బలమైన సీట్లను వదులుకోం

Rahul Gandhi says no compromise on winning seats - Sakshi

పొత్తులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదు

రాహుల్‌తో భేటీ అనంతరం కుంతియా, ఉత్తమ్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ అధినేతతో రాష్ట్ర సీనియర్‌ నేతల భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించారని, అయితే బలమైన స్థానాలను వదులుకోవద్దని చెప్పారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌ ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌లో శుక్రవారం ఉదయం రాహుల్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా సమావేశమయ్యారు.

అనంతరం కుంతియా మాట్లాడుతూ.. ‘తెలంగాణ సీనియర్‌ నేతలతో రాహుల్‌ భేటీ అయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సహా మొత్తం 38 మంది హాజరయ్యారు. విడివిడిగా, సమూహంగా అందరితో ఆయన మాట్లాడారు. కలసికట్టుగా పనిచేయాలని, భేదాభిప్రాయాలుంటే తరువాత మాట్లాడుకోవచ్చని సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను టీపీసీసీ అధ్యక్షుడికి, ఏఐసీసీ ప్రతినిధులకు, తనకు కూడా చెప్పొచ్చన్నారు.

మీడియా ముందు ఎవరిపైనా వ్యతిరేకంగా మాట్లాడొద్దని, పార్టీ ప్రయోజనాలకు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ అయినా భావసారూప్యత గల పార్టీలు, వామపక్ష పార్టీలు ఏవైనా పొత్తులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని రాహుల్‌ చెప్పారు. కేసీఆర్‌ తుగ్లక్‌ పాలన, హిట్లర్‌ పాలన అంతానికి ఎవరైతే పొత్తుకు కలసి వస్తారో వారితో పొత్తు పెట్టుకునేందుకు మేం సిద్ధం. రాష్ట్రంలో రాహుల్‌ ప్రచారంపై మరోసారి లోతుగా చర్చిస్తాం’అని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్వహించే ఎన్నికల సభలో ఒకదానిలో సోనియా కూడా పాల్గొంటారని కుంతియా చెప్పారు.

ఉత్సాహాన్ని నింపింది..: ఉత్తమ్‌
తెలంగాణలో కాంగ్రెస్సే గెలుస్తుందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ముఖ్య నేతలంతా రాహుల్‌కు తెలిపారు. అందరిలోనూ ఈ సమావేశం ఉత్సాహం నింపింది. ఇది ఒక పెద్ద సానుకూల పరిణామం. ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీలు త్వరలోనే ఏర్పాటు చేస్తాం. దేశంలో ఏ పౌరుడు ఎక్కడ నివసించినా వారికి సమాన హక్కులుంటాయి. తెలంగాణలో నివసించే ఆం్ర«ధా సోదరులకు కూడా అవే హక్కులు ఉంటాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా దానికి కట్టుబడి ఉంది. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వారికి జనాభా దామాషా లెక్కన సముచిత గౌరవం ఇస్తాం. గెలిచే అవకాశాలు ఉంటే ఆం్ర«ధా ప్రాంత అభ్యర్థిత్వాలను పరిశీలిస్తాం.

హాజరైన నేతలు వీరే..
ఏఐసీసీ అధికార ప్రతినిధి జైపాల్‌ రెడ్డి, ప్రతిపక్ష నేత జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క, పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి కార్యదర్శులు సలీంఅహ్మద్, బస్వరాజ్, శ్రీనివాసన్, ఏఐసీసీ కార్యదర్శులు వి.హన్మంతరావు, మధుయాష్కీ గౌడ్, సంపత్‌కుమార్, మాజీ మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ ఉప నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీతో పొత్తుపై మీ అభిప్రాయమేంటి!
రాహుల్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఫోన్‌
సాక్షి, హైదరాబాద్‌: రాజకీయంగా బద్ధ శత్రువైన టీడీపీతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటున్న నేపథ్యం లో ఆ పార్టీ హై కమాండ్‌ అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. నేరుగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కార్యాలయమే ఇందుకు రంగంలోకి దిగింది. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలతో ఫోన్‌లో సంప్రదించి వారి అభిప్రాయాన్ని సేకరిస్తోంది. రాహుల్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ రావడానికి ముందే ఎవరి అభిప్రాయం తీసుకోవాలనుకుంటున్నారో వారికి ‘ప్రియమైన మిత్రమా.. ఢిల్లీ నుంచి కొద్దిసేపట్లో మీకు ఒక ముఖ్యమైన ఫోన్‌కాల్‌ రానుంది.

రిసీవ్‌ చేసుకొని స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా’అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరు మీద మెసేజ్‌ వస్తోంది. ఈ మెసేజ్‌ వచ్చిన కొద్దిసేపటికే రాహుల్‌ కార్యాలయం నుంచి ఫోన్‌ వస్తోంది. ఫోన్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకుంటూ వాటిని నమోదు చేస్తున్నారు. దీని ద్వారా పొత్తుపై ఏయే ప్రాంతాల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది.. ఎంతమంది సానుకూలంగా ఉన్నారనే అంచనా వేయనున్నట్లు టీపీసీసీ వర్గాలు తెలిపాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top