అక్కడా, ఇక్కడా వచ్చేది మేమే

Rahul Gandhi Comments On State And Central Govt - Sakshi

     ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ధీమా 

     రాష్ట్రంలో, కేంద్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజం 

     స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలంగాణలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తామేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘మోదీలా అబద్ధాలు చెప్పం. ఏది చెబుతామో.. అదే చేసి చూపిస్తాం. ఇటు హైదరాబాద్‌లో, అటు ఢిల్లీలో వచ్చేది మా ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం’’ అని ఆయన హామీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో స్వయం సంఘాల మహిళలతో రాహుల్‌ ముఖాముఖి మాట్లాడారు. ‘‘తెలంగాణలో కుటుంబపాలన సాగుతోంది. ఆ కుటుంబానికే అన్నీ దక్కుతున్నాయి. రైతుల భూములను లాక్కుంటున్నారు. మహిళలకు రక్షణలేదు. ఎక్కడ చూసినా అవినీతే’’అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. రుణాలివ్వకుండా, వడ్డీభారం మోపుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలను నీరుగారుస్తోందని విమర్శించారు. పొదుపు సంఘాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మహిళాశక్తిని పట్టించుకోవడం లేదన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం రెండేళ్లలో 15 మంది బడా పారిశ్రామికవేత్తలకు రూ.2.5 లక్షల కోట్ల రుణం మాఫీ చేసింది. ఈ సొమ్మంతా పేదలది. బడాబాబులకు రుణమాఫీ చేసిన ఎన్డీఏ సర్కారు రైతులు, మహిళా రుణాలను మరిచిపోయింది’’అని మండిపడ్డారు. 

మీరు దేశానికే ఆదర్శం 
స్వయం సహాయక సంఘాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నిలిచిందని రాహుల్‌ అన్నారు. ‘‘పదేళ్ల క్రితం రాయ్‌బరేలి, అమేథిలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి అధికారులను పిలిపించి మాట్లాడాం. యూపీలో డ్వాక్రా సంఘాల నిర్వహణ సాధ్యపడదని అధికారులు తేల్చేశారు. దీంతో స్వయం సహాయక గ్రూపులు ఎక్కడ బాగా పనిచేస్తున్నాయని ఆరా తీస్తే.. తెలంగాణలో అని చెప్పారు. ఈ రాష్ట్ర మహిళలను యూపీకి పిలిపించి సంఘాల నిర్వహణపై అవగాహన కల్పించాం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పది లక్షల స్వయం సహాయక సంఘాలు సమర్థంగా పని చేస్తున్నాయంటే ఆ ఘనత మీదే’అని కొనియాడారు.  

స్త్రీలకు రక్షణేదీ? 
‘‘బేటీ బచావో.. బేటీ పడావో అని మోదీ అంటారు. మరోవైపు బీజేపీ నేతలే అత్యాచారాలు చేస్తారు. యూపీలో ఆ పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం చేస్తే మాట్లాడరు. బిహార్‌లో చిన్నపిల్లలపై జరుగుతున్న అకృత్యాలు ఆయనకు కనబడవు. ఈ ప్రభుత్వంలో స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది’’ అని రాహుల్‌ విమర్శించారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నెరేళ్ల శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, బోసురాజు, జాతీయ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుస్మితా దేవ్, నేతలు జానారెడ్డి, నంది ఎల్లయ్య, షబ్బీర్‌అలీ, రేవంత్‌రెడ్డి, సర్వే, కోమటిరెడ్డి బ్రదర్స్, సబిత, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, బండా కార్తీకారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మహిళలతో రాహుల్‌ ముఖాముఖి 
అభయహస్తం లేదు..
ప్రభుత్వం అభయహస్తం పింఛన్లు ఇవ్వడం లేదు. 60 ఏళ్లు నిండిన వారికి అభయహస్తం ఆసరాగా ఉండేది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చేవారు. బ్యాంకులు ఇప్పుడు స్వయం సహాయక సంఘాలను పట్టించుకోవడం లేదు. రుణాలే ఇవ్వడం లేదు.  
– మాధవి, ఆర్‌సీపురం, సంగారెడ్డి 

రాహుల్‌: అధికారంలోకి రాగానే అభయహస్తం పునరుద్ధరిస్తాం. డ్వాక్రా రుణాలపై వడ్డీని మాఫీ చేస్తాం. రూ.10 లక్షల గ్రాంటును మంజూరు చేస్తాం. చిరువ్యాపారులను ప్రోత్సహిస్తాం. 

 మీ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తారా?
మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదు. వాటితో కొంత స్వయం ఉపాధికి అవకాశముండేది. నిరుపేదలు ఉన్నత విద్య చదివినా ఉద్యోగ అవకాశాలు లేవు. ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మీ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు ఇస్తారా? 
– రేణుక, మదనపల్లి 
రాహుల్‌: మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయి. మేం అధికారంలోకి వస్తే ఉద్యోగ, ఉపాధికి పెద్దపీట వేస్తాం. 

ప్రోత్సాహం అందలేదు..
మండల స్థాయిలో స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసే బుక్‌ కీపర్లకు గతంలో రెండు నెలలకోసారైనా ప్రోత్సాహం అందేది. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు గడిచినా చెల్లించడం లేదు. చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి జీఎస్‌టీ పడుతుంది. దీంతో అప్పులు పెరుగుతున్నాయి. 
– అనిత, నిజామాబాద్‌ 
రాహుల్‌: జీఎస్టీ అంటే గబ్బర్‌సింగ్‌ ట్యాక్స్‌. ఈ పన్ను కింద రిటర్న్‌ దాఖలు చేయడం అంత ఈజీ కాదు. వివిధ రకాలుగా ఉన్న శ్లాబులను ఎత్తేస్తాం. ఒకే పన్ను విధానం అమలు చేస్తాం.

ఫొటో ముచ్చట తీర్చిన రాహుల్‌ 
‘‘ఎస్సీ, ఎస్టీలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే మహిళా సంఘాలకు రుణాలు అందేవి’’అంటూ కొడంగల్‌ నియోజకవర్గం మద్దూరు మండలం మల్ల గడ్డ తండాకు చెందిన కేస్లీబాయి వివరించింది. ‘‘నీవు ఎక్కడి నుంచి వచ్చావమ్మా’’అని రాహుల్‌ అడగ్గా.. తాను వచ్చిన ఊరు గురించిన చెప్పిన కేస్లీబాయి ‘సార్‌ మీతో ఓ ఫొటో దిగుతాను’’అని అడిగింది. అందుకు రాహుల్‌ కూడా ఓకే చెప్ప డంతో ఆమె వేదికపైకి వెళ్లింది. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాక రాహుల్‌ ఫొటో దిగారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top