పంజాబ్‌ బరి.. పరాజితుల గురి

Punjab elections: BJP is contesting with Shiromani Akali Dal - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన పలువురు అభ్యర్థులు..   లోక్‌సభ స్థానాల్లో పోటీ

బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌.. మూడు పార్టీల్లోనూ అదృష్ట పరీక్ష

సార్వత్రిక ఎన్నికల చివరి దశలో పోలింగ్‌ జరుపుకోనున్న పంజాబ్‌లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప ఎన్నికల్లోనూ బీజేపీ–శిరోమణి అకాలీదళ్‌ను మట్టి కరిపించిన కాంగ్రెస్‌ మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా, కూటమి బలంతో తాము ముందంజ వేస్తామని బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌.. కాంగ్రెస్‌లలో ఈసారి ఓ సారూప్యత మాత్రం కనిపిస్తోంది. ఇరు పార్టీలు కూడా కీలక స్థానాల్లో రెండేళ్ల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారినే లోక్‌సభ బరిలో నిలిపింది.

పంజాబ్‌ ఎన్నికల్లో ఈసారి బీజేపీ.. శిరోమణి అకాలీదళ్‌తో కలిసి పోటీ చేస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ.. శిరోమణి అకాలీదళ్‌ రెబెల్‌ వర్గం అకాలీదళ్‌ (తక్‌సలీ)తో పొత్తు కుదుర్చుకుంది. కాంగ్రెస్‌ మాత్రం ఒంటరిగానే బరిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. బీజేపీ – శిరోమణి అకాలీదళ్‌ 2014 నాటి సీట్ల సర్దుబాటుకే కట్టుబడి ఈసారి బరిలోకి దిగాయి. దీని ప్రకారం.. శిరోమణి అకాలీదళ్‌ పది స్థానాల్లోనూ, బీజేపీ మూడు స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి.

నాటి పరాజితులే నేటి అభ్యర్థులు
2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లోని మొత్తం 117 స్థానాల్లో మూడింట రెండు వంతులు గెలుచుకుని కాంగ్రెస్‌ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల విరామం తరువాత మళ్లీ పంజాబ్‌లో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ఈ లోక్‌సభ ఎన్నికలకు గాను ఇప్పటికే 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఫతేఘర్‌ సాహెబ్‌ (రిజర్వుడ్‌) స్థానం నుంచి మాజీ ఐఏఎస్‌ అధికారి అమర్‌ సింగ్‌ను, ఫరీద్‌కోట్‌ నుంచి జానపద గాయకుడు మహమ్మద్‌ సాదిఖ్, సంగ్రూర్‌ నుంచి కేవల్‌ సింగ్‌ థిల్లోన్, గురుదాస్‌పూర్‌ నుంచి సునీల్‌ జాక్కడ్‌ను బరిలోకి దింపింది. 
n అమర్‌సింగ్, మహమ్మద్‌ సాదిక్‌ రైకోట్, జైతూ అసెంబ్లీ స్థానాల్లో దాదాపు పదివేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 
n ధిల్లోన్, జాక్కడ్‌ తక్కువ తేడాతో బర్నాలా, అబోహర్‌ స్థానాల్లో ఓడిపోయారు. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షుడిగా నియమితులైన జాక్కడ్‌ గురుదాస్‌పూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడం గమనార్హం.

బీజేపీలోనూ అదే తీరు..
శిరోమణి అకాలీదళ్‌ కూడా ఈసారి ఎన్నికల్లో అసెంబ్లీ పరాజితులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. బీజేపీతో కుదిరిన ఒప్పందం మేరకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్‌ పది స్థానాలకు పోటీ పడుతోంది. ఇప్పటివరకు వీటిలో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

►మాజీ మంత్రులు గుల్జార్‌సింగ్‌ రణికే, సుర్జీత్‌ సింగ్‌ రఖ్రాతో పాటు మాజీ ఐఏఎస్‌ అధికారి దర్బారా సింగ్‌ గురు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తమ స్థానాలను కోల్పోయిన వారే. 
► గుల్జార్‌ సింగ్, సుర్జీత్‌ సింగ్‌ ఈ సారి ఫరీద్‌కోట్, పటియాలా నుంచి పోటీ చేస్తుండగా దర్బారా సింగ్‌ ఫతేఘర్‌ సాహెబ్‌ నుంచి బరిలో నిలిచారు. 
అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఓడిపోయినా.. వారిలో కొందరిని మళ్లీ లోక్‌సభ బరిలోకి దింపడానికి మరో గత్యంతరం లేకపోవడమే కారణమని శిరోమణి అకాలీదళ్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. బలమైన అభ్యర్థులు లేకపోవడం, పార్టీకి విధేయులుగా ఉండేవారు లేకపోవడంతో పాతకాపులకే మళ్లీ మళ్లీ టిక్కెట్లు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. అంతేకాకుండా అకాలీదళ్‌ మొత్తం ఆరు స్థానాల్లో పార్టీ సీనియర్లను బరిలోకి దించింది. తద్వారా పెద్దలకు గౌరవమిచ్చే పార్టీగా గుర్తింపు పొందాలని పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ ఆలోచిస్తున్నారు. 

కుమ్ములాటలతో ‘ఆప్‌’సోపాలు
ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్‌తో పోలిస్తే ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పరిస్థితి కొంత గందరగోళంగానే ఉందని చెప్పాలి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన ఆప్‌ హోషియార్‌పూర్‌ నుంచి డాక్టర్‌ రవ్‌జోత్‌ సింగ్, ఆనంద్‌పూర్‌ సాహెబ్‌ నుంచి నరీందర్‌ షేర్‌గిల్‌ను బరిలోకి దింపింది. అసెంబ్లీ ఎన్నికల్లో షామ్‌ చౌరాసి స్థానం నుంచి పోటీ చేసిన రవ్‌జోత్‌.. కాంగ్రెస్‌ అభ్యర్థి పవన్‌ ఆడియాపై 3,815 ఓట్ల తేడాలో ఓడిపోయారు. ఎస్‌ఏఎస్‌ నగర్‌ నుంచి పోటీ చేసిన నరీందర్‌ మాత్రం 28 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అలాగే 2017 ఎన్నికల్లో ఆప్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన భగవంత్‌ మాన్,కాంగ్రెస్‌ అభ్యర్థి రణ్‌వీత్‌ బిట్టూ కూడా మరోసారి లోక్‌సభ బరిలోకి దిగారు. ఇది చాలదన్నట్లు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు ఈసారి లోక్‌సభ బరిలో ఉండటం మరో విశేషం. వీరిలో ఇద్దరు ఆప్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, పంజాబ్‌ ఏక్తా పార్టీ సభ్యులైన సుఖ్‌పాల్‌ ఖైరా, బల్‌దేవ్‌ సింగ్‌లు భటిండా, ఫరీద్‌కోట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డాక్టర్‌ రాజ్‌కుమార్‌ ఛబ్బేవాల్‌ హోషియార్‌పూర్‌ నుంచి, లెహ్రా ఎమ్మెల్యే, శిరోమణి అకాలీదళ్‌ సభ్యుడైన పర్మీందర్‌ సింగ్‌ థిండ్సా సంగ్రూర్‌ నుంచి, ఆతమ్‌ నగర్‌ ఎమ్మెల్యే, లోక్‌ ఇన్సాఫ్‌ పార్టీ సభ్యుడైన సిమర్‌జీత్‌ సింగ్‌ బైన్స్‌ లుథియానా నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. 

ప్రభావం చూపే కీలకాంశాలు 
► శిరోమణి అకాలీదళ్‌ –బీజేపీ కూటమి ప్రభుత్వ హయాంలో పవిత్ర గురుగ్రంథ్‌ సాహిబ్‌ గ్రంథానికి నష్టం కలిగించడం, ఆ తరువాత కాలంలో జరిగిన ఆందోళనలో ఉద్యమకారులపై పోలీసుల కాల్పులు జరపడం
►పుల్వామా ఉగ్రదాడి.. ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌
►పాకిస్తాన్‌లోని నారోవాల్‌ వద్ద ఉన్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను గురుదాస్‌పూర్‌లోని దేరా బాబా నానక్‌ ఆలయానికి అనుసంధానించడం
► చిన్న, సన్నకారు రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయడం
► ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలం కావడం.

పంజాబ్‌లోని లోక్‌సభ స్థానాలు 13
పంజాబ్‌ అసెంబ్లీ స్థానాలు 117
మొత్తం ఓటర్లు 2.3కోట్లు
2014 లోక్‌సభ ఎన్నికలు
కాంగ్రెస్‌ 03
శిరోమణి అకాలీదళ్‌–బీజేపీ  6(4+2)
ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 04
పోలైన ఓట్ల శాతం 70.61
2017 అసెంబ్లీ ఎన్నికలు
కాంగ్రెస్‌ (షాకోట్‌ ఉప ఎన్నికల్లో మరో స్థానం దక్కింది)77
శిరోమణి అకాలీదళ్‌–బీజేపీ(షాకోట్‌ ఓటమితోశిరోమణి బలం 14కు తగ్గింది) 18(15+3)
ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)20
లోక్‌ ఇన్‌సాఫ్‌ పార్టీ02 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top