గాంధీల దక్షిణాపథం

Rahul Gandhi Contest From Wayanad Lok Sabha Election - Sakshi

సంక్షోభం వచ్చినప్పుడల్లా వలస వస్తున్న గాంధీ కుటుంబం

ఇప్పుడు వయనాడ్‌ నుంచి రాహుల్‌ పోటీకీ అదే కారణం

గాంధీల కుటుంబానికి సంక్షోభం వచ్చినప్పుడల్లా ‘దక్షిణం వైపు’ చూడడం ఆనవాయితీగా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ బలపడడంతో కాంగ్రెస్‌ అధినేతలు చాలా కాలంగా గ్యారంటీ సీటు కోసం దక్షిణాది రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఇప్పుడు కూడా అమేథీలో రాహుల్‌గాంధీపై బీజేపీ అభ్యర్థిగా మళ్లీ స్మృతి ఇరానీని పోటీగా నిలపడంతో మరో సీటు వెతుక్కునే అవసరం కలిగింది. గత ఎన్నికల్లోనే రాహుల్‌ మెజారిటీని గణనీయంగా తగ్గించడంలో స్మృతి విజయం సాధించారు. ఇప్పుడు విపక్షాలు విడివిడిగా పోటీచేస్తుండడంతో ఓటమి భయంతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు దక్షిణాదికి పారిపోతున్నారని బీజేపీ ప్రచారం మొదలుపెట్టింది. మరి ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి దక్షిణాది అండగా నిలుస్తుందా? అన్నది ప్రశ్నార్థకం.

ఆది నుంచీ దక్షిణాదే అండదండ
ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క దక్షిణాది రాష్ట్రాల్లో మినహా దేశవ్యాప్తంగా ఓడిపోయింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో ఘన విజయం సాధించింది. తమిళనాట మిత్రపక్షం అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని మంచి ఫలితాలు సొంతం చేసుకుంది. 1978లో కాంగ్రెస్‌ చీలిక తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇంది రాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌–ఐ ఘన విజయం సాధించి తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్‌ను నిజమైన కాంగ్రెస్‌గా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు గుర్తించారు.

చిక్కమగళూరులో ఇందిర విజయం
సొంత స్థానం యూపీలోని రాయ్‌బరేలీలో ఓడిపోయిన ఏడాదిన్నరకే ఇందిరాగాంధీని మళ్లీ లోక్‌సభకు పంపిన ఘనత కర్ణాటకకు దక్కింది. చిక్కమగళూరు కాంగ్రెస్‌ సభ్యుడు డీబీ చంద్రగౌడతో రాజీనామా చేయించాక 1978 నవంబర్‌లో జరిగిన లోక్‌సభ ఉప ఎన్నికలో ఇందిర పోటీచేసి గెలిచారు. జనతా పార్టీ టికెట్‌పై పోటీచేసిన మాజీ సీఎం వీరేంద్రపాటిల్‌ను 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. ఆమెకు 68 శాతం ఓట్లు పడ్డాయి. ఇలా కాంగ్రెస్‌కు ఇంకా చెప్పాలంటే నెహ్రూ–గాంధీ కుటుంబానికి దక్షిణాది అండగా నిలిచిన రోజులవి. లోక్‌సభ రద్దుతో 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఇందిర తనను ఓడించిన రాయ్‌బరేలీ నుంచేగాక ఆంధ్రప్రదేశ్‌లోని (ప్రస్తుత తెలంగాణ) మెదక్‌ నుంచి కూడా లోక్‌సభకు పోటీ చేశారు. మెదక్‌లో ఆమె జనతాపార్టీ అభ్యర్థి ఎస్‌ జైపాల్‌రెడ్డిపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. జైపాల్‌కు పోలైన ఓట్లలో కేవలం 18.5 శాతం ఓట్లు దక్కాయి.

గుల్బర్గాలో ఇందిర విధేయుడు
1980 లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానంలో బీజేపీ నేత (జనతా టికెట్‌పై) అటల్‌ బిహారీ వాజ్‌పేయిని ఓడించాలనే లక్ష్యంతో తన విధేయుడైన సీనియర్‌ నేత సీఎం స్టీఫెన్‌ను ఇందిర కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెట్టారు. కేరళకు చెందిన క్రైస్తవుడైన స్టీఫెన్‌ 5,045 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1977లో కేరళలోని ఇడుక్కి నుంచి గెలిచిన స్టీఫెన్‌ను తప్పక లోక్‌సభకు తీసుకురావాలనే లక్ష్యంతో ఆమె కర్ణాటకలోని గుల్బర్గా (అప్పుడు జనరల్‌ సీటు) నుంచి అప్పుడే గెలిచిన కాంగ్రెస్‌ సభ్యుడు ఎన్‌.ధరమ్‌సింగ్‌తో రాజీనామా చేయించారు. గుల్బర్గా సీటుకు జరిగిన ఉప ఎన్నికలో స్టీఫెన్‌ పది వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. స్టీఫెన్‌ పొరుగు రాష్ట్రానికి చెందిన మలయాళీ అనే విషయం మరుగున పడేలా చేయడానికి ఆయనను తిప్పన్నగా కాంగ్రెస్‌ మాజీ «ఎన్‌.ధరమ్‌సింగ్, ఇతర కాంగ్రెస్‌ నేతలు ఓటర్లకు పరిచయం చేశారు. ఇలా ఇందిరను, ఆమె విధేయుడిని కన్నడ ప్రజలు పార్లమెంట్‌కు పంపారు.

బోఫోర్స్‌ను పట్టించుకోని దక్షిణాది
రాజీవ్‌గాంధీ ఐదేళ్ల పాలన తర్వాత బోఫోర్స్‌ కుంభకోణం కారణంగా ఉత్తరాదిలో కాంగ్రెస్‌ పరాజయం పాలైంది. అయితే, దక్షిణాదిలోని అత్యధిక సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్‌ పరువు కాపాడుకుంది. నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకే మెజారిటీ లోక్‌సభ సీట్లు దక్కాయి. కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సొంత స్థానం అమేథీ నుంచేగాక కర్ణాటకలో కాంగ్రెస్‌కు కంచుకోటగా దశాబ్దాల పాటు నిలిచిన బళ్లారి (అప్పుడు జనరల్‌ సీటు)లో కూడా పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ను సోనియా 56 వేల ఓట్ల మెజారిటీతో ఓడించారు. బళ్లారిలో 1952 నుంచి 1998 వరకూ కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలవడంతో సోనియా ఇక్కడి నుంచి పోటీచేశారు.

కాంగ్రెస్‌ కంచుకోట వయనాడ్‌?
2008 నియోజకవర్గాల పునర్విభజనతో కేరళలో కొత్తగా ఉనికిలోకి వచ్చిన వయనాడ్‌లో వరుసగా 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఐ శనవాస్‌ విజయం సాధించారు. 2009లో లక్షన్నర, 2014లో 20 వేలకు పైగా ఓట్లతో సీపీఐ అభ్యర్థులను ఓడించారు. నియోజకవర్గంలో ముస్లిం, క్రైస్తవ ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉండడం కూడా రాహుల్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. వయనాడ్‌లో ప్రస్తుత సీపీఐ అభ్యర్థి పీపీ సునీర్‌పై రాహుల్‌ గెలిస్తే పాత ఆనవాయితీ ప్రకారం దక్షిణాది ఇందిర కుటుంబాన్ని మరోసారి ఆదరించినట్టవుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top