30 గంటలు... 3 సభలు

Rahul Gandhi State tour schedule is finalized - Sakshi

     రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారు

     సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు ఏఐసీసీ చీఫ్‌

     తొలిరోజు ఎస్‌ఎస్‌జీ మహిళలు, సెటిలర్లతో వేర్వేరుగా సభలు

     అనుమతి ఇవ్వకపోవడంతో ఓయూ సందర్శన రద్దు

     రెండోరోజు ‘విద్యార్థి,నిరుద్యోగ గర్జన’ సభకు హాజరు

     మంగళవారం రాత్రి ఢిల్లీకి తిరుగు పయనం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోనున్న రాహుల్‌... 14న రాత్రి 8:30 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. మొత్తం 30 గంటలపాటు హైదరాబాద్‌లో ఉండనున్న ఆయన మూడు సభల్లో పాల్గొంటారు. ఈ మేరకు రాహుల్‌ షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి. కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీలతో కలసి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం గాంధీ భవన్‌లో విడుదల చేశారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం సోమవారం సాయంత్రం రాజేంద్ర నగర్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంతో రాహుల్‌ పర్యటన ప్రారంభం కానుంది. అనంతరం శేరిలింగంపల్లిలో సెటిలర్లతో సమావేశమవుతారు. రాత్రి హరిత ప్లాజాలో బస చేసి మర్నాడు ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

ఓయూ బదులు గర్జన సభకు... 
వాస్తవానికి ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లి అక్కడి విద్యార్థులతో సమావేశమయ్యేలా రాహుల్‌ పర్యటనను టీపీసీసీ రూపొందించింది. అయితే ›భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమావేశానికి అనుమతి ఇచ్చేందుకు ఓయూ జాయింట్‌ డెరెక్టర్‌ నిరాకరించడంతో రాహుల్‌ ఓయూ సందర్శనను పార్టీ రద్దు చేసింది. దాని స్థానంలో సరూర్‌నగర్‌ స్టేడియంలో ‘విద్యార్థి నిరుద్యోగ గర్జన’సభను ఏర్పాటు చేసింది. తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఈ సభకు విద్యార్థులు, యువత హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.

పార్టీ కార్యకర్తలతోనూ రాహుల్‌ మాట్లాడనున్నారు. మంగళవారం ఉదయం ఆయన దాదాపు 35 వేల మంది బూత్‌ కమిటీ, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్లతో ఏకకాలంలో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. చార్మ్స్‌ పేరుతో టీపీసీసీ నిర్వహిస్తున్న టెలి కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ కార్యకర్తలకు రాహుల్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఆ తర్వాత ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాలకు చెందిన ఎడిటర్లతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అలాగే పారిశ్రామిక రంగానికి చెందిన యువ సీఈవోలతో సమావేశం కానున్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా రాహుల్‌ షెడ్యూల్‌లో చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన గన్‌పార్కు వద్ద అమరవీరుల స్థూపాన్ని సందర్శించనున్నారు. 

టీఆర్‌ఎస్‌ విధానాలను రాహుల్‌ ఎండగడతారు: ఉత్తమ్‌ 
కల్లిబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి న టీఆర్‌ఎస్‌ గత నాలుగేళ్లుగా తెలంగాణ సమాజానికి చేసిన దగాను రాహుల్‌ తన పర్యటనలో ఎండగడతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా లోకానికి ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ చేసిన మోసాలను స్వయం సహాయక సంఘాల మహిళలతో జరిగే సమావేశంలో ప్రస్తావిస్తారన్నారు. రాహుల్‌ను ఓయూకు రావాలంటూ వర్సిటీ విద్యార్థులే అడిగి అనుమతులు కోరారని, అయినా ప్రభుత్వం రాహుల్‌ను ఉస్మానియాకు రాకుండా అడ్డుకునేందుకే అనుమతి నిరాకరించింద ని ఉత్తమ్‌ ఆరోపించారు. తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత సెటిలర్లతో శేరిలింగంపల్లి సభలో రాహుల్‌ మాట్లాడి వారికి భరోసా కల్పిస్తారన్నారు. రాహుల్‌ పర్యటనను విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్‌కు పిలుపునిచ్చారు.

13న ఓయూ బంద్‌: విద్యార్థి జేఏసీ 
ఆర్ట్స్‌ కాలేజీ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం 
హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీ ఓయూ సందర్శనకు వర్సిటీ అనుమతి నిరాకరించడంపై ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు భగ్గుమన్నారు. ఆర్ట్స్‌ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకొని కేసులు నమోదు చేశారు. రాహుల్‌ ఓయూ సందర్శనకు నిరాకరణ వెనుక సీఎం కేసీఆర్‌ హస్తం ఉందని విద్యార్థి జేఏసీ నేత పున్న కైలాశ్‌ ఆరోపించారు. రాహుల్‌ ఓయూకు వస్తే టీఆర్‌ఎస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయరనే ఉద్దేశంతో వీసీపై ఒత్తిడి తెచ్చి రాహుల్‌ ఓయూ క్యాంపస్‌లోకి రాకుండా టీఆర్‌ఎస్వీ శ్రేణులు అడ్డుపడ్డాయని దుయ్యబట్టారు. ఇందుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన తెలుపుతామన్నారు. ఈ నెల 13న ఓయూ బంద్‌కు పిలుపునిచ్చిచ్చారు.

రాహుల్‌ పర్యటన షెడ్యూల్‌ ఇలా... 
13–08–2018 (సోమవారం) 
మధ్యాహ్నం 2:30: శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరిక. 
2:30–2:45: ఎయిర్‌పోర్టులో పలువురు కాంగ్రెస్‌ నేతలకు పలకరింపు. 
2:45–3:15: ప్రత్యేక బస్సులో రాజేంద్రనగర్‌లోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు పయనం 
3:15–4:15: స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం 
సాయంత్రం 4:15–5:15: క్లాసిక్‌ కన్వెన్షన్‌ నుంచి శేరిలింగంపల్లికి పయనం. 
5:15–6:15: శేరిలింగంపల్లి నియోజకవర్గ సమావేశం (శాంక్టా మారియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పక్క గ్రౌండ్‌లో) 
6:30: గ్రౌండ్‌ నుంచి హోటల్‌కు పయనం. 
రాత్రి 7:15: హరిత ప్లాజ్‌కు చేరుకుని రాత్రికి బస. 
14–08–2018 (మంగళవారం) 
ఉదయం 9:00–9:15: పార్టీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌ బేరర్లతో టెలి కాన్ఫరెన్స్‌ 
9:15–10:30: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్య కాంగ్రెస్‌ నేతలతో చర్చలు. 
10:30–11:30: ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన ఎడిటర్లతో ముఖాముఖి. 
11:30: హరిత ప్లాజా నుంచి తాజ్‌ కృష్ణ హోటల్‌కు పయనం. 
12:00–1:00: తాజ్‌కృష్ణలో పారిశ్రామిక రంగానికి చెందిన యువ సీఈవోలతో సమావేశం. 
మధ్యాహ్నం 1:00–2:30: తాజ్‌ కృష్ణ నుంచి హరిత ప్లాజాకు చేరుకొని మధ్యాహ్న భోజనం, విశ్రాంతి (రిజర్వ్‌డ్‌) 
2:30–3:00: హరిత ప్లాజా నుంచి బస్సులో గన్‌పార్క్‌కు రాక. 
3:00–3:15: గన్‌పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళి. 
3:15–3:30: అక్కడి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు పయనం. 
3:30–4:30: గోషా మహల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలతో సమావేశం, చిరు వ్యాపారులతో భేటీ. 
4:30–5:30: బస్సులో సరూర్‌నగర్‌ స్టేడియంకు రాక. 
5:30–7:00: ‘విద్యార్థి, నిరుద్యోగ గర్జన’బహిరంగ సభకు హాజరు. 
7:00–7:45: సరూర్‌నగర్‌ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి... 
8:30: ఢిల్లీకి తిరుగు పయనం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top