సమష్టిగా పనిచేస్తే గెలుస్తాం: రాహుల్‌

Rahul gandhi met with party key leaders - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి మంచి స్పందన కనిపిస్తోందని.. అందువల్ల నేతలంతా విభేదాలు పక్కనబెట్టి సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచించారు. శనివారం మూడు ఎన్నికల సభల్లో పాల్గొన్న అనంతరం ఢిల్లీ వెళ్తూ.. బేగంపేట విమానాశ్రయంలో పార్టీ కీలక నేతలతో ఆయన సమావేశమయ్యారు.

మూడు జిల్లాల పర్యటనలో వచ్చిన స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశా రు. వ్యక్తిగత ఎజెండాలు పెట్టుకోకుండా సమష్టిగా పనిచేస్తూ సీనియర్లను కలుపుకుని వెళ్లాలన్నారు. రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, విజయశాంతి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రేణుకాచౌదరి, మధుయాష్కీ, గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులతో రాహుల్‌ చర్చించారు.

పొత్తు ఉండాల్సిందే.. కానీ!
రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల్లో పోటీ, పొత్తు విషయాలను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. పొత్తులతోనే రాష్ట్రంలో లాభం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గెలిచే సీట్లను మాత్రం వదులుకోవద్దని, పూర్తిగా ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇంతలో పొంగులేటి సుధాకర్‌ జోక్యం చేసుకుంటూ ఏడు రాష్ట్రాల్లో రాజీవ్‌ సద్భావన యాత్రను భుజాన వేసుకుని నిర్వహిస్తున్నానని.. కానీ హైదరాబాద్‌లో కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చారు.

దీనిపై రాహుల్‌ ఆరా తీయగా.. పలువురు సీనియర్లు పొంగులేటికి మద్దతు తెలిపారు. టీపీసీసీ ఎన్నికల వ్యూహలు, ప్రణాళిక కమిటీ చైర్మన్‌ హోదాలో తనకు కనీస ప్రాధాన్యత ఇవ్వలేదంటూ వీహెచ్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఈ నెల 27న రాహుల్‌ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈసారి వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో సభలు నిర్వహించేలా టీపీసీసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వీటితోపాటు ఖమ్మంలోనూ మరొక సభ నిర్వహించే అంశంపై పార్టీ నేతలు యోచిస్తున్నారు. రాహుల్‌ వచ్చి వెళ్లాక సోనియాగాంధీ పర్యటన ఉండే అవకాశం ఉందని టీపీసీసీ నేతలు వెల్లడించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top