మోదీ, కేసీఆర్‌ ఒక్కటే

Rahul Gandhi Comments On Narendra Modi And KCR - Sakshi

వీరి మధ్య పరస్పర విమర్శలు పెద్ద డ్రామా: రాహుల్‌ గాంధీ

టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఆరెస్సెస్, బీజేపీలకు వేసినట్టే

మోదీలా పేదలపైకాదు.. పేదరికంపై మా సర్జికల్‌ స్ట్రైక్స్‌

జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌ ఎన్నికల సభల్లో రాహుల్‌

ఐదు కోట్ల మంది పేదలకు ఏటా రూ.72 వేలిస్తాం

జీడీపీలో 6% విద్య, వైద్య రంగాలకు కేటాయిస్తామని ప్రకటన

ప్రాజెక్టుల రీ–డిజైనింగ్‌తో కేసీఆర్‌ దోపిడీ చేస్తున్నారని ఆరోపణ

పీఎం, సీఎం.. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని విమర్శ

దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సత్తా తమకుందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు భాగస్వాములని, ఎన్నికలకు ముందు ఒకర్నొకరు విమర్శించుకోవడం పెద్ద డ్రామా అని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ ఆరోపించారు. ‘మోదీ ఏం చేసినా కేసీఆర్‌ తప్పుపట్టరు. కనీసం రఫేల్‌ కుంభకోణం గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కాపలాదారు దొంగ అని అనలేదు’ అని రాహుల్‌ విమర్శించారు. నరేంద్రమోదీ, బీజేపీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నది కాంగ్రెస్‌ మాత్రమేనని చెప్పిన రాహుల్‌.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఆరెస్సెస్, బీజేపీకి వేసినట్టే అన్నారు. సోమవారం జహీరాబాద్, వనపర్తి, హుజూర్‌నగర్‌ల్లో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. మోదీ పేదలపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేస్తే తాను పేదరికంపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తానని.. దేశంలో పేదరికాన్ని తుడిచిపెడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోందన్నారు. ఒకరిపై ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టి, దేశసంపదను 15–20 మంది పారిశ్రామికవేత్తలకు పంచిపెట్టేది ఒక సిద్ధాంతమయితే, అందరి ప్రయోజనాలు కాపాడి, అందరికీ అండగా ఉండి, దేశాన్ని ఐక్యం చేసేది మరో సిద్ధాంతమని కాంగ్రెస్‌ చీఫ్‌ పేర్కొన్నారు. ఈ రెండు సిద్ధాంతాల్లో ఏది మంచిదో గుర్తెరిగి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని రాహుల్‌ ధీమా వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ సభలో రాహుల్‌ ప్రసంగం ముఖ్యాంశాలు..
 
దొంగలకు దోచిపెడుతున్నారు
‘కష్టకాలంలో ఇక్కడకు వచ్చినప్పుడు.. మా నాయనమ్మ ఇందిరమ్మను ఆదరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేశాన్ని ఇప్పుడు పాలిస్తోంది చౌకీదార్‌ (కాపలాదారు) కాదు. ఆయన చోర్‌కీ చౌకీదార్‌ (దొంగలకు కాపలాదారు). ప్రతి ఒక్కరి బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.15లక్షలు వేస్తానని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని, రైతు రుణమాఫీ చేస్తానని ఎన్నికల్లో మోదీ హామీ ఇచ్చారు. కానీ ఎవరి అకౌంట్‌లలో రూ.15లక్షలు పడలేదు. ఉద్యోగాల కల్పన లేదు. రైతు రుణమాఫీకి దిక్కులేదు. ఆయన 15లక్షలు ఇస్తానని చెప్పినప్పుడే ఇవ్వడనీ, ఆయన చెపుతున్నది అబద్ధమని నాకు తెలుసు. అందుకే ఆయనకు 15లక్షల లాగా నాకూ ఓ నెంబర్‌ కావాలి. అదేంటా అని ఆరునెలలు కసరత్తు చేశాం. చివరకు మాకు కూడా నెంబర్‌ దొరికింది. ఆ నెంబరే 72,000. దేశంలోని పేదలందరికీ నెలకు రూ.12వేలకు తగ్గకుండా ఆదాయం కల్పిస్తా. ఏటా రూ.72వేలు దేశంలోని 5 కోట్ల కుటుంబాల బ్యాంకు అకౌంట్లలో వేస్తా. అది ఐదేళ్లలో 3.6లక్షలవుతుంది. నేను మీకు అబద్ధాలు చెప్పను. నెలకు ఆదాయం రూ.12వేల కన్నా తక్కువ ఉంటే దాన్ని ఇచ్చే నేనే బాధ్యత నాదే’అని రాహుల్‌ భరోసా ఇచ్చారు.
 
ఉద్యోగాలు లాక్కుంటున్నాడు
దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మోదీకి రైతుల గోడు పట్టదు. ఆయన చెప్పిన విధంగా ఏటా 2కోట్ల ఉద్యోగాలు కల్పించాలంటే రోజుకు 50వేల ఉద్యోగాలు కల్పించాలి. కానీ, మోదీ ఉద్యోగాలు ఇవ్వడం సంగతి పక్కనపెట్టి రోజుకు 27వేల ఉద్యోగాలు లాక్కుంటున్నారు. ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారు. నోట్ల రద్దు పేరుతో నల్లధనంపై యుద్ధం చేస్తున్నానన్నారు. పేదలందరినీ తమ డబ్బుల కోసం క్యూలైన్లలో నిలబడి నల్లధనంపై యుద్ధం చేయమన్నారు. ఆ లైన్లో ఒక్కరైనా నల్లధనం ఉన్న వారూ, దొంగలు, అనిల్‌అంబానీలు కనిపించారా? నోట్లరద్దుతో చిరువ్యాపారులు, పేదలు నష్టపోతారని చిన్న పిల్లలు కూడా చెబుతారు. కానీ, ఈ కాపలాదారుడికి ఆ ఆలోచన ఎందుకు రాలేదో అర్థం కావడం లేదు. ఆయన లక్ష్యమంతా ఒక్కటే. పేదల నుంచి డబ్బులు లాక్కుని ఆ 15–20 మంది పారిశ్రామికవేత్తల జేబుల్లో వేయాలి.

నోట్ల రద్దు ద్వారా నల్లధనాన్ని నియంత్రించలేకపోగా, బడా పారిశ్రామిక వేత్తల నల్లధనానికి చట్టబద్ధత కల్పించి వైట్‌మనీ చేశాడు. పారిశ్రామికవేత్తల గురించి ఆలోచించే ఈ కాపలాదారుడికి రైతులు, కార్మికులు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, చిరువ్యాపారుల ఆశలు కనిపించవు. తెలంగాణ రైతులు, కార్మికులు ఏం తప్పు చేశారు? మనకు రెండు భారతదేశాలు వద్దు. ఒకటే దేశం కావాలి. అందరికీ న్యాయం జరిగే భారత్‌ కావాలి. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. మేం అధికారంలోకి వచ్చాక స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో 6%శాతం విద్య, వైద్య రంగాలకు కేటాయిస్తాం. కొత్త కళాశాలలు, యూనివర్శిటీలు, విద్యాసంస్థలు స్థాపిస్తాం. మోదీ లాక్కున స్కాలర్‌షిప్‌లను తిరిగి ఇస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మిస్తాం. ప్రజల మధ్య మోదీ సృష్టించిన విద్వేషాలను నిర్మూలించి దేశాన్ని ఐక్యం చేస్తాం. పేదరికాన్ని తుడిచిపెడతాం’అని రాహుల్‌ అన్నారు.
 
కాపలాదారును విమర్శించాడా?
‘దొంగలకు కాపలాకాస్తున్న మోదీకి సీఎం కేసీఆర్‌ మద్దతిస్తాడు. జీఎస్టీ, నోట్ల రద్దుకు టీఆర్‌ఎస్‌ మద్దతుంటుంది. కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌ మోదీ చేతిలో ఉంది. అందుకే మోదీ చేప్పినట్లు కేసీఆర్‌ చేస్తారు. మోదీపై ఎవరు పోరాడుతున్నారు? కేసీఆర్‌ ఏ రోజైనా, ఎప్పుడయినా రాఫెల్‌ గురించి మాట్లాడారా? కాపలాదారు దొంగ అని అన్నారా? ఆయన అలా ఎప్పుడూ మాట్లాడడు. ఎందుకంటే వారిద్దరూ తోడుదొంగలు. అందుకే టీఆర్‌ఎస్‌ మోదీకి మద్దతిస్తుంది. కానీ, బీజేపీకి, నరేంద్రమోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మాత్రమే పోరాడుతుంది. ఎన్నికల ముందు మాత్రం సీఎంను పీఎం.. పీఎంను సీఎం విమర్శించుకుంటారు’అని రాహుల్‌ విమర్శించారు. ‘మనమంతా కలిసి టీఆర్‌ఎస్, మోదీలను ఓడించాలి. బీజేపీ, ఆరెస్సెస్‌లపై ఎవరు పోరాటం చేస్తున్నారో, వీరిని ఎవరు భయపెట్టగలరో అర్థం చేసుకోండి’అని అన్నారు.  
 
వాటిపై మోదీ మౌనం
మోదీ ఏరోజూ యువతకు ఉద్యోగాల గురించి, రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ అంబానీ అని పేరు పెట్టుకున్నందుకు ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్టు ఇచ్చి జీవితానికి సరిపడా దోచిపెట్టాడు. నేను దొంగల చేతుల్లో మోదీ పెట్టిన తాళం లాక్కుని దేశ యువత చేతిలో పెడతా. బ్యాంకులోన్లు ఇప్పించి యువతకు ఉపాధి కల్పిస్తా. 2019లో మేం అధికారంలోకి రాగానే యువత ఎలాంటి చిరు వ్యాపారాలైనా ప్రారంభించవచ్చు. ఇందుకోసం ముందుగానే లైసెన్సులు తీసుకోవాలని మేం ఇబ్బందులు పెట్టం. మూడేళ్ల తర్వాత అనుమతుల గురించి అడుగుతాం. ఆయా ప్రాంతాల్లో పండే పంటల ఆధారంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. పండిన పంట నేరుగా ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీలకే వెళుతుంది. అక్కడే మద్దతుధర లభిస్తుంది. అక్కడే నిల్వ సదుపాయాన్ని కల్పిస్తాం. రైతు తన ఇష్టం వచ్చినప్పుడు పంటను అమ్ముకోవచ్చు. నేను చివరగా ఒకటే చెపుతున్నా.

దేశాన్ని ఏకతాటిపైకి తేవడం కాంగ్రెస్‌తోనే సాధ్యం. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే ఆరెస్సెస్‌కు, బీజేపీకి వేసినట్టే. కానీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే వాటికి వ్యతిరేకంగా ఓటేసినట్టు. అందుకే అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కాంగ్రెస్‌ను గెలిపించండి.’అని రాహుల్‌ తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సభలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు గీతారెడ్డి, షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జహీరాబాద్, మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు కె.మదన్‌మోహన్‌రావు, గాలి అనిల్‌కుమార్‌లతో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
మోదీ, కేసీఆర్‌ అబద్ధాలు
పీఎం, సీఎంలు రోజుకో కొత్త అబద్ధం చెబుతూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వనపర్తిలో జరిగిన సభలో రాహుల్‌ విమర్శించారు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభనుద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్, దేశంలో మోదీ దోపిడికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో మోదీ సహకారంతో రూ.3.50లక్షల కోట్ల అప్పులను సంపన్న వర్గాలు ఎగ్గొట్టాయని ఆరోపించారు. తెలంగాణలో ఒకే కుటుంబం సర్వం దోపిడీ చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ఆర్థికవేత్తలు, మేధావులతో చర్చించిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని, తాము అధికారంలోకి రాగానే ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.72వేలు మహిళల ఖాతాలలో జమచేస్తామని చెప్పారు.  
 
రీడిజైనింగ్‌ పేరుతో దోపిడీ
రాష్ట్రానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్‌ భీమా, జూరాల, కోయిల్‌సాగర్‌ వంటి ఎన్నో ప్రాజెక్టులను మంజూరు చేసి పనులు చేపట్టిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా కాంగ్రెస్‌ మంజూరు చేసిందని చెప్పారు. ప్రాజెక్టుల రీ–డిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ కుటుంబం దోపిడీ చేస్తోందని విమర్శించారు. ప్రజలు సాధించుకున్న తెలంగాణలో ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చట్ట సభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు, డ్వాక్రా సంఘాలు దేశానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని చేనేత వస్త్రాలను జీఎస్టీ నుంచి మినహాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య కాదని, మోదీ నాయకత్వంలోని బీజేపీ, రాహుల్‌ నాయకత్వంలోని కాంగ్రెస్‌ మధ్య అని గుర్తించుకోవాలన్నారు.
 
గుత్తేదారులకే లాభం
నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల దేశంలో గుత్తేదారులకే లాభం జరిగిందని నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని హుజూర్‌నగర్‌లో జరిగిన సభలో రాహుల్‌ ఆరోపించారు. మోదీ హయాంలో బడా పారిశ్రామికవేత్తలకు తప్ప సామాన్యులను బ్యాంకు రుణాలు అందలేదని, నీరవ్‌ మోదీ వంటి వారికి రూ.35వేల కోట్లు కట్టబెట్టారని, విజయమాల్యా వంటి దేశద్రోహులకు వేల కోట్లు కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలోని ప్రధానమైన ఐదు ఎయిర్‌ పోర్టులను ఒకే గుత్త పెట్టుబడిదారుని చేతిలో పెట్టారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మోదీకి ఓటేసినట్లేనని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే.. ఏడాదిలో 22లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. 2020 వరకు అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. దేశంలో రైతాంగం అప్పుల పాలై ఆత్మహత్యల పాలవుతోందని, అయినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని రాహుల్‌ విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే కచ్చితంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) పెంచుతామని హామీ ఇచ్చారు. పేద వారిని వెతికి వెతికి పట్టుకొని వారి కుటుంబాలకు ప్రతినెలా 6 వేల రూపాయలు అకౌంట్‌లో వేస్తామని అన్నారు. తెలంగాణలో కనీస మద్దతు ధర కావాలన్న రైతులను కేసీఆర్‌ జైళ్లో పెడుతున్నారని విమర్శించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top