమీ లేదని రాజ్‌నాథ్‌ అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని  చెప్పారు. కేంద్రం పంటలకు గిట్టుబాటు ధర పెంచిందని, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రధాని ముందుకెళ్తున్నారన్నారు.  మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది సరైన విధానం కాదన్నారు. ఎవరిని కొట్టి ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు.   

ఆశ్చర్యపోయా..
కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని విని ఆశ్చర్యపోయాయనని రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో బీజేపీ అభ్యర్థి దిలీపాచారి నిర్వహించిన ‘మార్పు కోసం బీజేపీ’సభతో పాటు వనపర్తిలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో బీజేపీ అభ్యర్థి అమరేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభల్లో ఆయన  మాట్లాడారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం టీడీపీ చేసిన పెద్ద తప్పిదమన్నారు. మోదీని అధికారంలోకి రాకుండా చేసేందుకే ఈ అపవిత్ర కలయిక అని ధ్వజమెత్తారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top