అపరిపక్వతతోనే రాహుల్‌ ఆరోపణలు

Rahuls allegations are immoral - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అపరిపక్వతతోనే ప్రధాని నరేంద్రమోదీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఆయన మాటలు నమ్మి మోసపోయేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, రాఫెల్‌ యుద్ధవిమానాల విషయంలో ఆయన తప్పుడు ప్రచారం చేస్తున్నారని లక్ష్మణ్‌ చెప్పారు. హైదరాబాద్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ రెండు రోజుల రాష్ట్ర పర్యటనపై కాంగ్రెస్‌ పార్టీ పగటి కలలు కంటోందన్నారు. అభ్యర్థులు లేక ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని ఎద్దేవా చేశారు.

నాడు 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. రాహుల్‌ వచ్చిన తర్వాత పంజాబ్‌కే పరిమితం అయిందన్నారు. ఎన్‌ఆర్సీ, చొరబాటుదారుల పట్ల రాహుల్‌ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్ల మోదీ పాలనలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి, 40 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా అని రాహుల్‌కు సవాల్‌ విసిరారు. కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేస్తామన్నారు. సామాజిక న్యాయం, ఆయుష్మాన్‌ భారత్‌పై ఈ నెల 17 నుంచి సెప్టెంబర్‌ 17వరకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. 

ముందస్తుతో ఇంటికే  
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాటలకు చేతలకు సంబంధం లేదని, ముందస్తు ఎన్నికల పాట పాడుతున్న కేసీఆర్‌ను ప్రజలు ముందుగానే ఇంటికి పంపుతారని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడూ జరిగినా మోదీ ప్రజాకర్షణ, విధానాలు, పథకాలే బీజేపీని గెలిపిస్తాయన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, మజ్లిస్‌ ఒకే గూటి పక్షులన్నారు. సీఎం కేసీఆర్‌ తన వైఫల్యాలు కప్పి పుచ్చుకోవడానికే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top