బీసీలపై చంద్రబాబు కుట్ర..!

R krishnaiah commented over chandra babu naidu  - Sakshi

ఆ న్యాయవాదులను జడ్జిలు కాకుండా అడ్డుకోవడమేంటి?

బీసీలకు సీఎం అన్యాయం చేస్తున్నారు

బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, అమరావతి: బీసీ న్యాయవాదులను న్యాయమూర్తులు కాకుండా సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఏముంటుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి బీసీలు మద్దతు ఇచ్చారని, కానీ, ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. విజయవాడలో గురువారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఉన్నత స్థానాల్లో బీసీలు ఉండకూడదనే కుట్ర సీఎం మనసులో ఉండటం ఏమిటని ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తే ఒప్పుకునేది లేదని, బీసీ కార్యకర్తలందరూ పార్టీ పెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు లేఖను బీసీ న్యాయవాదులు, బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆరుగురు బీసీ న్యాయవాదులు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకోవడం అంటే బీసీలకు అన్యాయం చేయడమేనన్నారు.

కొలీజియం తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా సీఎం చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఏకంగా హైకోర్టునే తప్పుబట్టారంటే ఆయన బీసీలపట్ల ఏ విధమైన ఆలోచనా విధానంతో ఉన్నారో అర్థమవుతోందన్నారు. ఓట్ల కోసం బీసీలను దేశంలోని రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. బీసీలకు రాజ్యాంగాధికారం లక్ష్యంగా కొత్త పార్టీ ఏర్పాటుకు తగిన సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీలో బీసీలకు చంద్రబాబు పూర్తిగా అన్యాయం చేశారన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top